హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021: ఐపీఎల్‌కు పెద్ద ఎదురు దెబ్బ.. ఆ క్రికెట్ ప్లేయర్లు కూడా రారంటా.. లీగ్ సక్రమంగా జరిగేనా?

IPL 2021: ఐపీఎల్‌కు పెద్ద ఎదురు దెబ్బ.. ఆ క్రికెట్ ప్లేయర్లు కూడా రారంటా.. లీగ్ సక్రమంగా జరిగేనా?

ఐపీఎల్‌కు మరో అడ్డంకి.. ఆ ఆటగాళ్లు కూడా దూరం

ఐపీఎల్‌కు మరో అడ్డంకి.. ఆ ఆటగాళ్లు కూడా దూరం

ఐపీఎల్ 2021లో మిగిలిన 31 మ్యాచ్‌లు పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తున్నది. ఇప్పటికే యూఏఈ వేదికగా లీగ్ పూర్తి చేయాలని కూడా నిర్ణయించింది. కానీ ఈ మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా లేదా అనేది సందేహంగా మారింది.

కరోనా మహమ్మారి (Corona) కారణంగా బీసీసీఐకి (BCCI) అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు వాయిదా పడిన ఐపీఎల్ 2021ని (IPL 2021) ముగించి తీరాలనే పట్టుదలతో ఉన్నది. కానీ అదే సమయంలో ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లను తీసుకొని రావడానికి ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్ 9న ప్రారంభమైన ఐపీఎల్ మే 4న వాయిదా పడింది. తొలి విడత మ్యాచ్‌లు ముంబై, చెన్నైలో షెడ్యూల్ ప్రకారమే జరిగాయి. కానీ రెండో విడత మ్యాచ్‌లు ప్రారంభమైన తర్వాత పలు ఫ్రాంచైజీలలో కరోనా కేసులు బయటపడ్డాయి. పరిస్థితి చేయదాటక ముందే ఐపీఎల్ వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆటగాళ్లందరూ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. కాగా, ఐపీఎల్ పూర్తిగా రద్దు చేయడం ద్వారా బీసీసీఐ దాదాపు రూ. 2500 కోట్ల ఆదాయాన్ని కోల్పోవలసి వస్తున్నది. అదే జరిగితే బీసీసీఐ ఖజానాపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్ 2021లోని మిగిలిన 31 మ్యాచ్‌లు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నది. సెప్టెంబర్ 18 నుంచి మూడు వారాల పాటు ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నది.

అయితే ఐపీఎల్ సెకెండ్ పార్ట్‌కు ఇప్పటికే ఆసీస్ క్రికెటర్లు దూరమవుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ సెప్టెంబర్‌లో జరిగితే పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు సెప్టెంబర్ 19 లేదా 20న బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్నారని.. ఆ తర్వాత పాకిస్తాన్‌తో సిరీస్ ఆడాల్సి ఉన్నదని ఈసీబీ డైరెక్టర్ ఆష్లే గైల్స్ వెల్లడించారు. మాకు అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లను నిర్ణీత షెడ్యూల్‌లో పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. బంగ్లా, పాకిస్తాన్ సిరీస్‌ల అనంతరం టీ20 వరల్డ్ కప్ కూడా ఉన్నది. కాబట్టి ఇంగ్లాండ్ ప్లేయర్లకు ఐపీఎల్ ఆడే తీరిక, సమయం లేవు అని ఆయన స్పష్టం చేశారు. ఇంగ్లాండ్‌, ఇండియా టెస్టు సిరీస్ షెడ్యూల్‌ను మార్పు చేయాలని బీసీసీఐ విజ్ఞప్తి చేసిందన్న వార్తల నేపథ్యంలో ఆష్లే గైల్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


కాగా, బీసీసీఐ విజ్ఞప్తిని అంగీకరించడం ద్వారా ఈసీబీకి మంచి జరిగేదని.. కానీ ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నదని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మార్క్ బుచర్ వ్యాఖ్యానించారు. ఐపీఎల్‌లోని పలు ఫ్రాంచైజీల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు కీలకంగా ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఈ నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నది. మరి ఈసీబీని ఒప్పించేలా బీసీసీఐ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? లేదంటే అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే లీగ్ కంటిన్యూ చేస్తుందా అన్నది వేచి చూడాలి.

First published:

Tags: Bcci, Cricket, IPL 2021

ఉత్తమ కథలు