Novak Djokovic : 35 ఏళ్ల వయసులోనూ సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ (Novak Djokovic ) తన జోరును కొనసాగిస్తున్నాడు. తనకు అచ్చొచ్చిన ఆస్ట్రేలియా ఓపెన్ (Australian Open)లో మరోసారి చెలరేగిపోయాడు. ఈ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ లో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో తనకంటే 11 ఏళ్లు చిన్న వాడైన స్టెఫనోస్ సిట్సిపాస్ (Stefanos Tsitsipas)పై అలవోక విజయాన్ని అందుకున్నాడు. జొకోవిచ్ 6-3, 7-6 (7/4), 7-6 (7/5) తో గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్ ను వరుస సెట్లలో మట్టికరిపించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ను రికార్డు స్థాయిలో 10వ సారి నెగ్గి కొత్త చరిత్రను లిఖించాడు. 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023లలో జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ ను నెగ్గడం విశేషం.
మొత్తం మీద 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో పురుషుల టెన్నిస్ లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన స్పెయిన్ బుల్ రాఫెల్ నడాల్ సరసన నిలిచాడు. నడాల్ కూడా తన కెరీర్ లో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను నెగ్గాడు. రోజర్ ఫెడరర్ 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో వీరి తర్వాత ఉన్నాడు. ప్రస్తుతం నొవాక్ జొకోవిచ్ ఫామ్ ను బట్టి చూస్తే ఈ ఏడాది అతడు నడాల్ ను అధిగమించడం ఖాయంలా కనిపిస్తుంది. ఇక సిట్సిపాస్ కు మరోసారి నిరాశే మిగిలింది. మరోసారి ఫైనల్లో ఓడి నిరాశ పరిచాడు. ఆస్ట్రేలియా ఓపెన్ తో పాటు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ కు చేరిన అతడు రెండింటిలోనూ ఓడి రన్నరప్ గా నిలిచాడు.
ఆట ఆరంభం నుంచే జొకోవిచ్ దూకుడు కనబరిచాడు. తొలి సెట్ ను పెద్దగా కష్టపడకుండానే సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్ లో మాత్రం సిట్సిపాస్ నుంచి జొకోవిచ్ కు గట్టి పోటీ ఎదురైంది. తొలి సెట్ లో చేసిన తప్పిదాలను రెండో సెట్ లో చేయకుండా సిట్సిపాస్ జాగ్రత్త పడ్డాడు. తన బ్యాక్ హ్యాండ్ షాట్ తో జొకోవిచ్ కు చెమటలు పట్టించాడు. దాంతో సెట్ టై బ్రేక్ కు వెళ్లింది. ఇక్కడ తన అనుభవాన్ని ఉపయోగించిన జొకోవిచ్ వరుసగా పాయింట్లు సాధిస్తూ సిట్సిపాస్ ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ క్రమంలో రెండో సెట్ ను నెగ్గి ఆధిక్యంలోకి వెళ్లాడు.
ఇక మూడో సెట్ ఆరంభంలోనే జొకోవిచ్ సర్వీస్ ను సిట్సిపాస్ బ్రేక్ చేశాడు. అయితే ఆ తర్వాత సర్వీస్ ను కోల్పోయాడు. ఆ తర్వాత వీరిద్దరూ తమ సర్వీస్ లను నిలబెట్టుకున్నారు. దాంతో మూడో సెట్ కూడా టై బ్రేక్ కు వెళ్లింది. ఇక్కడ ఒక దశలో జొకోవిచ్ 4-0తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే వరుసగా పాయింట్లు సాధించాడు. దాంతో టై బ్రేక్ స్కోరు 6-5గా నిలిచింది. అయితే ఈ దశలో తన విజయానికి కావల్సిన ఒక్క పాయింట్ ను సాధించిన జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ ను 10వ సారి ముద్దాడాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Novak Djokovic, Rafael Nadal, Roger Federer, Tennis