టీమ్ ఇండియా (Team India) సీనియర్ల మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు నెలకొన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కెప్టెన్ కోహ్లీపై (Virat Kohli) సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) పిర్యాదు చేసినట్లు రూమర్లు వెలువడ్డాయి. అశ్విన్‌ను కెప్టెన్ కోహ్లీ బూతులు తిట్టాడని.. డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) సందర్భంగా ఆటపై దృష్టిపెట్టకుండా నిర్లక్ష్యం వహించావంటూ అశ్విన్‌పై కోహ్లీ విరుచుకపడ్డాడని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. బీసీసీఐ కార్యదర్శి జై షాకు (Jay Shah) అశ్విన్ పిర్యాదు చేయడంతో మ్యాటర్ సీరియస్‌గా మారిందని సదరు కథనాలు పేర్కొన్నాయి. బీసీసీఐ (BCCI) పెద్దలే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేయడంతో విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడని తెలుస్తున్నది. ఈ వార్తలు గత రెండు మూడు రోజులుగా ఇండియన్ మీడియలో కూడా వస్తున్నాయి. అసలు ఏం జరిగిందని టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలు పెట్టారు.
కీలకమైన టీ20 వరల్డ్ కప్ ముందు సీనియర్ ఆటగాళ్లకు, కెప్టెన్‌కు మధ్య విభేదాలు రావడంపై బీసీసీఐతో పాటు టీమ్ ఇండియా ఫ్యాన్స్ కూడా ఆందోళనలో పడ్డారు. కోహ్లీతో విభేదాలు ఉండటం వల్లే ఎంఎస్ ధోనీని మెంటార్‌గా తీసుకొని వచ్చారని.. జట్టులో సీనియర్ల మధ్య అతడు సమన్వయం కుదురుస్తాడని బోర్డు భావించిందని కూడా సమాచారం. అయితే ఈ కథనాలపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న బీసీసీఐ ఎట్టకేలకు స్పందించింది.
కెప్టెన్ కోహ్లీ ప్రవర్తనపై బీసీసీఐకి పిర్యాదు చేశారన్న వార్తలు అన్నీ సత్యదూరాలని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నారు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని బీసీసీఐ ఏనాడూ కోహ్లీని కోరలేదని.. అది పూర్తిగా కోహ్లీ వ్యక్తిగత నిర్ణయమేనని ధుమాల్ స్పష్టం చేశారు. భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన విరాట్ కోహ్లీని మేమెందుకు తప్పుకోమంటామని ధుమాల్ ప్రశ్నించారు.
టీమ్ ఇండియాలో ఉన్న ఆటగాళ్లకు ధోనీ అంటే ఎంతో గౌరవం ఉన్నది. అతడి రాకవల్ల ఎవరికీ అవమానం జరగదు అని ధుమాల్ అభిప్రాయపడ్డాడు. టీమ్ ఇండియాలో ఎలాంటి గొడవలు లేవని.. టీ20 కోసం పూర్తిగా సన్నద్దం అవుతున్నారని ధుమాల్ పేర్కొన్నారు. ఈ సారి టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచి తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Ravichandran Ashwin, Team India, Virat kohli