BCCI: బీసీసీఐ సీఈవో పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం.. అర్హత ఏంటి? ఎలా అప్లయ్ చేయాలంటే..!

బీసీసీఐకి కొత్త సీఈవో.. అనుభవం, అర్హత వివరాలు ఇవే..!

బీసీసీఐ కోసం పూర్తి స్థాయి సీఈవోను నియమించడానికి రంగం సిద్దం అవుతున్నది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనున్నట్లు బీసీసీఐ పేర్కొన్నది.

 • Share this:
  ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు బీసీసీఐకి (BCCI) గత కొన్నాళ్లుగా పూర్తి స్థాయి సీఈవో (CEO) లేడు. దీంతో త్వరలోనే ఆ పోస్టును భర్తీ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. క్రికెట్‌లో పెద్దన్నగా పిలుచుకునే బీసీసీఐలో సీఈవో పోస్టు దక్కాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలూ ఉంటే పోస్టు దక్కడం చాలా సులభమే. గత శనివారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్, సంయుక్త కార్యదర్శి జయేష్ జార్జ్ సమావేశం అయ్యారు. ఇందులో ప్రధాన అజెండా కొత్త సీఈవో నియామకమే. గతంలో సీఈవో పని చేసిన రాహుల్ జోహ్రీపై అనేక ఆరోపణలు రావడంతో బీసీసీఐ అతడిని తొలగించి.. ఐపీఎల్ సీవోవో హేమంగ్ అమిన్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది. గతంలో సీఈవో నియామక వ్యవహారాన్ని ఒక ఏజెన్సీకి అప్పగించారు. అయితే ఈ సారి కూడా ఏజెన్సీ ద్వారానే దరఖాస్తులు స్వీకరిస్తారా? లేదా నేరుగా బీసీసీఐ దరఖాస్తులు తీసుకుంటుందా అనేది త్వరలో చెబుతామని ఒక అధికారి చెప్పారు. దీనికి సంబంధించిన అర్హతలను మాత్రం బీసీసీఐ వెల్లడించింది.

  బీసీసీఐ సీఈవో పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కనీసం రూ. 100 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్ పోస్టులో 10 ఏళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి. భారతీయుడై ఉండటంతో పాటు క్రికెట్‌కు సంబంధించిన పరిజ్ఞానం కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. దీనికి సంబంధినిన నోటిఫికేషన్ త్వరలోనే బీసీసీఐ వెబ్‌సైట్‌లో ప్రచురించనున్నారు. ప్రస్తుతం తాత్కాలిక సీఈవోగా ఉన్న హేమంగ్ అమిన్ కూడా ఆసక్తి ఉంటే ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా, హేమంగ్ అమిన్ పేరును బీసీసీఐ ఆటోమెటిక్‌గా జాబితాలో చేర్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.

  మరోవైపు శనివారం జరిగిన సమావేశంలో ఇతర విషయాలపై చర్చించారు. జాతీయ క్రికెట్ అకాడమీ ప్రస్తుతం బెంగళూరు లోని చినస్వామి స్టేడియం ఆవరణలో కొనసాగుతున్నది. త్వరలోనే అక్కడి నుంచి తరలించడానికి బీసీసీఐ నిర్ణయించింది. బెంగళూరులోనే బీసీసీఐ సొంతగా స్థలం కొనుగోలు చేసింది. అక్కడ అంతర్జాతీయ స్థాయిలో జాతీయ క్రికెట్ అకాడమీని నెలకొల్పాలని భావిస్తున్నది, దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వడానికి ప్రైస్ వాటర్ కూపర్ అనే సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తున్నది. మరోవైపు అండర్-23 కేటగిరీలో నిర్వహిస్తున్న సీకే నాయుడు టోర్నమెంట్‌ను ఇకపై అండర్-25 అంతర్‌రాష్ట్ర టోర్నమెంట్‌గా అప్ గ్రేడ్ చేశారు. రంజీ ట్రోఫీ జట్టులో స్థానం దొరకని క్రికెటర్లను ఈ టోర్నీకి ఎంపిక చేస్తారని బీసీసీఐ చెబుతున్నది. జాతీయ జట్టులో స్థానం దక్కని యువ క్రికెటర్ల కోసం ఇండియా-ఏ జట్టు ఎలా ఉన్నదో.. ఒకపై ప్రతీ రాష్ట్రానికి ఒక ఏ జట్టు ఉండబోతున్నది.
  Published by:John Naveen Kora
  First published: