Sourav Ganguly : సౌరవ్ గంగూలీ (Sourav Ganguly).. ప్రత్యర్థి కవ్విస్తున్నా మనకెందుకులే అన్నట్లు సాగుతోన్న టీమిండియా (Team India) ప్లేయర్లకు దూకుడును పరిచయం చేసిన కెప్టెన్. మాటకు ఆటతోనే కాదు మాటకు మాటతోనే బదలు చెప్పాలని గట్టిగా నమ్మినవాడు. పరిస్థితులు ఎలా ఉన్నా చివరి వరకు పోరాడాలనే పట్టుదలతో టీమిండియా రూపు రేఖలనే మార్చిన ఘనుడు సౌరవ్ గంగూలీ. సచిన్ టెండూల్కర్ (Sachin tendulkar), సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) మాదిరి భారీ రికార్డులు సాధించకపోయినా.. కపిల్ దేవ్ (Kapil Dev), మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)లా ప్రపంచకప్ లు అందించకపోయినా.. టీమిండియాపై గంగూలీ తనదైన ముద్రను వేశాడు. ఫిక్సింగ్ వార్తలతో టీమిండియా పరువు పోయిన వేళ.. కెప్టెన్సీ తన వల్ల కాదంటూ సచిన్ లాంటి దిగ్గజం వెనక్కి తగ్గిన వేళ.. నేనున్నానంటూ గంగూలీ 2000వ సంవత్సరంలో ముళ్ల కిరీటాన్ని అందుకున్నాడు. అక్కడి నుంచి టీమిండియా క్రకెట్ ను మరో మెట్టుపైకి తీసుకెళ్లాడు గంగూలీ. ఆస్ట్రేలియా ,ఇంగ్లండ్ జట్ల ఆధిపత్యానికి గండి కొట్టేలా గంగూలీ టీమిండియాను ముందుండి నడిపించాడు. తన హయాంలోనే యువరాజ్ సింగ్, సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా లాంటి మ్యాచ్ విన్నర్లను టీమిండియాలోకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం బీసీసీఐ బాస్ గా ఉంటున్న సౌరవ్ గంగూలీ ఈ మధ్య కాలంలో చేస్తోన్న ప్రతి ట్వీట్ కూడా చర్చలకు తావిస్తోంది.
‘‘1992లో ఆరంభమైన నా క్రికెట్ ప్రయాణం 2022 నాటికి 30 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది. ముఖ్యంగా మీ అందరి మద్దతును అందించింది. ఈ ప్రయాణంలో భాగమైన వాళ్లు, మద్దతుదారులు, నేను ఇక్కడి వరకు రావడంలో సాయపడిన వాళ్లు అందరికీ ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నా. ఈరోజు మరింత మందికి సహాయం అందిస్తుందనిపించే ఒక కొత్త నిర్ణయం తీసుకుంటున్నా. జీవితంలో ఈ కొత్త దశలోకి అడుగుపెట్టే సమయంలో మీ మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నా’’ అని ట్వీట్ చేసిన గంగూలీ క్రికెట్, ఇటు బెంగాల్ రాజకీయాల్లో ఒక కుదుపుకు కారణం అయ్యాడు. ఈ ట్వీట్ రాగానే బీసీసీఐకి గంగూలీ త్వరలోనే రాజీనామా ఇస్తున్నాడని.. బీజేపీలో చేరనున్నట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చాయి. అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా కల్పించుకుని గంగూలీ బీసీసీఐ పదవికి రాజీనామా చేయలేదని ప్రకటించినా కూడా ఈ ఊహాగానాలకు తెరపడలేదు. తాజాగా గంగూలీ తన రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
— Sourav Ganguly (@SGanguly99) June 2, 2022
"ఇంతకుముందు చేసిన ట్వీట్ వల్ల నేను చాలా ప్రశ్నలను ఎదర్కొంటున్నా. నిస్వార్థంగా సేవ చేస్తూ దేశ ప్రగతికి కారణమవుతోన్న కొంత మందికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. గత కొన్నేళ్లుగా మనం దేశంలో విజయవంతమైన హీరోలను, ప్లేయర్లను, సీఈవోలను చూస్తున్నాం. అయితే వారి సక్సెస్ కు కారణమైన కోచ్ లు, టీచర్లకు సాయం చేసేందుకు నేను నడంబిగించాలని అనుకున్నా‘ అంటూ గంగూలీ మరో ట్వీట్ చేశాడు. దాంతో తాను రాజకీయాల్లోకి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని గంగూలీ చెప్పకనే చెప్పాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bcci, Bjp, Kapil Dev, MS Dhoni, Sachin Tendulkar, Sourav Ganguly, Sunil Gavaskar, Team India, Virat kohli