హోమ్ /వార్తలు /క్రీడలు /

BCCI : బీసీసీఐ మాస్టర్ స్ట్రోక్... బీసీసీఐ వ్యూహానికి తలొగ్గిన ఐసీసీ.. నోర్మూసుకున్న ఇతర బోర్డులు

BCCI : బీసీసీఐ మాస్టర్ స్ట్రోక్... బీసీసీఐ వ్యూహానికి తలొగ్గిన ఐసీసీ.. నోర్మూసుకున్న ఇతర బోర్డులు

ఐసీసీకి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన బీసీసీఐ (Twitter)

ఐసీసీకి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన బీసీసీఐ (Twitter)

ఒకే దెబ్బకు అన్నింటికీ సమాధానాలు ఇచ్చింది బీసీసీఐ. ఐపీఎల్ నిర్వహణ, టీ20 వరల్డ్ కప్ తరలింపు, విదేశీ ఆటగాళ్ల హాజరు మొదలైన విషయాలన్నింటికీ తన నిర్ణయంతో సరైన సమాధానం చెప్పింది.

ప్రపంచ క్రికెట్‌కు ఐసీసీ (ICC) పెద్ద దిక్కు అయినా.. అక్కడ కూడా బీసీసీఐ (BCCI) మాటే చెల్లుతుందనేది జగమెరిగిన సత్యం. ప్రపంచంలోనే అత్యంత బలమైన, సంపన్నమైన క్రికెట్ బోర్డు బీసీసీఐకి.. కరోనా మహమ్మారి కారణంగా అన్నీ ఆటంకాలే ఏర్పడుతున్నాయి. గత ఏడాది ఐపీఎల్ (IPL 2021)మూడు నెలల ఆలస్యంగా సెప్టెంబర్‌లో నిర్వహించారు. ఇక ఈ ఏడాది 29 మ్యాచ్‌లు జరిగిన తర్వాత బయోబబుల్‌లో కరోనా కేసులు బయటపడటంతో మే 4న అర్దాంతరంగా వాయిదా వేశారు. ఒకవైపు క్యాష్ రిచ్ లీగ్ వాయిదా పడటం, ఇండియాలో పురుషుల టీ20 వరల్డ్ కప్ (ICC T20 World Cup) నిర్వహణపై నీలి మేఘాలు కమ్ముకోవడంతో బీసీసీఐకి ఏం చేయాలో పాలుపోలేదు. జూన్ 28 వరకు గడువు ఇస్తున్నట్లు ఐసీసీ చెప్పడంతో కాస్త ఉపశమనం లభించింది. కానీ నాలుగు వారాలు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు యూఏఈకి తరలించిన ఐపీఎల్ మలి దశ మ్యాచ్‌ల నిర్వహణకు కూడా ఆటంకాలు ఏర్పడుతుండటంతో బీసీసీఐ పెద్దలు తలపట్టుకున్నారు. కాగా. ఈ నెల రెండో వారంలో యూఏఈలో పర్యటించిన బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ అక్కడ ఈసీబీ పెద్దలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అదే సమయంలో ఒమన్ క్రికెట్ బోర్డుతో కూడా చర్చించారు. అందరితో కూలంకషంగా చర్చించిన తర్వాత ఐపీఎల్ మలి దశ, టీ20 వరల్డ్ కప్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా అద్భుతమైన వ్యూహాన్ని సిద్దం చేసింది.

ఇప్పటికే టీ20 వరల్డ్ కప్‌ను యూఏఈ తరలిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అంతే కాకుండా సోమవారమే ఈ విషయాన్ని ఐసీసీకి స్పష్టం చేసింది. అదే సమయంలో టీ20 వరల్డ్ కప్ ప్రిలిమినరీ మ్యాచ్‌లు ఒమన్‌లో నిర్వహించి మెయిన్ డ్రా మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఐసీసీకి వెల్లడించిన బీసీసీఐ... అధికారికంగా మాత్రం బయటకు చెప్పలేదు. ఐపీఎల్ కారణంగా యూఏఈలోని షార్జా, దుబాయ్, అబుదాబి పిచ్‌లు పాడయిపోతాయని.. అలాంటి వాటిపై వరల్డ్ కప్ ఎలా నిర్వహిస్తారంటూ పలు క్రికెట్ బోర్డులు విమర్శలు గుప్పించాయి. కాగా, 10 రోజుల ముందే తమకు స్టేడియంలో అప్పగించాలని ఐసీసీ కూడా తేల్చి చెప్పింది. వీరందరికీ ఒకే ఒక వ్యూహంతో బీసీసీఐ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది.


ఐపీఎల్ ఫేస్ 2ను సెప్టెంబర్ 17న ప్రారంభించి అక్టోబర్ 10లోపు ముగిస్తారు. అలాగే టీ20 వరల్డ్ కప్‌లోని 12 ప్రిలిమినరీ మ్యాచ్‌లను ఒమన్ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తారు. వరల్డ్ కప్‌లోని మెయిన్ లెగ్ మ్యాచ్‌లు యూఏఈలో అక్టోబర్ మూడో వారంలో ప్రారంభిస్తారు. అలా చేయడం వల్ల ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ మధ్య 10 రోజుల గ్యాప్ వస్తుంది. ఆ సమయంలో పిచ్‌లను తిరిగి పూర్తిగా సిద్దం చేయడానికి వీలు పడుతుంది. అంతే కాకుండా ఒకే వేదికలో ఐపీఎల్, టీ20 జరుగనుండటంతో విదేశీ ఆటగాళ్లు హాజరవడానికి కూడా ఇబ్బందులు ఉండవు. ఐసీసీ కోరినట్లు గానే మెయిన్ లెగ్ మ్యాచ్‌లకు 10 రోజుల ముందే స్టేడియంలు కూడా అప్పగించినట్లు అవుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే బీసీసీఐ ఒమన్‌ను వేదికగా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. మరో ఒకటి రెండు రోజుల్లో ఐపీఎల్‌తో పాటు టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ కూడా విడుదల కానున్నది.

First published:

Tags: Bcci, Cricket, ICC, IPL 2021, T20 World Cup 2021

ఉత్తమ కథలు