చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ముంబై వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆట ప్రారంభానికి ముందు సీఎస్కే ప్లేయర్ సురేష్ రైనా, కేకేఆర్ బౌలర్ హర్భజన్ సింగ్ పాదాలకు నమస్కరించాడు. ఊహించని ఈ పరిణామానికి కంగుతున్న హర్భజన్ సింగ్.. వెంటనే రైనాను పైకి లేపి, గుండెలకు హత్తుకున్నాడు. ఈ ఆత్మీయ క్షణంలో స్టేడియంలోని కెమెరాలన్నీ వీరి వైపే మళ్లాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా ఒక యూజర్ షేర్ చేయగా ఇది తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సురేష్ రైనాను మెచ్చుకుంటున్నారు. తన కంటే వయస్సులో, అనుభవంలో పెద్ద వారి పట్ల రైనా ఎంత గౌరవంగా ప్రవర్తిస్తాడో ఈ వీడియోను బట్టి చెప్పొచ్చని కామెంట్స్ చేస్తున్నారు.గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడిగా ఉన్న హర్భజన్ సింగ్, 2021 సీజన్లో మాత్రం కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే, గతేడాది బజ్జీ సీఎస్కే జట్టులో ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కారణాలతో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఈ క్రమంలో ఐపీఎల్ మినీ వేలం–2021లో భాగంగా చెన్నై ఫ్రాంచైజీ అతడిని వదులుకోగా, కేకేఆర్ రూ. 2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
హర్భజన్ సింగ్, రైనా ఇద్దరూ 2011 నాటి ప్రపంచకప్ గెలిచిన టీమిండియా జట్టు సభ్యులు కావడం విశేషం. జట్టు ఏదైనా సరే, ఆటగాళ్ల మధ్య ఇలాంటి అనుబంధం చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుందని కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. చాలా సంవత్సరాలు కలిసి ఆడిన ఈ ఇద్దరు ప్లేయర్స్ ఒకరికొకరు పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం ముచ్చటేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. వారి మధ్య ప్రేమకు ఇది నిదర్శనం అని చెబుతున్నారు.
— Sportzhustle_Squad (@sportzhustle) April 21, 2021
చివరి వరకు పోరాడినా కేకేఆర్‌కు దక్కని విజయం..
ఇక బుధవారం మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై వేదికగా జరిగిన పోరులో కొల్కతాపై చెన్నై విజయం సాధించింది. 18 పరుగుల తేడాతో కోల్‌కతాను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్లు డుప్లిసిస్ 60 బంతుల్లో 95 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 42 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించారు. చెన్నై విధించిన 221 పరుగుల లక్ష్య చేధనలో 19.1 ఓవర్లలో 202 పరుగుకే కుప్పకూలిపోయింది కోల్‌కతా జట్టు. పాట్ కమిన్స్ 34 బంతుల్లో 66 పరుగులు, ఆండ్రీ రస్సెల్ 22 బంతుల్లో 54 పరుగులు, దినేష్ కార్తిక్ 24 బంతుతల్లో 40 పరుగులు చేసినప్పటికీ.. వారి పోరాటం వృథా అయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Harbhajan singh, IPL 2021, Kolkata Knight Riders, Suresh raina, Viral Video