Australian Open 2023 : ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open) 2023 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ లో బుధవారం పెను సంచలనం నమోదైంది. 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ వీరుడు.. డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నడాల్ (Rafael Nadal) రెండో రౌండ్ లో షాక్ తిన్నాడు. అమెరికాకు చెందిన మెకంజీ మెక్ డొనాల్డ్ (Mackenzie McDonald) చేతిలో మూడు సెట్లలో నడాల్ ఓడిపోయాడు. నంబర్ వన్ సీడ్ గా ఈ టోర్నీలో అడుగుపెట్టిన నడాల్ 4-6, 4-6, 5-7తో మెకంజీ చేతిలో ఓడి ఇంటిదారి పట్టాడు. మ్యాచ్ మధ్యలో నడాల్ నడుం గాయంతో బాధపడ్డాడు. ఇంజూరీ టైమ్ ను కూడా ఉపయోగించుకున్నాడు. 23వ టైటిల్ నెగ్గుతాడన్న నడాల్ అభిమానులకు ఇది మింగుడు పడని వార్తే. నడాల్ ప్రస్తుత వయసు 36 ఏళ్లు. కెరీర్ మొత్తం గాయాలతో ఇబ్బంది పడ్డ నడాల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను నెగ్గడమంటే చిన్ని విషయం కాదు. చూస్తుంటే త్వరలోనే నడాల్ టెన్నిస్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.
తొలి రౌండ్ పోరులో 4 గంటల పాటు పోరాడి నెగ్గిన నడాల్.. అలసటతోనే రెండో రౌండ్ ను ఆరంభించాడు. మెకంజీ పదునైన సర్వీసులకు ఏ దశలోనూ సమాధానం చెప్పలేకపోయాడు. ఈ క్రమంలో మెకంజీ దూకుడు ప్రదర్శించాడు. మధ్యలో నడుం గాయం కూడా బాధపెట్టడంతో నడాల్ ఆట పేలవంగా మారింది. ఈ మ్యాచ్ లో మెకంజీ 8 ఏస్ లను సంధిస్తే.. నడాల్ ఒక్క ఏస్ ను కూడా సంధించలేకపోయాడు. పేలవ సర్వీస్ తో నడాల్ మ్యాచ్ ను కోల్పోయాడు.
Always a pleasure, @RafaelNadal ????#AusOpen • #AO2023 pic.twitter.com/CdnOMzYDK0
— #AusOpen (@AustralianOpen) January 18, 2023
మరోవైపు నొవాక్ జొకోవిచ్ టోర్నీలో శుభారంభం చేశాడు. కోవిడ్ 19 వ్యాక్సిన్ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో గొడవ కారణంగా గతేడాది జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ కు జొకోవిచ్ దూరమయ్యాడు. అయితే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి అనే నిబంధనను ఆసీస్ ప్రభుత్వం తొలగించడంతో జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో నిలిచాడు. ఈ క్రమంలో తొలి రౌండ్ లో జొకోవిచ్ 6-3, 6-4, 6-0తో రాబర్ట్ (స్పెయిన్)పై ఘనవిజయం సాధించి రెండో రౌండ్ కు అర్హత సాధించాడు. ఇక గతేడాది జరిగిన యూఎస్ ఓపెన్ విన్నర్ అల్కరాజ్ ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. నడాల్ రెండో రౌండ్లో వైదొలగడం.. అల్కరాజ్ గాయంతో టోర్నీకి దూరమవ్వడం జొకోవిచ్ కు కలిసి రానుంది. అయితే జొకోవిచ్ కు మెద్వెదేవ్ నుంచి పోటీ తప్పకపోవచ్చు. రష్యాకు చెందిన మెద్వెదెవ్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Novak Djokovic, Rafael Nadal, Tennis