పటిష్ట ఆస్ట్రేలియా టీమ్ కు బంగ్లాదేశ్ చేతిలో షాకుల మీద షాకులు తగులుతున్నాయ్. ఇప్పటికే వెస్టిండీస్ చేతిలో టీ-20 సిరీస్ కోల్పోయిన కంగారూలు.. ఇప్పుడు బంగ్లా చేతిలో కూడా ఘోరంగా ఓడిపోతున్నారు. తొలి టీ20 ఓటమి నుంచి తేరుకోకుండానే ఆసీస్‌ను వరుసగా రెండో టీ20 లో ఓడించి బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. ఢాకా వేదికగా జరిగిన రెండో టీ20లో ఆసీస్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన బంగ్లా ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బంగ్లా బౌలర్ల దాటికి 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిక్స్ 30 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 3 వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్ 2, షకీబ్, మెహదీ హసన్ చెరో వికెట్ తీశారు.
ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18.4 ఓవర్లలో5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు మహ్మద్ నయీమ్(9), సౌమ్యా సర్కార్లు(0)లు తొందరగా ఔటైనా.. షకీబ్ 26, మెహదీ హసన్ 23 పరుగులతో ఇన్నింగ్స్‌ను నిర్మించారు. చివర్లో అఫిఫ్ హొస్సేన్ 37 నాటౌట్, వికెట్ కీపర్ నూరుల్ హసన్ 22 నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను గెలిపించారు.
ఇది కూడా చదవండి : ఒలింపిక్స్ లో పతకంతో సత్తా చాటిన దిగ్గజ క్రికెటర్ కొడుకు..
ఇప్పటికే ఫస్ట్ టీ-20 గెలిచిన బంగ్లా..2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. శుక్రవారం ఇరు జట్ల మధ్య మూడో టీ-20 జరగనుంది. ఆ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని బంగ్లా భావిస్తోంది. మరోవైపు.. ఆస్ట్రేలియా ఎలాగైనా మూడో టీ-20 గెలిచి సిరీస్ లోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఇరు జట్ల మధ్య మొత్తం ఐదు టీ-20 లు జరగనున్నాయ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Bangladesh, Cricket