టీమ్ ఇండియా (Team India) ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఐపీఎల్ 2021 (IPL 2021) రెండో దశ కోసం ముంబై ఇండియన్స్‌తో (Mumbai Indians) కలసి యూఏఈలో ఉన్నాడు. రెండో దశలో ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్‌లు ఆడినా తుది జట్టులో మాత్రం హార్దిక్ పాండ్యా లేడు. దీంతో అభిమానులు హార్దిక్ పాండ్యా ఎక్కడ? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం కూడా అతడి ఆరోగ్యం గురించిన పూర్తి వివరాలు బయటకు చెప్పడం లేదు. ఇటీవల బీసీసీఐ (BCCI) అన్ని ఫ్రాంచైజీలకు ఒక లేఖ రాసింది. టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ఆడే టీమ్ ఇండియా క్రికెటర్లకు సాధ్యమైనంత ఎక్కువ విశ్రాంతి కల్పించాలని.. వారిపై ఒత్తిడి లేకుండా చూడాలని కోరింది. దీంతో తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించారు. ఇక గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా విషయంల కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది.
హార్దిక్ పాండ్యా గతంలో కూడా వెన్నునొప్పితో తీవ్రంగా బాధపడ్డాడు. లండన్‌లో శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు. ఆ తర్వాత టీమ్ ఇండియాకు తిరిగి వచ్చినా.. పూర్తి స్థాయిలో రాణించలేకపోయాడు. ఆల్‌రౌండర్ కోటాలో జట్టులో స్థానం సంపాదించినా కేవలం బ్యాటింగ్‌కు పరిమితం అవుతున్నాడు. బౌలింగ్ కూడా మూడు నాలుగు ఓవర్ల కంటే ఎక్కువగా వేయలేకపోయాడు. ఒకప్పటి దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ తర్వాత అంతడి క్రేజ్ సంపాదించిన ఆల్‌రౌండర్‌గా నిలిచి హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు జట్టు అవసరాలకు తగ్గట్లుగా ఉపయోగపడటం లేదు. హార్దిక్ పాండ్యా నిజంగా ఇంకా వెన్నునొప్పితో ఉంటే బెంగళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్‌కు వెళ్లకుండా ఐపీఎల్ ఆడటానికి ఎందుకు వెళ్లాడని క్రికెట్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
హార్దిక్ పాండ్యా ఇలాగే అన్‌ఫిట్‌గా ఉండి.. వెన్నునొప్పితో కొనసాగుతూనే ఉంటే జాతీయ జట్టు నుంచి కూడా స్థానం కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. కానీ ఫిట్నెస్ లేమితో అతడు తుది జట్టులో ఉండటం కష్టమే అని తెలుస్తున్నది. ఒకవైపు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మాజీ క్రికెటర్ సాబా కరీమ్ కూడా హార్దిక్ పాండ్యా పరిస్థితిపై స్పందించాడు. హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ను గమనిస్తే అతడికి వరల్డ్ కప్‌లో ఆడే ఛాన్స్ రాకపోవచ్చని అన్నాడు. అసలు గాయంతో బాధపడుతున్న పాండ్యాను ఎందుకు సెలెక్ట్ చేశారో కూడా అర్దం కాలేదని చెప్పాడు. హార్దిక్ పాండ్యా జట్టులో కీలకమైన ఆటగాడు అనిది కాదనలేని విషయమే కానీ.. ఫిట్నెస్ లేని ఆటగాడిని ఎందుకు సెలెక్ట్ చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి. ప్రతీ ఒక్కరు ఎన్సీఏకి వెళ్లి ఫిట్నెస్ సాధిస్తుంటే పాండ్యాకు మాత్రం ఎందుకు ఈ రూల్ వర్తించడం లేదని కరీమ్ ప్రశ్నిస్తున్నాడు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.