T20 WC in Srilanka : శ్రీలంకలో టీ20 వరల్డ్ కప్.. పావులు కదుపుతున్న బీసీసీఐ?

శ్రీలంకకు తరలనున్న టీ20 వరల్డ్ కప్?

టీ20 వరల్డ్ కప్‌పై ఇంకా సందిగ్దత వీడలేదు. ఇండియాలో వీలు కాకుంటే యూఏఈలో నిర్వహిస్తామని ఐసీసీ ఇప్పటికే బీసీసీఐ సమాచారం అందించింది. అయితే బీసీసీఐ మాత్రం ప్రత్యామ్నాయ వేదికల కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీ నిర్వహించాలని భావిస్తున్నది.

  • Share this:
    కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇప్పటికే ఇండియాలో జరగాల్సిన ఐపీఎల్ 2021ని (IPL 2021) వాయిదా వేసి మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ (UAE) కి తరలించారు. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ (BCCI) నిర్ణయం తీసుకున్నది. కాగా, కరోనా ప్రభావం ఇంకా తగ్గని నేపథ్యంలో ఇండియాలో టీ20 వరల్డ్ కప్ సాధ్యమా కాదా అని ఇప్పటికే ఐసీసీ (ICC)ఆందోళనలో ఉన్నది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్‌ను (T20 World Cup) యూఏఈ వేదికగా నిర్వహించాలని, అవసరం అయితే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఒమన్ రాజధాని మస్కట్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించాలని చెబుతున్నది. జూన్ 1న జరిగిన సమావేశంలో కూడా బీసీసీఐకి ఈ మేరకు వివరించినట్లు తెలిసిందే. అయితే యూఏఈ, ఒమన్ తరలించడం వల్ల వచ్చే ఆతిథ్య హక్కుల సమస్యల నేపథ్యంలో మరో చోట టీ20 వరల్డ్ కప్ నిర్వహించడానికి సన్నాహలు చేస్తున్నట్లు సమాచారం. ఇండియాతో పోల్చుకుంటే శ్రీలంకలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటన కూడా అక్కడ విజయవంతంగా నిర్వహించారు. దీంతో శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్ కప్ నిర్వహించడానికి బీసీసీఐ పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది.

    2021 టీ20 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులు బీసీసీఐ వద్దే ఉన్నాయి. దీంతో తమ మాట ఐసీసీ వింటుందని బీసీసీఐ భావిస్తున్నది. ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డుతో బీసీసీఐ పెద్దలు చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. టీ20 వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని శ్రీలంక క్రికెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. శ్రీలంకలో కూడా అంతర్జాతీయ స్థాయి స్టేడియంలతో పాటు 16 జట్లను ఉంచడానికి అందుబాటులో హోటల్స్ కూడా ఉన్నాయి. అందుకే శ్రీలంక యూఏఈ, ఒమన్ కంటే మెరుగైన చాయిస్ అని బీసీసీఐ భావిస్తున్నది. ఐపీఎల్ తర్వాత వారం రోజుల్లోనే టీ20 వరల్డ్ కప్ నిర్వహించాల్సి ఉన్నది. దాంటో పిచ్‌లు తాజాగా ఉంటాయో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. అందుకే శ్రీలంక అయితే తాజా పిచ్‌లు రెడీగా ఉంటాయని బీసీసీఐ వాదిస్తున్నది.

    కాగా, ఇండియాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలా వద్దా అనే విషయంపై క్లారిటీ ఇవ్వడానికి జూన్ 28 వరకు బీసీసీఐకి సమయం ఉన్నది. ఈ లోపు ఐసీసీ, శ్రీలంక క్రికెట్, ఈసీబీలతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. జులైలో టీమ్ ఇండియా బి జట్టు శ్రీలంకలో వన్డే, టీ20 సిరీస్ కోసం పర్యటించనున్నది. ఆ పర్యటన కనుక విజయవంతం అయితే టీ20 వరల్డ్ కప్ నిర్వహణకు మార్గం సుగమమం అవుతుందని కూడా ఆలోచిస్తున్నది. ఏదేమైనా బీసీసీఐ నిర్ణయం వెలువడటానికి మరో రెండు మూడు వారాలు వేచి చూడాల్సిందే.
    Published by:John Naveen Kora
    First published: