BCCI vs PCB : బీసీసీఐ (BCCI), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)ల మరోసారి తారా స్థాయిలో వైరం జరుగుతోంది. మీరు మా దేశంలో జరిగే క్రికెట్ టోర్నీలో ఆడకపోతే.. తాము మీ దేశంలో జరిగే క్రికెట్ టోర్నీలో ఆడమంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ కయ్యానికి కాలు దువ్వింది. 2023లో పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ జరగాల్సి ఉంది. అదే ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ (T20 World Cup) జరగాల్సి ఉంది. మొదట పాకిస్తాన్ వేదికగా జరిగే ఆసియా కప్ లో భారత్ ఆడుతుందని వార్తలు వచ్చాయి. అయితే.. మంగళవారం జరిగిన బీసీసీఐ కార్యవర్గ సమావేశం తర్వాత కార్యదర్శి జై షా షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇది కూడా చదవండి : మళ్లీ రెచ్చిపోయిన సచిన్ తనయుడు.. ఈసారి ఏకంగా జట్టునే గెలిపించాడు
2023లో జరిగే ఆసియా కప్ పాకిస్తాన్ లో కాకుండా తటస్థ వేదికపై జరుగుతుందని.. అలా అయితేనే తాము ఆసియా కప్ లో పాల్గొంటామని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా స్పష్టం చేసినట్లు పలు వెబ్ సైట్స్ పేర్కొన్నాయి. దాంతో దీనిపై వెంటనే స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఆసియా కప్ జరిగేది తమ దేశంలోనే అని, ఒక వేళ భారత్ తమ దేశానికి రాకపోతే తాము వన్డే ప్రపంచకప్ ను బహిష్కరిస్తామని పేర్కొంది.
భారత్ చివరిసారిగా 2008లో పాకిస్తాన్ లో పర్యటించింది. అప్పుడు జరిగిన ఆసియా కప్ లో భారత్ పాల్గొంది. అయితే ఏడాది నవంబర్ లో ముంబై పై టెర్రర్ అటాక్ జరగడంతో భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు చెడిపోయాయి. ఇక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు అప్పటి నుంచి జరగడం లేదు. 2009లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాల్సి ఉన్నా.. అది కాస్తా రద్దయ్యింది. అనంతరం 2011 వన్డే, 2016 టి20 ప్రపంచకప్ ల కోసం పాక్ భారత్ లో అడుగుపెట్టింది. ఇక రెండు దేశాలు ఐసీసీ టోర్నీల్లో భాగంగానే క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్నాయి. అయితే 2023 ఐసీసీ ఫ్యూచర్ ప్లాన్ లో భాగంగా 2023లో ఆసియా కప్ పాకిస్తాన్ వేదికగా జరగనుంది. అదే సమయంలో భారత్ కూడా తన ఫ్యూచర్ సిరీస్ లలో ఆసియా కప్ ను చేర్చింది.
దాంతో భారత్ ఆసియా కప్ కోసం పాకిస్తాన్ కు వెళ్తుందని అంతా అనుకున్నారు. అయితే తాజాగా తటస్థ వేదికపై జరిగితేనే తాము ఆడతామని పేర్కొనడంతో మరోసారి ఇరు బోర్డుల మధ్య వైరం బయటపడింది. పరిస్థితులను బట్టి చూస్తే పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది ఆసియా కప్ జరిగే అవకావం కనిపించడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, IND vs PAK, India VS Pakistan, Pakistan, Team India, World cup