ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ మరో రెండు రోజుల్లో ముగియనున్నది. బీసీసీఐకి (BCCI) బంగారు బాతు లాంటి ఐపీఎల్ ద్వారా భారీగా ఆదాయం వస్తున్నది. అందుకే ఈ మెగా లీగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి మరీ బీసీసీఐ లీగ్‌ను నడిపిస్తున్నది. కోవిడ్ (Covid 19) కారణంగా గత ఏడాది మొత్తం యూఏఈ వేదికల్లోనే ఐపీఎల్ నిర్వహించింది. అప్పట్లో దాదాపు రూ. 3500 కోట్లు బోర్డు ఖాతాలో చేరినట్లు తెలుస్తున్నది. ఇక ఈ ఏడాది పలు నివేదికలు, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సూచనలను పట్టించుకోకుండా ఇండియాలోనే ఐపీఎల్ ప్రారంభించింది. కానీ తొలి దశ ముగిసిన తర్వాత పలు జట్లలో కరోనా కలకలం రేగడంతో అర్దాంతరంగా వాయిదా వేసింది. ఇక సెప్టెంబర్-అక్టోబర్‌లో దొరికిన విండోను ఉపయోగించుకుంటూ యూఏఈలోనే రెండో దశను విజయవంతంగా ముగిస్తున్నది. మొత్తానికి ఈ ఏడాది రూ. 4500 కోట్ల ఆదాయాన్ని బోర్డు ఆశించింది.
ఐపీఎల్ రెండు దశల్లో నిర్వహించడంతో బోర్డుకు బాగానే ఖర్చు అయ్యింది. తొలి దశలో టీవీల్లో ప్రేక్షకులు బాగానే చూశారు. తీరా రెండో దశకు వచ్చే సరికి వీక్షకుల సంఖ్య 20 శాతం తగ్గిపోయినట్లు తెలుస్తున్నది. దీంతో బీసీసీఐ ఆశించిన మేర ఆదాయం రాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది రూ.4 వేల కోట్ల వరకు బీసీసీఐ ఖాతాలో చేరే అవకాశం ఉన్నది. ఐపీఎల్ ద్వారా ప్రతీ ఏడాది ఆదాయం పెరుగుతూనే ఉన్నది. కానీ కరోనా కారణంగా బయోబబుల్స్ ఏర్పాటు.. ప్రేక్షకులు లేకపోవడం వల్ల భారీగా ఆదాయాన్ని కోల్పోతూ వస్తున్నది.
బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సెంట్రల్ పూల్‌లో జమ చేస్తారు. ఈ ఆదాయంలో 50 శాతం బీసీసీఐకి చెందుతుంది. మిగిలిన 50 శాతాన్ని అన్ని ఫ్రాంచైజీలకు సమానంగా పంచుతారు. రెండో దశలో యూఏఈలో ప్రేక్షకులను అనుమతించారు. వాళ్ల ద్వారా వచ్చిన గేట్ ఆదాయాన్ని కూడా సెంట్రల్ పూల్‌లో వేయనున్నారు. మామూలుగా అయితే ఎవరి గ్రౌండ్‌లో మ్యాచ్ జరిగితే ఆ ఫ్రాంచైజీకి ఆదాయం వెళ్తుంది. కానీ ఇప్పుడు తటస్థ వేదికల్లో జరుగుతున్నందున ఆ ఆదాయాన్ని బీసీసీఐ సెంట్రల్ పూల్‌లో వేసి అన్ని జట్లకు సమానంగా పంచుతుంది.
గత సీజన్‌లో బీసీసీఐ నుంచి ఒక్కో ఫ్రాంచైజీకి దాదాపు రూ.200 కోట్లను విడతల వారీగా పంపిణీ చేశారు. ఈ సారి కూడా దాదాపు అంతే మొత్తం ఆయా ఫ్రాంచైజీలకు చేరనున్నాయి. ఈ ఆదాయం మాత్రమే కాకుండా ఆయా ఫ్రాంచైజీలు స్పాన్సర్లు, జెర్సీ స్పాన్సర్ల ద్వారా భారీగా ఆదాయాన్ని పొందుతున్నాయి. గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (Chennai Super Kings) తమ సొంతంగా దాదాపు రూ. 60 కోట్ల వరకు వెనకేసుకున్నది. అంటే ఒక్క సీజన్‌లో దాదాపు రూ. 260 కోట్ల రూపాయలు అర్జించింది. ఐపీఎల్‌లో ఉన్న 8 ఫ్రాంచైజీలు కూడా ప్రస్తుతం లాభాల్లోనే ఉన్నాయి. కాకపోతే ఆదాయ పరంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ కాస్త ఎక్కువ సంపాదిస్తున్నాయి. ఆయా జట్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.