BCCI SEEKS APPLICATIONS FOR NAC HEAD POST WHAT IS NEXT FOR RAHUL DRAVID WILL HE ACCEPT SENIOR CRICKET TEAM COACH POST JNK
BCCI: ఎన్సీఏ హెడ్ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన బీసీసీఐ.. ప్రస్తుత చీఫ్ ద్రవిడ్ దారెటు?
ఎన్ఏసీ పదవీ కాలం పూర్తి.. రాహుల్ ద్రవిడ్ పయనమెటు? (PC: Twitter/SrilankaCricket)
నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం పూర్తయ్యింది. దీంతో ఆ పోస్టు భర్తీ కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. మరి ద్రవిడ్ తర్వాత ఏం చేయబోతున్నాడు? అతడి దారెటు?
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ఏసీ) (NAC) చీఫ్ పదవి కోసం బీసీసీఐ (BCCI) నోటిఫకేషన్ (Notification) జారీ చేసింది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీ కాలం పూర్తికావొస్తున్నది. ఎన్ఏసీ చీఫ్ పదవి కాలం రెండుళ్లు మాత్రమే ఉంటుంది. ద్రవిడ్ రెండేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో ఆ పోస్టు కోసం దరఖాస్తులు కోరతూ బీసీసీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక వేళ ద్రవిడ్ కనుక ఆ పదవిలో కొనసాగాలని భావిస్తే అతను నేరుగా బీసీసీఐకి దరఖాస్తు చేసుకునే వెసులు బాటు కల్పించారు. ద్రవిడ్ ఆ పోస్టులో కొనసాగుతానంటే బీసీసీఐ కొత్త దరఖాస్తులు స్వీకరించే అవకాశం లేదు. కానీ ద్రవిడ్ నిరాకరిస్తే మాత్రం నోటిఫికేషన్ ప్రకారం నియామకాలు జరుగనున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. గత కొంత కాలంగా ద్రవిడ్ భారత సీనియర్ జట్టు కోచ్‌గా వస్తారంటూ ప్రచారం జరుగుతున్నది. ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత పరిమిత ఓవర్ల జట్టుకు తాత్కాలిక కోచ్‌గా ద్రవిడ్ సేవలు కూడా అందించారు. అప్పుడే సీనియర్ జట్టుకు కోచ్‌గా వెళ్తారా అన్న ప్రశ్నకు ద్రవిడ్ పూర్తి స్పష్టతతో జవాబు ఇవ్వలేదు. కానీ సమయం వస్తే ఏ బాధ్యతను అయినా స్వీకరిస్తానంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం టీమ్ ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, అతడి టీమ్ భరత్ అరుణ్, ఏ. శ్రీధర్, విక్రమ్ రాథోడ్ల పదవీ కాలం టీ20 వరల్డ్ కప్ తర్వాత ముగియనున్నది. రవిశాస్త్రికి ఇప్పటికే ఒకసారి పదవీ కాలం పొడిగించారు. దీంతో బీసీసీఐ సీనియర్ జట్టు కోసం కొత్త కోచింగ్ టీమ్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నది. అయితే రాహుల్ ద్రవిడ్ అయితే ఈ బాధ్యతలకు సరిగ్గా సరిపోతాడని అంటున్నారు. డబ్ల్యూటీసీ రెండో సీజన్, ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్, ఇండియాలో వన్డే వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్లు రాబోయే రెండేళ్లలో ఉన్నాయి. ఈ సమయంలో ద్రవిడ్ వంటి కోచ్ భారత జట్టుకు అవసరం అని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం జట్టులో ఉన్న యువకులు చాలా మంది ద్రవిడ్ శిక్షణలో రాటు తేలిన వారే కావడంతో అతడికి హెడ్ కోచ్ పదవి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత జట్టు బెంచ్ ఇంత పటిష్టంగా ఉండటం వెనుక ద్రవిడ్ కృషి అమోఘమని.. రాబోయే రెండేళ్లు ఇండియన్ క్రికెట్‌కు చాలా కీలకం కాబట్టి తప్పకుండా ద్రవిడ్‌కు హెచ్ కోచ్ పదవి ఇవ్వాలని క్రికెట్ నిపుణులు కూడా చెబుతున్నారు.
ఎన్ఏసీ హెడ్ పదవికి కావల్సిన అర్హతలను బీసీసీఐ నోటిఫకేషన్‌లో పేర్కొన్నది. ఇండియాకు 25 టెస్టు మ్యాచ్‌లలో ప్రాతినిథ్యం వహించడంతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలో ఇండియా ఏ లేదా ఇండియా అండర్ 19 లేదా భారత మహిళా జట్టు లేదా ఐపీఎల్లో 5 ఏళ్ల కోచింగ్ అనుభవం తప్పని సరిగా ఉండాలి. దరఖాస్తు చేసుకునే వాళ్ల వయస్సు కచ్చితంగా 60 ఏళ్ల లోపే ఉండాలని బీసీసీఐ పేర్కొన్నది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.