BCCI : టి20 ప్రపంచకప్ (T20 World Cup) తర్వాత బీసీసీఐ (BCCI) కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు నడుం బిగించింది. హాట్ ఫేవరెట్ గా టోర్నీలో అడుగుపెట్టిన భారత్ సెమీఫైనల్లో ఏ మాత్రం ఫైట్ చేయకుండానే ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో భారీ ఓటమిని చవి చూసింది. దాంతో బీసీసీఐ ప్రక్షాళనకు నడుం బిగించింది. ఇందులో భాగంగా తొలుత సెలెక్షన్ కమిటీపై వేటు వేసింది. చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీపై వేటు వేసింది. ఇందులో ఇప్పటివరకు హర్విందర్ సింగ్, సునీల్ జోషి, దేబశిష్ మొహంతి సభ్యులుగా ఉన్నారు. వీరి పదవి కాలం ఇంకా ఉన్నా.. రద్దు చేసిన బీసీసీఐ కొత్త సెలెక్షన్ కమిటీ నియామకం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 28వ తేదీ వరకు గడువు విధించింది. అదే సమయంలో కొత్తగా వచ్చే సెలెక్షన్ ప్యానల్ నిర్వహించాల్సిన బాధ్యతలపై సవివరంగా బీసీసీఐ వివరించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి : ఈ ముగ్గురిపై కన్నేసిన సన్ రైజర్స్.. ఎంతైనా సరే ఖర్చు పెట్టేందుకు సిద్ధం!
బాధ్యతలు
1. అత్యుత్తమ జట్టును ఎంపిక చేసేందుకు కృషి చేయాలి. ఆటగాళ్ల ఎంపికలో ఎటువంటి పక్షపాతం ఉండరాదు. న్యాయబద్దంగా పారదర్శకంగా ఉండాలి.
2. రిజర్వ్ బెంచ్ ను బలోపేతం చేయాలి. అందు కోసం ప్రణాళికలు వేయాలి.
3. అవసరం అయినపుడు జట్టు సమావేశాల్లో పాల్గొనాలి.
4. దేశవాలి, అంతర్జాతీయంగా భారత ప్లేయర్ల ఆటను చూసేందుకు స్టేడియాలకు వెళ్లాలి. అవసరం అయితే జట్టుతో పాటు ఉండాలి.
5. ఎప్పటికప్పుడు ఆటగాళ్ల ప్రదర్శనపై బీసీసీఐకి రిపోర్ట్ చేస్తూ ఉండాలి. జట్టు ప్రదర్శనపై ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదకలు ఇవ్వాల్సి ఉంటుంది.
6. జట్టు ఎంపిక ఇతరత్రా అంశాలపై బీసీసీఐ ఆదేశాల మేరకు మీడియాతో మాట్లాడాలి.
7. ప్రతి ఫార్మాట్‌కు సారథిని ఎంపిక చేయాలి.
8. బీసీసీఐ నియమ నిబంధనలకు కట్టుబడి పని చేయాలి
సభ్యులకు ఉండాల్సిన అర్హతలు:
1. కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి.
2. క్రికెట్‌కు వీడ్కోలు పలికి దాదాపు ఐదేళ్లు పూర్తి కావాలి.
3. ఐదుగురు సభ్యులకు వయసు పరిమితి 60 ఏళ్లులోపే ఉండాలి.
4. మొత్తం 5 సంవత్సరాల పాటు ఏదైనా క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి దరఖాస్తు చేసుకొనేందుకు అనర్హుడు.
దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 28న ఆఖరితేది. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక ప్రక్రియను మొదలు పెడుతుంది. బాధ్యతలను బట్టి చూస్తే మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించేలా కనిపిస్తుంది. అయితే ఇది ఎప్పుడు అనేది సుస్పష్టం. టి20లకు హార్దిక్ ను వచ్చే ఏడాది జనవరిలో నియమించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు కూడా వన్డేల్లో రోహిత్ కెప్టెన్ గా ఉండే అవకాశం ఉంది. ఇక టెస్టుల్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ 2022-2023 సైకిల్ వరకు రోహిత్ ఉండే అవకాశం ఉంది. అనంతరం రోహిత్ నుంచి ఆ బాధ్యతలు వేరే ప్లేయర్ తీసుకునే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Hardik Pandya, Ind vs Nz, Ind vs nz t20 series, Rohit sharma, T20 World Cup 2022, Team India