టోక్సో ఒలింపిక్స్ 2020లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించాడు పానీపట్ కుర్రాడు, అథ్లెట్ నీరజ్ చోప్రా. భారత అథ్లెటిక్స్ చరిత్రలో వందేళ్ల నిరీక్షణకు తెరదించాడు మన గోల్డెన్ బాయ్. 23 ఏళ్ల ఈ హరియాణా కుర్రాడు నీరజ్.. స్వర్ణాన్ని ముద్దాడిన వేళ 139 కోట్ల భారతావనిలో సంబురాలు మిన్నంటాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ నుంచి సామాన్యుని వరకు అందరూ నీరజ్‌పై ప్రశంసలు కురిపించారు. 2012లో అండర్ 16 జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన నీరజ్.. 2015లో జాతీయ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి స్థానంలో నిలిచి వెలుగులోకి వచ్చాడు. వరల్డ్ అండర్-20 ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్‌ను ఏకంగా 86.48 మీటర్లు విసిరి రికార్డ్ నెలకొల్పి ఒక్కసారిగా భారత క్రీడాలోకాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు నీరజ్. దోహా డైమండ్ లీగ్‌లో ఏకంగా 87.43 మీటర్లు జావెలిన్ విసిరి టోక్యో ఒలింపిక్స్‌పై ఆశలు రేపాడు గోల్డెన్ బాయ్. అయితే నీరజ్ ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని ముద్దాడటానికి తనలో ఎంత ప్రతిభ ఉందో, దానికి రెట్టించిన కష్టం ఉంది. నీరజ్ ప్రతిభ, కష్టాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అతని శిక్షణకు భారీగానే ఖర్చు చేసింది. దాదాపు రూ.7 కోట్ల వరకు నిధులు ఖర్చు చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం..
విదేశాల్లో 15 నెలలు..
అయితే టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా నీరజ్ కోసం కేంద్ర ప్రభుత్వం భారీ వ్యయమే చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఇండియా లెక్కల ప్రకారం 2019లో నీరజ్ చోప్రాకు మోచేయి శస్త్ర చికిత్స తర్వాత అతనికి వ్యక్తిగత కోచ్‌గా డా.క్లాస్ బార్టోనియెట్జ్‌ను నియమితులయ్యారు. ఈయనకు ప్రభుత్వం రూ.1,22,24,880 భత్యంగా చెల్లించింది. ఈ ఒలింపిక్స్‌కు ముందు దాదాపు 15 నెలల పాటు నీరజ్ చోప్రా విదేశాల్లో శిక్షణ తీసుకున్నాడు. ఆ పోటీల్లో పాల్గొనడానికి కేంద్ర ప్రభుత్వం రూ.4,85,39,638 నిధులు ఖర్చు చేసింది. ఇక నీరజ్ కోసం కొనుగోలు చేసిన 4 జావెలిన్‌లకు రూ.4,35,000 నిధులు ఖర్చు చేసింది. ఒలింపిక్స్‌కు కొద్ది రోజుల ముందు 2021లో నీరజ్ యూరప్ టోర్నమెంట్లలో పాల్గొనడానికి దాదాపు రెండు నెలల పాటు స్వీడన్‌లో ఉన్నాడు. ఇందు కోసం కేంద్రం రూ.19,22,533 నిధులు ఖర్చు చేసిందట. ఇలా దాదాపు ఏడు కోట్ల రూపాయల వరకు నీరజ్‌పై ఖర్చు చేసింది. ఇంత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్న మాట.
కాగా, కేంద్ర ప్రభుత్వం ఆశలు వమ్ము చేయకుండా నీరజ్ దేశ మువ్వన్నెల జెండాను విశ్వక్రీడల్లో రెపరెపలాడించాడు. 139 కోట్ల జనం కళ్లల్లో ఆనందం నిలిపాడు. నీరజ్ చోప్రాకు ముందు అథ్లెట్ అభినవ్ బింద్రా షూటింగ్‌లో 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు వ్యక్తిగత విభాగంలో స్వర్ణాన్ని అందించాడు. కాగా, నీరజ్ బంగారు పతకంపై స్పందించిన కోచ్‌గా డా.క్లాస్ బార్టోనియెట్జ్... ‘‘ నేను విపరీతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నా. నీరజ్ కాంస్యం, రజతం కాదు, బంగారు పతకం సాధించాడు. అతను ప్రపంచంలోనే అత్యుత్తమ జావెలిన్ త్రోయర్ అయ్యాడు” అని ఆనందం వ్యక్తంచేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government, Games, Gold, Investment Plans, Tokyo Olympics