Cricket : క్రికెటర్ల మ్యాచ్ ఫీజు చెల్లించని బీసీసీఐ.. అప్పులతో రోడ్డున పడ్డ యువ క్రికెటర్

ధనిక క్రికెట్ బోర్డు.. మ్యాచ్ ఫీజులు చెల్లించట్లేదు

  • Share this:
    బీసీసీఐ (BCCI) అంటేనే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు. ఒక్కసారి బీసీసీఐ, దాని అనుబంధ క్రికెట్ అసోసియేషన్ల కాంట్రాక్టు లభిస్తే ఆ క్రికెటర్ పంట పండినట్లే. రంజీ మ్యాచ్‌లు (Ranji Trophy) ఆడినా లక్షల రూపాయలు సంపాదించ వచ్చు. కానీ ఇక్కడ ఒక రాష్ట్రానికి చెందిన క్రికెటర్లు మాత్రం ఫీజులు సకాలంలో చెల్లించకపోవడంతో అప్పుల పాలై నానా కష్టాలు పడుతున్నారు. బీసీసీఐ అనుబంధ బీహార్ క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) (BCA) తరపున క్రికెట్ ఆడుతున్న వారికి గత రెండేళ్లుగా మ్యాచ్ ఫీజులు (Match Fee) చెల్లించలేదు. ఇవాళ రేపు అంటూ దాటవేస్తూ దాదాపు రెండేళ్లు గడిచినా ఫీజలు చెల్లించకపోవడంతో క్రికెటర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. బీహార్ తరపున ఆడుతున్న అండర్-23, అండర్-19తో పాటు సీనియర్ క్రికెట్ జట్టు 2019-20, 2020-21 సీజన్లకు సంబంధించిన ఫీజుల కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఫీజులు చెల్లించడానికి కోవిడ్-19ని సాకుగా చూపారు. ఆ తర్వాత బీసీఏ సరైన వోచర్లు పంపకపోవడం వల్ల క్రికెటర్లకు ఫీజులు అందలేదని బీసీసీఐ చెబుతున్నది.

    బీహార్ క్రికెట్ అసోసియేషన్ తరపున అండర్-23 జట్టులో క్రికెట్ ఆడుతున్న ప్రశాంత్ వారి కుటుంబంలో ఏకైక సంపాదనా పరుడు. క్రికెట్ మ్యాచ్ ఫీజుల ద్వారా వచ్చే సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రశాంత్ తండ్రి 2016లో మరణించడంతో ఆ కుటుంబానికి అతడే పెద్దదిక్కుగా మారాడు. గత ఏడాది ప్రశాంత్ బయట అప్పు తెచ్చి తన అక్క పెళ్లి చేశాడు. మ్యాచ్ ఫీజు రాగానే చెల్లిస్తానని చెప్పి అధిక వడ్డీకి అప్పు తెచ్చాడు. కానీ ఏడాది గడిచినా మ్యాచ్ ఫీజులు రాకపోవడంతో అప్పుల వాళ్లు ప్రశాంత్ ఇంటిపై గొడవకు వచ్చారు. మ్యాచ్ ఫీజుల ద్వారా తనకు రూ. 8 లక్షల వరకు బీసీసీఐ చెల్లించాల్సి ఉందని.. కానీ రెండేళ్ల నుంచి ఎదురు చూసినా ఇంత వరకు పైసా రాలేదని అంటున్నాడు. ఫోన్‌లో మెసేజ్ టోన్ వినపడితే మ్యాచ్ ఫీజ్ పడినట్లు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చిందేమో అని పదే పదే చెక్ చేసుకుంటున్నానని ప్రశాంత్ వాపోయాడు. ఇది ఒక్క ప్రశాంత్ సమస్యే కాదు.. బీహార్ క్రికెట్ అసోసియేషన్ తరపున క్రికెట్ ఆడుతున్న ప్రతీ ఆటగాడి పరిస్థితి ఇలాగే ఉన్నది.

    దేశంలోని ఏ రాష్ట్రానికి రాని ఇబ్బంది కేవలం బీహార్ రాష్ట్ర క్రికెటర్లకే రావడానికి ఒక కారణం ఉన్నది. గత కొంత కాలంగా బీసీసీఐ, బీసీఏ మధ్య వివాదం నడుస్తున్నది. బీసీసీఐ అనుమతి లేకుండా టీ20 టోర్నమెంట్లు నిర్వహించడంతో బోర్డు గుర్రుగా ఉన్నది. బీసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కూడా రెండు వర్గాలుగా విడిపోయి గొడవలు పడుతుండటంతో పరిపాలన పడకేసింది. వీరి గొడవల వల్ల బీహార్ క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడుతున్న క్రికెటర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు.
    Published by:John Naveen Kora
    First published: