హోమ్ /వార్తలు /క్రీడలు /

BCCI : బీసీసీఐకే ఎదురు తిరిగి సొంతగా టీ20 లీగ్.. లీగల్ చర్యలకు సిద్దమవుతున్న బోర్డు?

BCCI : బీసీసీఐకే ఎదురు తిరిగి సొంతగా టీ20 లీగ్.. లీగల్ చర్యలకు సిద్దమవుతున్న బోర్డు?

బీసీఏ గత నెలలో నిర్వహించిన బీహార్ క్రికెట్ లీగ్

బీసీఏ గత నెలలో నిర్వహించిన బీహార్ క్రికెట్ లీగ్

ప్రపంచ క్రికెట్‌ను నడిపించే ఐసీసీనే (International Cricket council) ఒక్కోసారి బీసీసీఐని (BCCI) ఎదిరించడానికి సందేహిస్తుంటుంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, బలమైన క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ ఏది చెబితే ఐసీసీ కూడా అలా నడుచుకున్న సందర్భాలు ఉన్నాయి. బీసీసీఐ, ఈసీబీ, సీఏ అంటే బిగ్ త్రీ అని పిలుచుకుంటారు. ఇక మిగిలిన క్రికెట్ బోర్డులు వీటి మాట వినాల్సిందే. బీసీసీఐ బలం చూసి అప్పుడప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నోరు పారేసుకుంటుంది. అంతకు మించి ఇంకా ఎవరూ ఎదురు మాట్లాడరు. కానీ ఇప్పుడు సొంత దేశంలోనే తన అనుబంధ క్రికెట్ అసోసియేషన్ ఒకటి బీసీసీఐకి పంటి కింద రాయిలా మారింది. బీసీసీఐ చేసే పనులకు తామేమీ తీసి పోమంటూ ఏకుకు మేకులా వ్యవహరిస్తున్నది. అదే బీహార్ క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ)(BCA). గత కొన్నేళ్లుగా బీసీఏ, బీసీసీఐ మధ్య వ్యవహారం పూర్తిగా చెడింది. ఇక తాజాగా బీసీఏ ఒక టీ20 టోర్నమెంట్ నిర్వహించింది. బీహార్ క్రికెట్ లీగ్ పేరుతో నిర్వహించిన ఆ టోర్నీకి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని బీసీసీఐ గుర్రుగా ఉన్నది. అంతే కాకుండా ఆ టోర్నీ నిర్వహణకు ముందే నిలిపివేయాలని బీసీసీఐ లేఖ రాసినా పెడచెవిన పెట్టి మరీ టోర్నీని నిర్వహించింది.

బీసీఏ చర్యలపై మండిపడిన బీసీసీఐ గత వారం ఒక న్యాయ బృందాన్ని పాట్నాకు పంపించింది. బీహార్ క్రికెట్ అసోసియేషన్ పరిపాలనలో జరుగుతున్న వ్యవహారాలపై పూర్తి నివేదిక అందించాలని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఈ న్యాయ బృందాన్ని ఆదేశించింది. తాజాగా బీసీఏలోని మరో వర్గం బీహార్ ప్రీమియర్ లీగ్ పేరుతో మరో లీగ్ నిర్వహించేందుకు సిద్దపడింది. జూన్ 12 నుంచి పాట్నా వేదికగా ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బీసీసీఐ ఒక్కసారిగా ఖంగుతిన్నది. దీనిపై వివరణ ఇవ్వాలని.. మా అనుమతి లేకుండా ఎలాంటి క్రికెట్ లీగ్స్ నిర్వహించవద్దని బీసీఏకు బీసీసీఐ మరో లేఖ రాసింది. మరోవైపు బీహార్ క్రికెట్ అసోసియేషన్‌లో కూడా సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. బీసీఏ అపెక్స్ కమిటీలోని ఈ రెండు వర్గాల వివాదాల కారణంగానే బీహార్ ప్రీమియర్ లీగ్‌కు బీజం పడినట్లు తెలుస్తున్నది.


బీసీఏ అధ్యక్షుడు రాకేశ్ తివారీ వర్గం గత నెలలోనే బీహార్ క్రికెట్ లీగ్‌ను నిర్వహించింది. దాన్ని వెంటనే అడ్డుకోవాలని బీసీఏ కార్యదర్శి సంజయ్ కుమార్ వర్గం బోర్డుకు లేఖ రాసింది. దీనిపై స్పందించిన బీసీసీఐ... తమ అనుబంధ క్రికెట్ అసోసియేషన్లు టీ20 టోర్నమెంట్ నిర్వహించుకోవచ్చు కానీ.. ఫ్రాంచైజీలను ఆహ్వానిస్తూ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించవద్దని స్పష్టం చేసింది. క్రికెట్ అసోసియేషన్లు నిర్వహించే టీ20 లీగ్స్‌కు సంబంధించిన జట్లు కేవలం సొంతవే అయి ఉండాలని.. వాటిని ప్రైవేటు యజమానులకు విక్రయించకూడదని లేఖలో పేర్కొన్నారు.

దీంతో వెనక్కు తగ్గిన రాకేశ్ తివారీ వర్గం సొంత జట్లతోనే బీసీఎల్ నిర్వహించారు. దీన్ని ఆసరాగా తీసుకొని ఇప్పుడు కార్యదర్శి సంజయ్ కుమార్ బీహార్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తామని బోర్డుకు లేఖరాయడం చర్చనీయాంశంగా మారింది. ఇతర క్రికెట్ అసోసియేషన్లు టీ20 లీగ్స్ నిర్వహించడానికి అనుమతులు ఇచ్చి.. మాకు మాత్రం ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీంతో బీసీసీఐ, బీసీఏ మధ్య మరోసారి వివాదం రాజుకున్నది. దీనిపై బోర్డు పెద్దలు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

First published:

Tags: Bcci, Cricket, IPL 2021, T20

ఉత్తమ కథలు