హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : టోక్యో చేరుకున్న అథ్లెట్లకు కరోనా.. ప్రకటించిన జపాన్ ప్రభుత్వం.. ఆందోళనలో క్రీడాకారులు

Tokyo Olympics : టోక్యో చేరుకున్న అథ్లెట్లకు కరోనా.. ప్రకటించిన జపాన్ ప్రభుత్వం.. ఆందోళనలో క్రీడాకారులు

టోక్యో ఒలింపిక్స్ కోసం చేరుకున్న అథ్లెట్లకు కరోనా

టోక్యో ఒలింపిక్స్ కోసం చేరుకున్న అథ్లెట్లకు కరోనా

టోక్యో ఒలింపిక్స్‌పై కరోనా పంజా విసురుతున్నది. విశ్వక్రీడల ప్రారంభానికి మరో 19 రోజులే ఉండటంతో పలు దేశాల నుంచి క్రీడాకారులు టోక్యో చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అథ్లెట్లు నుంచి కరోనా కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.

టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) ప్రారంభం కావడానికి మరో 19 రోజులే ఉన్నాయి. దీంతో ప్రపంచ దేశాల నుంచి అథ్లెట్లు (Athletes) విశ్వక్రీడల కోసం జపాన్ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో సెర్బియా (Serbia)నుంచి వచ్చిన అథ్లెట్లలో ఒకరు కోవిడ్ బారిన పడినట్లు తేలుస్తున్నది. ఈ మేరకు జపాన్ ఆరోగ్య శాఖ (Japan Health Ministry) ఆదివారం ప్రకటించింది. గత వారంలో ఉగాండా (Uganda) నుంచి వచ్చిన జట్టులోని ఇద్దరు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణయ్యారు. దీంతో టోక్యో ఒలంపిక్స్ కోసం వచ్చిన వారిలో మొత్తం ముగ్గురు కరోనా బారిన పడినట్లు తెలుస్తున్నది. సెర్బియాకు చెందిన రోయింగ్ జట్టు టోక్యోలోని హెనెడా విమానాశ్రయానికి శనివారం చేరుకున్నది. వెంటనే అందరికీ యాంటీ జెన్ టెస్టులు నిర్వహించగా ఒక అథ్లెట్ పాజిటివ్‌గా తేలాడు. ఆ అథ్లెట్‌ను వెంటనే ఐసోలేషన్‌కు పంపినట్లు జపాన్ అధికారులు తెలిపారు. అతడితో పాటు ప్రయాణం చేసిన వచ్చిన మరో నలుగురు అథ్లెట్లను విమానాశ్రయం సమీపంలోని భవనంలో క్వారంటైన్‌లో ఉంచారు. షెడ్యూల్ ప్రకారం వీరందరూ తమకు కేటాయింయిన బసకు చేరుకోవాల్సి ఉన్నది. కానీ కరోనా కారణంగా విమానాశ్రయం వద్దే ఉండిపోవల్సి వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇంకా తగ్గకపోవడంతో జపాన్ ప్రభుత్వం, నిర్వాహక కమిటీ ఒలింపిక్స్ కోసం భారీగా భద్రత ఏర్పాటు చేశారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంతో పాటు ఆటగాళ్లకు వైరస్ సోకకుండా కఠినమైన ప్రోటోకాల్స్ సిద్దం చేశారు. ప్రతీ ఆటగాడు జపాన్‌లో ప్రవేశించిన దగ్గర నుంచి ఒలింపిక్స్ ముగిసే వరకు ప్లే బుక్‌లోని రూల్స్ పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఆటగాళ్లు, అధికారులు, సిబ్బంది కరోనా నియమాలను పాటించకపోతే వారిపై బహిష్కరణ వేటు వేయాల్సి ఉంటుందని నిర్వాహక కమిటీ హెచ్చరించింది. ప్రపంచ దేశాల నుంచి దాదాపు 10 వేల మంది అథ్లెట్లతో పాటు 60 వేల మంది వలంటీర్లు జపాన్ చేరుకుంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కంటైన్‌మెంట్ జోన్ కానున్నది. కొత్త వేరియంట్లు ఏర్పడే అవకాశం ఉన్నదని వైద్య నిపుణులు కూడా హెచ్చరించారు.


కరోనా కేసులు బయట పడుతుండటంతో ప్రేక్షకులను పూర్తిగా నిషేధించాలని నిర్వాహక కమిటీ భావిస్తున్నది. గతంలో 50 శాతం మంది స్వదేశీ ప్రేక్షకులను అనుమతించాలని అనుకున్నా.. కరోనా భయాందోళన మధ్య ప్రేక్షకులను పూర్తిగా నిషేధించే ఆలోచనలో ఉన్నది. ఇప్పటికే ఒక ఏడాది పాటు వాయిదా పడిన ఒలింపిక్స్ 2020ని మరోసారి వాయిదా వేసే అవకాశం లేదని నిర్వాహకులు, జపాన్ ప్రభుత్వం చెబుతున్నాయి. కానీ, మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని వైరస్ వ్యాప్తికి ఆస్కారం లేకుండా, సురక్షిత మైన ఒలింపిక్స్ నిర్వహిస్తామని అంటున్నారు.

First published:

Tags: Covid-19, Tokyo Olympics

ఉత్తమ కథలు