Domestic cricket season : కరోనా ఎఫెక్ట్ తో దేశంలో చాలా క్రీడలు రద్దయ్యాయ్. ముఖ్యంగా కరోనా ప్రభావం దేశవాళీ క్రికెట్ పై పడింది. అయితే, కరోనా కారణంగా చాలా ఆలస్యమైన దేశవాళీ క్రికెట్ టోర్నీల నిర్వహణపై బీసీసీఐ (BCCI) ముందడుగు వేసింది. కొత్త ఏడాదిలో ప్రారంభం కానున్న దేశవాళీ సీజన్ కోసం బీసీసీఐ తీసుకుంటున్న యాక్షన్ ప్లాన్ ఏంటంటే..
కరోనా కారణంగా చాలా ఆలస్యమైన దేశవాళీ క్రికెట్ టోర్నీల నిర్వహణపై కదలిక వచ్చింది. కొత్త ఏడాది ఆరంభంలో సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీతో దేశవాళీ సీజన్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా వెల్లడించారు. బయో సెక్యూర్ హబ్‌లను ఏర్పాటు చేసి ఆరు రాష్ట్రాల్లో జనవరి 10 నుంచి 31 వరకు ముస్తాక్ అలీ టోర్నీని నిర్వహించనున్నట్లు బీసీసీఐ అనుబంధ సంఘాలకు జై షా మెయిల్ ద్వారా తెలిపారు. ముస్తాక్ అలీ టోర్నీకి సంబంధించి ఇప్పటివరకైతే వేదికల్ని నిర్ణయించలేదు. జనవరి 2 తర్వాత ఏయే వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారో ఫైనల్ కానుంది.
‘టోర్నీలో పాల్గొనాలనుకునే రాష్ట్ర జట్లు జనవరి 2వ తేదీన సంబంధిత వేదికల వద్దకు రావాల్సి ఉంటుంది. 10 నుంచి పోటీలు జరుగుతాయి. 31న ఫైనల్ నిర్వహిస్తాం. ఈ టోర్నీ గ్రూప్ దశ పోటీలు ముగిశాకే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలపై ఓ నిర్ణయం తీసుకుంటాం. ముస్తాక్ అలీతో పాటు మరో టోర్నీ నిర్వహణను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సంఘాలు ఏర్పాట్లు చేసుకోవాలి’ అని జై షా సూచనప్రాయంగా తెలిపారు.
BCCI (ఫైల్ పోటో)
ముస్తాక్ అలీ టోర్నీతో పాటు దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ షెడ్యుళ్లను సైతం బీసీసీఐ ప్రకటించనుంది. అయితే కరోనా కారణంగా ఆటగాళ్లు ఏ నిబంధనలు పాటించాలనే అంశంపై కూడా బీసీసీఐ కసరత్తు చేస్తోంది. దేశవాళీ క్రికెట్‌కు సంబంధించి బబుల్ నిబంధనలు ఉంటాయా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. కరోనా భయంతో బీసీసీఐ ఐపీఎల్-2020 ని దుబాయ్‌లో నిర్వహించారు. దాదాపు రెండు నెలల పాటు జరిగిన ఐపీఎల్‌లో కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించడంతో టోర్నీ సక్సెస్ అయ్యింది. దీంతో ఐపీఎల్ తర్వాత భారత జట్టు నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరి వెళ్లింది. అటు తర్వాత వచ్చే ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత దేశంలో జరిగే తొలి అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ అదే కానుంది.