Home /News /sports /

BIG SHOCKING FOR CRICKET FANS FORMER AUSTRALIA ALL ROUNDER ANDREW SYMONDS DIES IN A CAR ACCIDENT AT THE AGE OF 46 SRD

Andrew Symonds Death : క్రికెట్ ఫ్యాన్స్ కు పిడుగు లాంటి వార్త.. మరో దిగ్గజ క్రికెటర్ మృతి..

Andrew Symonds

Andrew Symonds

Andrew Symonds Death : 2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ఆరంభించిన ఈ దిగ్గజ ఆటగాడు.. 26 మ్యాచ్‌ల్లో 1463 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 37.33 యావరేజ్‌తో 24 వికెట్లు పడగొట్టాడు.

    ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవలె దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అకాల మృతితో బాధపడుతున్న ఆ జట్టు ఫ్యాన్స్ కు ఇది పిడుగు లాంటి వార్త. ఆసీస్ దిగ్గజ ఆటగాడు, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు. సైమండ్స్ మృతితో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. షేన్ వార్న్ మరణం తర్వాత.. ఇప్పుడు మరో దిగ్గజ ఆటగాడు మరణించడం క్రికెట్ అభిమానులను శోకసంద్రంలో ముంచింది. సైమండ్స్ మృతి పట్ల ప్రముఖులు, మాజీ ఆటగాళ్లు, క్రీడాభిమానులు సంతాపం తెలుపుతున్నారు.

    క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రాత్రి 10:30 గంటలకు నగరానికి పశ్చిమాన 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెర్వీ రేంజ్‌లో ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. వేగంగా వెళ్తున్న కారు రోడ్డుపై బోల్తా కొట్టినట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. ప్ర‌మాద స‌మ‌యంలో ఆండ్రూ సైమండ్స్ మాత్ర‌మే కారులో ఉన్నట్టు తెలుస్తోంది.

    సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆండ్రూ సైమండ్స్‌ను రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా విఫలమయ్యారు. ఈ ప్రమాదంలో సైమండ్స్‌కు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆండ్రూను రక్షించలేకపోయారు.

    సైమండ్స్ పేరు వినగానే జడలు వేసినట్టు ఉంటే జులపాలు జట్టు.. తెల్లటి పెదాలు.. భారీ దేహం కళ్ల ముందు కదులుతుంది. సైమండ్స్ మూడు వరల్డ్ కప్ లు గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యుడు. 1998లో పాకిస్థాన్‌పై వన్డేల్లో అరంగేట్రం చేసిన సైమండ్స్.. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. మొత్తం 198 వన్డేల్లో 5088 రన్స్ చేయగా.. ఇందులో ఆరు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 37.26 యావరేజ్‌తో 133 వికెట్లు తీసుకున్నాడు. బెస్ట్ బౌలింగ్ 18 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.

    2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ఆరంభించిన ఈ దిగ్గజ ఆటగాడు.. 26 మ్యాచ్‌ల్లో 1463 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 37.33 యావరేజ్‌తో 24 వికెట్లు పడగొట్టాడు. కెరీర్‌లో 14 టీ20 మ్యాచ్‌లు ఆడి.. రెండు హాఫ్ సెంచరీల సాయంతో 337 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 8 వికెట్లు కూడా తీశాడు.

    ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్ జట్లకు సైమండ్స్ ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్‌లో సైమండ్స్‌ను డెక్కన్ ఛార్జర్స్ రూ.5.4 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం. ఆ తర్వాత అతడిని వేలంలో ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రెండు జట్ల తరఫున ఐపీఎల్ లో 974 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయ్. అయితే.. ఐపీఎల్ వేలంలో తనకు భారీ ధర పలకడంతోనే క్లార్క్ తో తన స్నేహం చెడిందని ఇటీవలే సైమండ్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Australia, Cricket, IPL, Mumbai Indians

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు