• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • BABAR AZAM TO BECOME WORLD NO 1 ODI BATSMAN KOHLI DROP TO 2ND RANK JNK

ICC Rankings : కోహ్లీ వన్డే టాప్ ర్యాంక్‌కు ఎసరు.. సఫారీలపై రాణించడంతో అగ్రస్థానానికి దూసుకొస్తున్న పాకిస్తాన్ క్రికెటర్

ICC Rankings : కోహ్లీ వన్డే టాప్ ర్యాంక్‌కు ఎసరు.. సఫారీలపై రాణించడంతో అగ్రస్థానానికి దూసుకొస్తున్న పాకిస్తాన్ క్రికెటర్

బాబార్ అజమ్ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోనున్నాడు.

  • Share this:
    ప్రపంచ క్రికెట్‌లో దూకుడైన ఆటకు మారు పేరు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli). ప్రత్యర్థి ఎవరైనా, ఎలాంటి పిచ్ అయినా పరుగులు చేయడంలో అతడిని మించిన వాళ్లు లేరు. అందుకే అతడిని రన్ మెషిన్ అంటుంటారు. ప్రతీ సిరీస్‌లో పరుగులు రాబడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో(ICC ODI Rankings) ఎప్పడూ టాప్-3లో ఉంటాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో విశేషంగా రాణించి రెండు అర్ద సెంచరీలు కూడా బాదడంతో రేటింగ్ పాయింట్లు పెంచుకొని అగ్రస్థానానికి చేరుకున్నాడు. అయితే కోహ్లీ టాప్ ర్యాంకుకు ఇప్పుడు ముప్పొచ్చింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్(Babar Azam) దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించాడు. దక్షిణాఫ్రికాలో చారిత్రాత్మిక వన్డే సిరీస్ గెలవడంలో బాబర్ కీలక పాత్ర పోషించాడు. తొలి వన్డేలో 103 పరుగులు, రెండో వన్డేలో 31, మూడో వన్డేలో 94 పరుగులు చేసి పాకిస్తాన్ విజయాల్లో పాలుపంచుకున్నాడు. తొలి, మూడో వన్డేలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా నిలిచాడు.

    సమకాలీన క్రికెట్‌లో విరాట్‌కు పోటీ బాబర్ ఆజమ్ నుంచే ఉంది. పలువురు క్రికెట్ విశ్లేషకులు కూడా ఏనాటికైనా కోహ్లీ రికార్డులను కొల్లగొట్టేది బాబర్ ఆజమ్ అని చెబుతుంటారు. ప్రస్తుతం సఫారీలపై చేసిన పరుగులతో ఆజమ్ ర్యాంకింగ్ పాయింట్లు మెరుగయ్యే అవకాశం ఉన్నది. వచ్చే వారం ప్రకటించబోయే ర్యాంకుల్లో బాబర్ అగ్రస్థానాన్ని చేరుకుంటాడు. బాబర్ ఆజమ్, విరాట్ కోహ్లీ మధ్య కేవలం 5 రేటింగ్ పాయింట్ల తేడా మాత్రమే ఉన్నది. ఆ పాయింట్లు త్వరలో ఐసీసీ కలపబోతున్నది. అదే జరిగితే వరల్డ్ నెంబర్ వన్ వన్డే బ్యాట్స్‌మాన్‌గా బాబర్ అజమ్ నిలుస్తాడు.

    PC : ICC


    మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టు విజయాల్లో భాగస్వామ్యం అవుతున్నా.. సెంచరీలు చేయలేకపోతున్నాడు. రెండున్నర ఏళ్లుగా అతడి ఖాతాలో సెంచరీ లేకపోవడం అభిమానులను కూడా నిరాశపరుస్తున్నది. వెస్టిండీస్‌ పర్యటనలో చివరి సారిగా 2019 అగస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఏ ఫార్మాట్‌లో కూడా సెంచరీ చేయలేకపోయాడు. అర్దసెంచరీలు నమోదవుతున్నా.. వాటిని సెంచరీలుగా మాత్రం మార్చలేకపోతున్నాడు. కోహ్లీ ఫామ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో టీమ్ ఇండియా నష్టపోవల్సి వస్తున్నది. ర్యాంకులను కోహ్లీ పెద్దగా పట్టించుకోకపోయినా.. మానసికంగా అది బలాన్నిస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే టీమ్ ఇండియా ఇప్పట్లో ఆడే వన్డే మ్యాచ్‌లు ఏమీ లేవు. దీంతో ఆజమ్ మరి కొంత కాలం వన్డే టాప్ ర్యాంకులో కొనసాగే అవకాశం ఉన్నది.
    Published by:John Naveen Kora
    First published: