• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • BCCI MAY CUT SALARIES OF CRICKETERS WHO WILL ABSENT PHASE TWO IPL JNK

IPL 2021 : విదేశీ క్రికెటర్లకు బీసీసీఐ షాక్.. ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లు ఆడకపోతే ఏం చేస్తామంటే...

IPL 2021 : విదేశీ క్రికెటర్లకు బీసీసీఐ షాక్.. ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లు ఆడకపోతే ఏం చేస్తామంటే...

విదేశీ క్రికెటర్లకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న బీసీసీఐ (PC: iplt20.com)

ఐపీఎల్ ఫేజ్ 2కు తమ ఆటగాళ్లను పంపకుండా బీసీసీఐని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్న క్రికెట్ బోర్డులకు ఇది షాకింగ్ న్యూస్. విదేశీ క్రికెటర్లు కనుక యూఏఈలో జరిగే మలివిడత ఐపీఎల్‌కు హాజరుకాకపోతే వేతనాల్లో కోత విధించే అవకాశం ఉన్నది.

  • Share this:
    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)(IPL 2021) కరోనా మహమ్మారి కారణంగా అర్దాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 9న ప్రారంభమైన ఐపీఎల్ 29 మ్యాచ్‌ల అనంతరం పలువురు ఆటగాళ్లకు కరోనా సోకినట్లు తేలడంతో మే 4న వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నది. అయితే ఐపీఎల్ నిర్వహించకపోతే బీసీసీఐ(BCCI) భారీగా ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉండటంతో రెండో విడతలో మిగిలిన 31 మ్యాచ్‌లు యూఏఈ  (UAE) వేదికగా నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 10 వరకు యూఏఈలో ఐపీఎల్ సెకెండ్ ఫేజ్ జరిగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం యూఏఈలోనే ఉన్న బీసీసీఐ పాలకకులు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో చర్చలు జరుపుతున్నారు. ఆ తర్వాత ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నది. అయితే పలు దేశాలకు చెందిన క్రికెటర్లు ఐపీఎల్ 2వ ఫేజ్‌కు అందుబాటులో ఉండరని వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ ఆటగాళ్లు అయితే విదేశీ పర్యటనల్లో బిజీగా ఉండటం వల్ల ఐపీఎల్‌కు హాజరు కారని వాళ్ల బోర్డు డైరెక్టర్ ఆష్లే గైల్స్ స్పష్టం చేశారు. అలాగే ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌కు వస్తారో లేదో అనే సందిగ్దత నెలకొన్నది.,

    కాగా, రెండో విడత ఐపీఎల్‌కు ఏ క్రికెటర్ (విదేశీ, స్వదేశీ) రాకపోయినా వారికి చెల్లించే జీతాల్లో కోత విధించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. కేవలం వాళ్లు అందుబాటులో ఉన్న మ్యాచ్‌లకు మాత్రమే చెల్లింపులు చేయాలని ఫ్రాంచైజీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది. వాస్తవానికి ఏ ఆటగాడైనా గాయాలు, అనారోగ్యం కారణంగా లీగ్‌కు దూరమైతే ప్లేయర్ ఇన్స్యూరెన్స్ నుంచి చెల్లించే అవకాశం ఉన్నది. కానీ ఆటగాళ్లే స్వయంగా ఆడటానికి నిరాకరించడం లేదా సంబంధిత బోర్డు అనుమతి లేకపోవడం వల్ల గైర్హాజరు అయితే వారికి కాంట్రాక్టు మొత్తంలో నుంచి కోత విధించే హక్కు ఫ్రాంచైజీలు, బీసీసీఐకి ఉన్నది. దీంతో యూఏఈ రాని విదేశీ ఆటగాళ్ల వేతనాల్లో కోత పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే జరిగితే దాదాపు 40 మంది విదేశీ ఆటగాళ్లు భారీగా నష్టపోయే ప్రమాదం ఉన్నది.

    మరోవైపు ఆటగాళ్లతో ఉన్న కాంట్రాక్టు మొత్తంలో కొంత శాతం ఆ దేశ క్రికెట్ బోర్డుకు వెళ్తుంది. ఇప్పుడు ఆటగాళ్ల కాంట్రాక్టు మొత్తంలో కోత విధించడం వల్ల ఆయా క్రికెట్ బోర్డుల ఆదాయానికి కూడా గండి పడే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. ఏదేమైన ఐపీఎల్‌ రెండో అర్దభాగానికి సహకరించకుండా ఇబ్బంది పెట్టాలనుకున్న క్రికెట్ బోర్డులకు బీసీసీఐ ఇలా చెక్ పెడుతున్నది. దీని వల్ల అయినా ఆయా దేశాల క్రికెటర్లు తమ బోర్డులపై ఒత్తిడి తెస్తాయనేది బీసీసీఐ వ్యూహంలా కనపడుతున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు