• HOME
 • »
 • NEWS
 • »
 • SPORTS
 • »
 • BCCI HAS DECIDED TO SUSPEND IPL 2021 SEASON FOR INDEFINITE PERIOD AND HERE IS THE SOME REASONS BEHIND BCCI DECISION SSR

IPL 2021 Postponed: భారత్‌లో ఒక్కరోజే 4 లక్షల కేసులొచ్చినా ఆగని ఐపీఎల్‌కు ఇప్పుడేమైందంటే..

IPL 2021 Postponed: భారత్‌లో ఒక్కరోజే 4 లక్షల కేసులొచ్చినా ఆగని ఐపీఎల్‌కు ఇప్పుడేమైందంటే..

ప్రతీకాత్మక చిత్రం

భారత్‌లో కరోనా కేసులు 4 లక్షలు దాటిన సందర్భంలో కూడా ఐపీఎల్ నిర్వహణ విషయంలో రాజీపడని బీసీసీఐ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పలు కారణాలున్నాయి. కొన్ని రోజులుగా ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్నప్పటికీ ఆటగాళ్లలో గానీ, సహాయ సిబ్బందిలో గానీ ఏ ఒక్కరికీ కరోనా సోకలేదు. కానీ.. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బయోబబుల్‌లో ఉంటున్నప్పటికీ కొందరు ఆటగాళ్లకు, సహాయ సిబ్బందికి కరోనా సోకుతున్న పరిస్థితులున్నాయి.

 • Share this:
  భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తున్న ఈ తరుణంలో ఐపీఎల్ మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా ఇవాల్టి నుంచి జరగాల్సిన మ్యాచ్‌లను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మరియు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) అత్యవసరంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, ఐపీఎల్‌లో భాగమైన ఇతర సిబ్బంది భద్రత విషయంలో బీసీసీఐ ఏమాత్రం రాజీపడదని.. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఐపీఎల్ 2021 సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. భారత్‌లో కరోనా కేసులు 4 లక్షలు దాటిన సందర్భంలో కూడా ఐపీఎల్ నిర్వహణ విషయంలో రాజీపడని బీసీసీఐ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పలు కారణాలున్నాయి. కొన్ని రోజులుగా ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్నప్పటికీ ఆటగాళ్లలో గానీ, సహాయ సిబ్బందిలో గానీ ఏ ఒక్కరికీ కరోనా సోకలేదు. కానీ.. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బయోబబుల్‌లో ఉంటున్నప్పటికీ కొందరు ఆటగాళ్లకు, సహాయ సిబ్బందికి కరోనా సోకుతున్న పరిస్థితులున్నాయి. ఈ సమయంలో ఢిల్లీ, అహ్మదాబాద్‌లో ఐపీఎల్ బబుల్స్‌లో ఉన్నవారికి కరోనా సోకడంతో మిగిలిన మ్యాచ్‌లను ముంబైలో నిర్వహించాలని తొలుత బీసీసీఐ భావించింది. కానీ.. ఐపీఎల్ నిర్వహణపై ఇప్పటికే కొందరు ప్రజలతో పాటు, విదేశీ ఆటగాళ్ల నుంచి కూడా విమర్శలు వ్యక్తం కావడంతో ఇక ఈ సీజన్‌కు మంగళం పాడటమే ఉత్తమమని బీసీసీఐ నిర్ణయించింది.

  కోల్‌కత్తా నైట్‌రైడర్స్(కేకేఆర్) బౌలర్లు సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 4న(సోమవారం) కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఏప్రిల్ 5న ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని చెప్పినప్పటికీ సన్‌రైజర్స్ ఆటగాడైన వృద్ధిమాన్ సాహా కరోనా బారిన పడటంతో ఈ మ్యాచ్ కూడా జరిగే పరిస్థితి కనిపించలేదు. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) బౌలింగ్ కోచ్ ఎల్ బాలాజీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 6న(బుధవారం) జరగాల్సిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్‌కు కూడా అనుకూల పరిస్థితులు లేవు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అమిత్ మిశ్రా కూడా కరోనా బారిన పడ్డాడు.

  ఇది కూడా చదవండి: Stay Home: బయటకు రావొద్దని ఇలా కూడా చెప్పొచ్చా.. ఇదెక్కడి మాస్ పాట మామా.. వీడియో చూస్తే..

  ఇలానే ఉంటే.. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన బీసీసీఐ అత్యవసర సమావేశం నిర్వహించి ఈ ఐపీఎల్ సీజన్‌ నిరవధికంగా వాయిదా పడినట్లు ప్రకటించింది. ఐపీఎల్‌ను నిరవధిక వాయిదా వేసిన బీసీసీఐ ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ కుటుంబంతో ఉండాలని చెప్పింది. ఐపీఎల్ 2021లో పాలుపంచుకున్న వారందరినీ సురక్షితంగా తమ స్వస్థలాలకు చేర్చేందుకు బీసీసీఐ శక్తి మేరకు ప్రయత్నిస్తుందని బీసీసీఐ అధికారిక వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. విదేశీ ఆటగాళ్లను వారి స్వస్థలాలకు తరలించే విషయంలో బీసీసీఐకి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. భారత్ నుంచి రాకపోకలపై ఇప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నిషేధం విధించాయి. ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్‌పై ఆస్ట్రేలియా ఇప్పటికే తాత్కాలిక నిషేధం విధించింది.

  ఇది కూడా చదవండి: HouseFull: ఈ హౌస్‌ఫుల్ బోర్డు సినిమా థియేటర్ ముందు కాదు.. శ్మశానం ముందు.. ఎక్కడంటే..

  అంతేకాదు, భారత్‌లో 14 రోజులు గడిపాక ఆస్ట్రేలియాకు వస్తే.. ఆ దేశస్తులకైనా ఐదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా తప్పదని ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిబంధన విధించింది. మరి.. ఐపీఎల్‌లో పాల్గొన్న ఆటగాళ్లకు, సిబ్బందికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఎంతవరకూ ఉంటుందో చూడాలి. ఇక.. న్యూజిలాండ్ కూడా భారత్ నుంచి రాకపోకలపై తాత్కాలిక నిషేధాన్ని కొనసాగిస్తోంది. ఐపీఎల్‌లో పాల్గొన్న ఆటగాళ్లలో ఎక్కువగా ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఆటగాళ్లే ఉండటం గమనార్హం.
  Published by:Sambasiva Reddy
  First published:

  అగ్ర కథనాలు