IPL 2021 : ఆసీస్ వెళ్లే దారేది? ఆస్ట్రేలియా ఆటగాళ్ల ప్రయాణానికి మరో అడ్డంకి

ఆస్ట్రేలియా ప్లేయర్ల ప్రయాణానికి మరో అడ్డంకి

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021) వాయిదా పడటంతో లీగ్‌లో పాలుపంచుకున్న ఆటగాళ్లందరూ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. స్వదేశీ క్రికెటర్లు అందరూ తమ ఇళ్లకు చేరుకున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన షకీబుల్ హసన్, ముస్తఫిజుర్ తర్వాతి రోజే ఢాకా వెళ్లిపోయారు. ఇక ఇంగ్లాండ్ ఆటగాళ్లు రెండు దశల్లలో లండన్ చేరుకొని ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులు తప్పకుండా అక్కడ క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధన ఉండటంతో వాళ్లు ఇళ్లకు వెళ్లకుండా 10 రోజుల క్వారంటైన్‌లో గడుపుతున్నారు. న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా, కరేబియన్ దేశాలకు చెందిన క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి పంపుతున్నారు. కాగా, ఆస్ట్రేలియా క్రికెటర్లను పంపే దగ్గరే బీసీసీఐకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇండియా నుంచి వచ్చే విమానాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో శ్రీలంక (Srilanka) పంపి అక్కడి నుంచి వారిని తమ స్వదేశానికి చేర్చాలని బీసీసీఐ (BCCI) భావించింది. అయితే ఇప్పుడు శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీసీసీఐకి దారులు మూసుకొని పోయాయి.

    ఇండియాలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తుండటంతో ముందు జాగ్రత్తగా ఆ దేశం నుంచి శ్రీలంవ చ్చే ప్రయాణికులను అనుమతించబోమంటూ సివిల్ ఏవియేషన్ అధారిటీ ఆఫ్ శ్రీలంక ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నది. శ్రీలంక వైద్య శాఖ ఇచ్చే రిపోర్టును బట్టి భవిష్యత్‌లో నిషేధం ఎప్పుడు ఎత్తివేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నది. ఈ ప్రకటనతో ఆస్ట్రేలియా ఆటగాళ్లను శ్రీలంక పంపి అక్కడి నుంచి వారి ఇళ్లకు చేర్చాలనుకున్న ప్లాన్ బెడిసి కొట్టింది. దీంతో మాల్దీవుల మీదుగా అయినా పంపించే ఏర్పాట్లు చేయాలని బీసీసీఐ అధికారులను ఆదేశించింది.

    మరోవైపు న్యూజీలాండ్‌కు చెందిన కేన్ విలియమ్‌సన్, ట్రెంట్ బౌల్ట్ ఇండియాలోనే ఉంటారని కివీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. వారిద్దరూ మే 10 వరకు ఇండియాలోనే బీసీసీఐ ఏర్పాటు చేసిన బయోబబుల్‌లో ఉండి.. ఆ తర్వాత నేరుగా ఇంగ్లాండ్ వెళ్తారని చెప్పింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటానికి మిగిలిన జట్టు సభ్యులు న్యూజీలాండ్ నుంచి ఇంగ్లాండ్ చేరుకుంటారని తెలిపింది. కేన్, బౌల్ట్ ఇండియా నుంచి ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ 10 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుంటారని.. ఆ తర్వాత జట్టుతో కలసి ప్రాక్టీస్ చేస్తారని కివీస్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. కాగా, టీమ్ ఇండియా కూడా మే చివరి వారంలో ఇంగ్లాండ్ బయలు దేరి వెళ్తుందని బీసీసీఐ ఇప్పటికే వెల్లడించింది. ఈ మేరకు క్రికెటర్లను సిద్దంగా ఉండాలని బోర్డు తెలిపింది.
    Published by:John Naveen Kora
    First published: