IPL 2021: ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. ఊతప్ప మెరుపులు గైక్వాడ్ పోరాటం.. ధోనీ ఫినిషింగ్ టచ్

ఐపీఎల్ 2021 ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (PC: IPL)

IPL 2021: ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫయర్‌లో ఢిల్లీపై చెన్నై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఫైనల్స్ వెళ్లడానికి మరో అవకాశం ఉన్నది. రెండో క్వాలిఫయర్‌లో అది ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో తలపడనున్నది.

 • Share this:
  ఐపీఎల్ 2021 (IPL 2021) ఫైనల్స్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ప్రవేశించింది. ఆదివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో చెన్నై జట్టు అద్భుత విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 173 పరుగుల టార్గెట్‌ను 19.4 ఓవర్లలోనే ఛేదించి 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట్లో రాబిన్ ఊతప్ప (63) (Robin Utappa) మెరుపులు మెరిపించగా... ఇన్నింగ్స్ మొత్తం రుతురాజ్ గైక్వాడ్ (70) (Ruthuraj Gaikwad) పోరాడాడు. చివర్లో ఎంఎస్ ధోనీ (18) (MS Dhoni) అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఢిల్లీ నిర్దేశించిన 173 పరుగుల భారీ స్కోర్ ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నయ్‌కు తొలి ఓవర్‌లోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ (1) ఎన్రిక్ నోర్జే బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. రాబిన్ ఊతప్ప ప్రమోషన్ అందుకొని ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. రావడంతో బౌండరీతో ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప కలసి పవర్ ప్లేలో ఢిల్లీ బౌలింగ్‌ను ధాటిగా ఆడారు.

  ఊతప్ప అయితే వరుసగా బౌండరీలు, సిక్సులతో విరుచుకపడ్డాడు. మరో ఎండ్‌లో ఉన్న గైక్వాడ్ కూడా అతడికి జత కలిశాడు. పవర్ ప్లే తర్వాత బ్యాటింగ్ నెమ్మదించింది. ఢిల్లీ బౌలర్లు వీరిని కట్టడి చేయడం ప్రారంభించారు. అప్పటికే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న ఊతప్ప కాస్త ఒత్తిడికి గురయ్యాడు. వీరిద్దరూ కలిసి 2వ వికెట్‌కు 110 పరుగులు జోడించారు. అయితే ఊతప్ప (63) టామ్ కర్రన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికే శార్దుల్ ఠాకూర్ (0) శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక అంబటి రాయుడు (1) అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడటంతో చెన్నయ్ బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ కలసి కాస్త పరుగులు రాబట్టారు. వీరిద్దరూ కలసి 5వ వికెట్‌కు 30 పరుగులు జోడించారు.

  T20 World Cup: అఫ్గానిస్తాన్‌కు ఐసీసీ ఝలక్ ఇవ్వనుందా? తాలిబాన్ జెండాతో వరల్డ్ కప్‌కు నిరాకరణ?

  కానీ కీలక సమయంలో రుతురాజ్ గైక్వాడ్ (70), మొయిన్ అలీ (16) వికెట్లు పడిపోయాయి. దీంతో గెలిపించే భారమంతా ధోనీపై పడింది. ఈ మధ్య అసలు ఫామ్‌లో లేని ధోనీ (18) ఒక్కసారిగా రెచ్చిపోయాడు. పాత ధోనీని తలపించేలా ఒక సిక్సు, మూడు ఫోర్లు బాది చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు తిరుగు లేని విజయాన్ని అందించాడు. చెన్నయ్ జట్టు 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. టామ్ కర్రన్ 3 వికెట్లు తీయగా ఎన్రిక్ నోర్జే, అవేశ్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
  Published by:John Naveen Kora
  First published: