IPL 2021 : ఐపీఎల్ పార్ట్ 2లో భారీ మార్పులు.. తక్కువ రోజులు మరిన్ని మ్యాచ్‌లు.. ఇక ఫైనల్ ఎక్కడంటే..

ఐపీఎల్ 2021 ఫైనల్ నిర్వహించేది ఎక్కడంటే..!

యూఏఈ వేదికగా ఐపీఎల్‌ను కేవలం 25 రోజుల్లో ముగించేయాలని బీసీసీఐ భావిస్తున్నది. ఒకవైపు టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ తరుముకొస్తున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా మ్యాచ్‌లు ముగించి యూఏఈ స్టేడియంలను ఐసీసీకి అప్పగించాలని బీసీసీఐ నిర్ణయించింది.

  • Share this:
    కరోనా మహమ్మారి (Covid 19) కారణంగా అర్దాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ మిగిలిన మ్యాచ్‌లు యూఏఈ (UAE) వేదికగా నిర్వహించనున్నారు. వేదికలు, లాజిస్టిక్స్, ఇతర విషయాలు చర్చించడానికి బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్ సహా ఇతర అధికారులు యూఏఈలో కీలక చర్చలు జరిపారు. బీసీసీఐ అడిగిన ప్రతీ అంశానికి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తున్నది. 25 రోజుల్లోనే 31 మ్యాచ్‌లు పూర్తి చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబర్ 17 నుంచి 19 మధ్య ఏదో ఒక రోజు ఐపీఎల్ పార్ట్ 2 ప్రారంభం కానున్నది. అక్టోబర్ 10న ఫైనల్ నిర్వహించే అవకాశం ఉన్నది. కాగా, ఐపీఎల్ వాయిదా పడే నాటికి ఉన్న షెడ్యూల్‌లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 25 రోజుల్లో 8 డబుల్ హెడర్ మ్యాచ్‌లు నిర్వహించాని అనుకుంటున్నారు. మరోవైపు ఇండియాలో టీ20 వరల్డ్ కప్ కనుక నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోతే.. ఆ టోర్నీని యూఏఈకి మార్చే అవకాశం ఉన్నది. అదే కనుక జరిగితే అక్టోబర్ 1 నాటికి యూఏఈలోని అంతర్జాతీయ స్టేడియంలు అన్నీ ఐసీసీకి అప్పగించాల్సి ఉంటుంది.

    షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18 నుంచి పురుషుల టీ20 వరల్డ్ కప్ నిర్వహించనున్నారు. అందుకే దానికి వారం ముందుగానే ఐపీఎల్ ముగించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఇండియా లేదా యూఏఈ ఎక్కడ నిర్వహించినా ఆటగాళ్లందరూ తమ జాతీయ జట్లతో చేరడానికి సమయం ఉండాలనే ఐపీఎల్‌ను త్వరగా ముంగించనున్నారు. ఐపీఎల్ చివరి దశ మ్యాచ్‌లతో పాటు ప్లేఆఫ్స్, ఫైనల్ అన్నీ ఒకే వేదికపై నిర్వహించనున్నారు. అక్టోబర్ 1 తర్వాత ఐసీసీకి అంతర్జాతీయ స్టేడియంలు అన్నీ స్వాధీనం చేయాల్సి ఉంటుంది. అయితే దుబాయ్ స్టేడియంను మాత్రం తాము ఐపీఎల్ కోసం ఉపయోగించుకుంటామని ఐసీసీకి బీసీసీఐ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దీంతో ఆ ఒక్క స్టేడియంను మాత్రం అక్టోబర్ 10 తర్వాత ఐసీసీ తమ చేతుల్లోకి తీసుకోనున్నది. దుబాయ్ లోనే ఫ్రాంచైజీలన్నీ తమ ఆటగాళ్లను ఉంచబోతున్నాయి. కాబట్టి తుది దశ మ్యాచ్‌లు, ప్లేఆఫ్స్, ఫైనల్ అన్నీ అక్కడే నిర్వహిస్తారు.

    మరోవైపు జూన్ 28 తర్వాత ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఇండియాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై జూన్ 28న ఐసీసీకి బీసీసీఐ స్పష్టత ఇవ్వాల్సి ఉన్నది. ఒక వేళ ఇండియాలోనే మెగా టోర్నీ కొనసాగించే క్రమంలో యూఏఈలోని అన్ని స్టేడియంలను వాడుకునే వీలుంటుంది. అందుకే జూన్ చివరి వారలంలో ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ లోపు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ జరిగే అవకాశం ఉన్నది. ఫ్రాంచైజీలకు ఇప్పటికే ఐపీఎల్‌కు సంబంధించిన సమాచారం పంపించారని.. త్వరలోనే విదేశీ ఆటగాళ్ల రిప్లేస్‌మెంట్ పాలసీని కూడా ప్రకటిస్తారని తెలుస్తున్నది.
    Published by:John Naveen Kora
    First published: