Cricket : ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ.. టీమ్ ఇండియాతో సిరీస్ ముందు స్టార్ పేసర్ దూరం

కీలకమైన టెస్ట్, వన్డే సిరీస్‌ల ముందు స్టార్ పేసర్ దూరం? (PC: ECB)

రాబోయే నాలుగు నెలల్లో ఇంగ్లాండ్ జట్టు నాలుగు దేశాలతో కీలకమైన సిరీస్‌లు ఆడనున్నది. ఇప్పటికే రొటేషన్ పద్దతి అనుసరిస్తున్నా.. ఇంగ్లాండ్ క్రికెటర్లు మాత్రం గాయాల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా గాయం నుంచి కోలుకున్న ఆర్చర్ మరోసారి మోచేతి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.

  • Share this:
    ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు(England Cricket Team) జూన్ మొదటి వారం నుంచి పూర్తి బిజీ షెడ్యూల్‌లో ఉండబోతున్నది. జూన్ రెండు నుంచి 14 వరకు న్యూజీలాండ్ జట్టుతో కీలకమైన రెండు టెస్టులు ఆడనున్నది. ఆ తర్వాత శ్రీలంక, పాకిస్తాన్ జట్లతో పరిమిత ఓవర్లు సిరీస్‌లు ఆడనున్నది. ఇక అగస్టు-సెప్టెంబర్ మాసాల్లో టీమ్ ఇండియాతో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉన్నది. నాలుగు నెలల వ్యవధిలో నాలుగు దేశాలతో కీలక సిరీస్‌లు ఉండటంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) తమ క్రికెటర్లను జాగ్రత్తగా కాపాడుకుంటున్నది. ఐపీఎల్ 2021 అర్దాంతరంగా వాయిదా పడటంతో ఇండియా నుంచి తిరిగి వచ్చిన ఇంగ్లాండ్ క్రికెటర్లు అందరూ ప్రస్తుతం 10 రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. వీరందరినీ న్యూజీలాండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం పక్కన పెట్టింది. జాస్ బట్లర్, టామ్ కర్రన్, సామ్ కర్రన్, జానీ బెయిర్‌స్టోలు రెడ్ బాల్ క్రికెట్ నుంచి దూరం కానున్నారు. ఐపీఎల్‌లో అనంతరం హోటల్ రూమ్స్‌కే పరిమితం కావడంతో వీరికి రెడ్ బాల్ క్రికెట్ ప్రాక్టీస్ కరువైంది. అయితే ఐపీఎల్‌కు (IPL 2021) దూరమై చేతికి శస్త్ర చికిత్స చేయించుకున్న జోఫ్రా ఆర్చర్ కూడా ఇప్పుడు జట్టుకు దూరమయ్యే పరిస్థితి ఎదురైంది. శస్త్ర చికిత్స అనంతరం కోలుకొని ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడుతున్న ఆర్చర్ (Jofra Archer) గాయం మరోసారి తిరగబెట్టింది.

    జోఫ్రా ఆర్చర్ ఫిబ్రవరిలో టీమ్ ఇండియా పర్యటనకు వచ్చాడు. ఆ సమయంలోనే చేతి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడటంతో ఐపీఎల్ కూడా ఆడకుండా ఇంగ్లాండ్ తిరిగి వెళ్లిపోయాడు. అక్కడే శస్త్ర చికిత్స అనంతరం కోలుకున్న తర్వాత ససెక్స్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే అతడు కెంట్‌తో జరుగుతున్న మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మో చేతి నొప్పి కారణంగా ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలిగాడు. అతడి గాయం తిరగబెట్టడంతో ఆడలేక మైదానం నుంచి బయటకు వచ్చేశాడు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్ వచ్చే సరికి గాయం తిరగబెట్టింది. మూడో రోజు ససెక్స్ కెప్టెన్ బెన్ బ్రౌన్ బంతిని ఆర్చర్‌కు ఇచ్చి బౌలింగ్ చేయమని అడుగగా.. అతడు నిరాకరించాడు. తనకు చేతి గాయం తిరిగి నొప్పి పెడుతుండటంతో బౌలింగ్ చేయలేనని చెప్పుకొచ్చాడు. దీంతో వేరే బౌలర్లతో బౌలింగ్ వేయించాడు.

    మరో రెండు వారాల్లో న్యూజీలాండ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ ఫిట్‌నెస్ ప్రశ్నార్థకంగా మారింది. అతడికి మరింత విశ్రాంతి అవసరమని ఈసీబీ భావిస్తున్నది. అగస్టులో టీమ్ ఇండియాతో జరిగే టెస్టు సిరీస్‌కు ఆర్చర్ అందుబాటులోకి ఉండాలంటే అతడికి మరింత విశ్రాంతిని ఇచ్చి.. గాయం పూర్తిగా మానేలా చూడాలని ఈసీబీ అనుకుంటున్నది. ఒకవేళ ఇలాగే న్యూజీలాండ్, శ్రీలంక, పాకిస్తాన్‌లతో ఆడితే గాయం మానకపోగా.. ఇండియా సిరీస్‌కు ఆర్చర్ దూరం కావల్సిన పరిస్థితి నెలకొంటుంది.
    Published by:John Naveen Kora
    First published: