Chris Gayle : బాక్స్ బద్దలవ్వడం అంటే ఇదేనేమో..! క్రిస్ గేల్ దెబ్బకి విండో గ్లాస్ ఫసక్.. వైరల్ వీడియో..

Photo Credit : Twitter

Chris Gayle : టీ-20 ఫార్మాట్ లో బాస్ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్ (Chris Gayle). ఈ విండీస్ వీరుడు.. ఎప్పుడూ సరదాగా ఉంటాడు. గ్రౌండ్ లోపల, బయటా ఎప్పుడూ ఫుల్ జోష్ లో కన్పిస్తాడు. ఇక, ధనాధన్ క్రికెట్ లో విధ్వంసానికి మారుపేరు.

 • Share this:
  టీ-20 ఫార్మాట్ లో బాస్ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్ (Chris Gayle). ఈ విండీస్ వీరుడు.. ఎప్పుడూ సరదాగా ఉంటాడు. గ్రౌండ్ లోపల, బయటా ఎప్పుడూ ఫుల్ జోష్ లో కన్పిస్తాడు. ఇక, ధనాధన్ క్రికెట్ లో విధ్వంసానికి మారుపేరు. భారీ సిక్సర్లు అలవోకగా బాదే గేల్‌ ఎన్నోసార్లు తన పవర్‌హిట్టింగ్‌ను రుచి చూపించాడు. ఫాంలో ఉన్నాడంటే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. లేటెస్ట్ గా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (CPL) 2021లో గేల్‌ కొట్టిన భారీ సిక్స్‌కు స్కోర్‌కార్డ్‌ డిస్‌ప్లే చేసే స్ర్కీన్‌గ్లాస్‌ పగిలిపోయింది. ఏడాది విరామం తర్వాత సీపీఎల్లోకి రీఎంట్రీ ఇచ్చిన యూనివర్స్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ తన రాకను ఘనంగా చాటుకున్నాడు. సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రియోట్స్, బార్బోడస్ రాయల్స్ మధ్య గురువారం జరిగిన లీగ్ సెకండ్ మ్యాచ్‌లో యూనివర్స్ బాస్ భారీ సిక్సర్‌తో అలరించాడు. సెయింట్ కిట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గేల్.. చేసింది 12 పరుగులే అయినా భారీ సిక్సర్‌తో తన మార్క్ పెర్ఫామెన్స్ చూపించాడు. అతని సిక్స్ ధాటికి మైదానంలోని సైట్ స్క్రీన్‌పై ఉన్న విండో అద్దం బద్దలైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో (Viral Video) నెట్టింట హల్‌చల్ చేస్తోంది. గేల్ మొదలుపెట్టేశాడు.. లీగ్ మొత్తం ధనాధన్ సిక్స్‌లు బాదుతూనే ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

  ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి సెయింట్ కిట్స్ టీమ్ బ్యాటింగ్‌కు దిగగా.. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ వచ్చిన గేల్.. ప్రత్యర్థి టీమ్ కెప్టెన్ అయిన జాసన్ హోల్డర్ వేసిన 5వ ఓవర్ ఐదో బంతిని స్ట్రేట్ డ్రైవ్‌గా భారీ సిక్సర్ కొట్టాడు. బంతి కాస్త సైట్ స్క్రీన్‌ పైన ఉన్న విండో గ్లాస్‌కు గట్టిగా తగలడంతో దాని గ్లాస్ బద్దలైంది. అయితే ఓషానే థామనస్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే గేల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.ఆ వెంటనే ఆసిఫ్ అలీ కూడా ఔటవ్వడంతో 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి సెయింట్ కిట్స్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో డ్వేన్ బ్రావో (47 నాటౌట్), షెర్ఫానె రుథర్ ఫోర్డ్ (53) చెలరేగారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 115 పరుగులు జోడించారు. చివర్లో ఫాబియన్ అలెన్(19 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 175 రన్స్ చేసింది.


  బార్బడోస్ రాయల్స్‌లో ఓషానే థామన్ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ అమీర్, జాసన్ హోల్డర్ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం బార్బడస్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులే చేసి 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. షైహోప్(44), ఆజమ్ ఖాన్(24) మినహా అంతా విఫలమయ్యారు. సెయింట్ కిట్స్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్ రెండేసి వికెట్లు తీయగా.. ఫాబియన్ అలెన్ ఓ వికెట్ తీశాడు. హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రుథర్‌ఫోర్డ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. మరోవైపు, ఇంకొద్ది రోజుల్లోనే క్యాష్ రీచ్ లీగ్ ఐపీఎల్ 2021 మలిదశ కూడా ప్రారంభం కానుంది. అసలే ఫామ్ లో లేని పంజాబ్ కింగ్స్ కు యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్ అవసరం చాలా ఉంది. అతను రాణిస్తే.. కేఎల్ రాహుల్ సేనకు ఈ ఏడాది ఐపీఎల్ లో తిరుగుండదు.
  Published by:Sridhar Reddy
  First published: