హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021 : చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం.. మేం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడం.. కారణం ఇదే

IPL 2021 : చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం.. మేం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడం.. కారణం ఇదే

సంచలన నిర్ణయం తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ [PC: iplt20.com]

సంచలన నిర్ణయం తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ [PC: iplt20.com]

ఐపీఎల్ 2021 పై కరోనా దెబ్బ గట్టిగానే పడింది. ఇప్పటికే ఒక మ్యాచ్ వాయిదా పడగా.. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకున్నది. తాము రాజస్థాన్ రాయల్స్‌తో జరగాల్సిన మ్యాచ్ ఆడబోమని స్పష్టం చేసింది.

ఐపీఎల్ 2021 (IPL2021) షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు జరిగే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే బెంగళూరు-కోల్‌కతా (Royal Challengers Bengaluru Vs Kolkata Kbight Riders) మ్యాచ్ వాయిదా పడగా.. మంగళవారం జరగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్ (Sunrisers Hyderabad Vs Mumbai Indians) మ్యాచ్‌పై ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తాము రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టుతో బుధవారం జరగాల్సిన మ్యాచ్‌ను ఆడబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ అధికారి ఒకరు జాతీయ మీడియాకు వెల్లడించారు. 'కోచ్ లక్ష్మీపతి బాలాజీకి కరోనా సోకినా ఎలాంటి లక్షణాలు లేవు. అయితే బీసీసీఐ ప్రోటోకాల్స్ ప్రకారం అతడితో క్లోజ్ కాంటాక్ట్ అయిన అందరూ ఆరు రోజుల క్వారంటైన్‌కు వెళ్లారు. దీంతో రాజస్థాన్ రాయల్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో పాల్గొనే వీలు లేదు. బీసీసీఐకి టెస్టింగ్ ప్రోటోకాల్స్ గురించి తెలుసు కాబట్టి మా నిర్ణయం సబబే. ఈ ఆరు రోజుల్లో ఆటగాళ్లు పలుమార్లు టెస్టుల్లో పాల్గొనాల్సి ఉన్నది. నెగెటివ్ వచ్చిన తర్వాతే క్వారంటైన్ నుంచి బయటకు వస్తారు. ఇప్పటికే ఈ విషయాన్ని బీసీసీఐకి తెలియజేశాము. రాజస్థాన్, చెన్నై మ్యాచ్‌ను కూడా రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నది' అని సదరు అధికారి వెల్లడించారు.

రాబోయే ఆరు రోజుల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కూడా మ్యాచ్ ఆడాల్సి ఉన్నది. ఈ మ్యాచ్ కూడా జరుగుతుందో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా క్వారంటైన్‌లో ఉన్నది. దీంతో ఈ రెండు జట్ల మిగతా మ్యాచ్‌లు రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదాన సిబ్బందికి కూడా కరోనా సోకడంతో అక్కడ ప్రాక్టీస్ చేసిన జట్లు కూడా క్వారంటైన్‌కు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఈ వారంలో జరగాల్సిన మ్యాచ్‌లు సక్రమంగా జరుగుతాయో లేదో అనే సందిగ్దత ఏర్పడింది.


బీసీసీఐ కూడా కరోనా నేపథ్యంలో ఐపీఎల్ భవిష్యత్‌పై పునరాలోచనలో పడింది. ప్లాన్ బీ అమలు చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చినట్లు తెలుస్తున్నది. మిగిలిన మ్యాచ్‌లు అన్నీ ముంబైలో నిర్వహించడంపై కసరత్తు చేస్తున్నది. రాబోయే ఆదివారం నుంచి మూడో విడత మ్యాచ్‌లు బెంగళూరు చినస్వామి స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సి ఉన్నది. ఈ లోగానే బీసీసీఐ ఐపీఎల్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. జట్లన్నింటినీ ముంబైలో ఉంచాలంటే తగినన్ని హోటల్స్ వెతకాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా కొత్తగా ఎనిమిది బయోబబుల్స్ ముంబైలో ఏర్పాటు చేయాలి. ఇవన్నీ యుద్ద ప్రాతిపదికన జరగాల్సి ఉంది.

First published:

Tags: Bcci, Chennai Super Kings, Covid-19, IPL 2021, Rajasthan Royals

ఉత్తమ కథలు