BIRD FLU DETECTED IN KADAKNATH CHICKENS WHICH IS TO BE SHIPPED TO MS DHONIS FARM SK
MS Dhoni: ఎంఎస్ ధోనీకి బర్డ్ ఫ్లూ టెన్షన్.. వైరస్ దెబ్బకు అంతా తలకిందులు
ms dhoni ( ఫైల్ ఫోటో)
MS dhoni: కడక్‌నాథ్ కోళ్లకు ప్రఖ్యాతిగాంచిన ఝబువా జిల్లాలోకి బర్డ్ ఫ్లూ ఎంటర్ కావడంతో.. అక్కడి నుంచి కోళ్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఉన్న కోళ్లనే చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంఎస్ ధోనీ కోళ్ల ఫారానికి కడక్‌నాథ్ పిల్లలను పంపిణీ చేయడం వీలు కాదని వినోద్ మేడా స్పష్టం చేశారు.
దేశంలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. వైరస్ బారినపడిన మరణించిన పక్షల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇంకా తెలుగు రాష్ట్రాలకు అడుగుపెట్టనప్పటికీ ఉత్తరాదిన మాత్రం భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఐతే ఈ బర్డ్ ఫ్లూ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని దెబ్బకొట్టింది. తన ఫాంహౌస్‌లో కడక్‌నాథ్ కోళ్ల పెంపకానికి అంతా సిద్ధం చేసుకున్న తర్వాత.. వైరస్ విజృంభణతో అంతా తలకిందులయింది. సాధారణ కోళ్లతో పాటు కడక్‌నాథ్ కోళ్లలోనూ H5N1 వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో.. ధోనీ ప్లాన్ మొత్తం నాశనం అయింది. దాంతో నల్ల కోళ్ల ఫామ్స్ పెట్టాలన్న ధోనీ ప్రయత్నాలు ప్రస్తుతానికి నిలిచిపోయాయి.
రాంచీలోని ఫాంహౌజ్‌లో ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్పారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ గిరిజన రైతు వినోద్ మేడాతో 2 వేళ కడక్‌నాథ్ కోడిపిల్లల పంపిణీకి సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో ధోనీ ఫామ్‌హౌస్‌కు కోడిపిల్లలను పంపేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే జబువా జిల్లాపై బర్డ్ ఫ్లూ విరుచుకుపడింది. థాండ్లా మండలంలోని రుదిపాండా గ్రామంలో ఉన్న కడక్‌నాథ్ కోళ్ల ఫామ్‌లో బర్డ్ ఫ్లూ బయటపడింది. కొన్ని కోళ్ల శాంపిల్స్ పరీక్షించగా H5N1 వైరస్ ఉన్నట్లు తేలింది. అప్రమత్తమైన అధికారులు ఆ ఫామ్ చుట్టుపక్కల ఆంక్షలు విధించారు. అక్కడ 550 పెద్ద కోళ్లు, 2,800 పిల్లలు ఉన్నాయి. ముందుజాగ్రత్తగా వాటన్నింటిని చంపేసి పూడ్చిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
కడక్‌నాథ్ కోళ్లకు ప్రఖ్యాతిగాంచిన ఝబువా జిల్లాలోకి బర్డ్ ఫ్లూ ఎంటర్ కావడంతో.. అక్కడి నుంచి కోళ్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఉన్న కోళ్లనే చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంఎస్ ధోనీ కోళ్ల ఫారానికి కడక్‌నాథ్ పిల్లలను పంపిణీ చేయడం వీలు కాదని వినోద్ మేడా స్పష్టం చేశారు. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాతే కోళ్లను పంపిస్తామని చెప్పారు. దాంతో ఎంఎస్ ధోనీ కడక్‌నాథ్ కోళ్ల పెంపకానికి బ్రేకులు పడ్డాయి. కాగా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, మంద్సౌర్, అగర్, నీముచ్, దివాస్, ఉజ్జయిని, ఖాండ్వా, ఖర్గోనే, గుణ, శిపురి, రాజ్‌గఢ్, షాజ్‌పూర్, విదిశ, భోపాల, హోషంగాబాద్, అశోక్‌నగర్, దాతియా, బర్వాని జిల్లాల్లో బర్డ్ ఫ్లూ బయటపడింది.
కడక్‌నాథ్ కోళ్ల ప్రత్యేకత
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కడక్‌నాథ్ కోళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వీటి మాంసంలో కొలెస్టరాల్ తక్కువగా ఉంటుంది. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణ చికెన్‌లో కేజీ మాంసానికి 214 మి.గ్రా. కొలెస్టరాల్, 16-17 శాతం ప్రొటీన్స్ ఉంటాయి. అదే కడక్‌నాథ్ చికెన్‌లో కేజీ మాంసానికి 184 మి.గ్రా. కొలెస్టరాల్, 27-28 శాతం ప్రోటీన్స్ ఉంటాయి. అందులో ఉన్న పోషక విలువ కారణంగా కడక్‌నాథ్ కోడిమాంసం కిలో రూ.700 నుంచి వెయ్యి దాకా పలుకుతోంది. కోడి పిల్ల ఖరీదు రూ. 100. ఒక్క కోడి గుడ్డును రూ.50కు అమ్ముతున్నారు. కడక్‌నాథ్‌కు ఇంత ధర ఎందుకో తెలుసా? ఈ కోళ్లలో ప్రతీది ప్రత్యేకతే..! కడక్‌నాథ్ కోళ్లు నల్లగా ఉంటాయి. మాంసం, గుడ్లు కూడా నలుపు రంగులోనే ఉంటాయి. ఈ కోళ్ల మాంసంంలో ఎన్నో పోషక విలువలతో పాటు అరుదైన ఔషధ లక్షణాలు ఉన్నాయి.
కడక్‌నాథ్ కోళ్ల స్వస్థలం మధ్యప్రదేశ్. అందులోనూ జబువా ప్రాంతంలోని ప్రజలు ఎక్కువగా వీటిని పెంచుతున్నారు. జబువాతో పాటు అలీరాజ్‌పూర్‌లోని భీల్, భిలాలా తెగ ప్రజలు వందల ఏళ్ల నుంచి ఈ జాతి కోళ్లను పెంచుతున్నారు. రాజస్థాన్, గుజరాత్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ కోళ్లు కనిపిస్తాయి. మొదట గిరిజనులు, కొండప్రాంతాల ప్రజలు కడక్‌నాథ్ కోళ్లను పెంచేవారు. ఐతే జబువాలోని కృషి విజ్ఞానకేంద్రం.. కడక్‌నాథ్ కోళ్ల పెంపకంపై స్థానికుల్లో అవగాహన కల్పిస్తుండడంతో ఫామ్స్ సంఖ్య పెరుగుతోంది. ఇక ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లోనూ కడక్‌నాథ్ కోళ్ల పెంపకంపై వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ధోనీ కూడా కడక్‌నాథ్ కోళ్ల పెంపకంపై దృష్టి సారించాడు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.