టీ20 క్రికెట్ (T20 Cricket) వచ్చినాక.. సంప్రదాయ క్రికెట్ అయినా.. టెస్ట్ ఫార్మాట్ (Test Format) వెనుకబడింది. ఈ ఫార్మాట్ మీద అభిమానులు తక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అసలైన క్రికెట్ లవర్స్ మాత్రమే టెస్ట్ క్రికెట్ లో ఉన్న మజాని ఆస్వాదిస్తున్నారు. అయితే, నిర్జీవమైన పిచ్ లు తయారు చేసి టెస్టులు మీద ఆసక్తి లేకుండా చేస్తున్నాయి కొన్ని క్రికెట్ బోర్డులు. ఈ కోవలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందుంటుంది. బంతికి, బ్యాట్ కి మధ్య సమపోరు జరిగితినే టెస్ట్ క్రికెట్ లో అసలైన కిక్ వస్తుంది. ఇక, ఇప్పుడు అలాంటి కిక్ ఇవ్వడానికి ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ (AUS vs SA) రెడీ అయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తగ్గేదే లే అన్నట్టుగా ఉన్నాయి ఈ రెండు జట్లు. బ్రిస్బేన్ గబ్బా స్టేడియం వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ లో బౌలర్లు నిప్పులు చెలరేగారు. మొదటి రోజు ఆటలో ఏకంగా 15 వికెట్లు తీశారు. ఇక, గబ్బా పిచ్ మరోసారి పేసర్లకు స్వర్గ ధామంలా మారింది.
వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ని ఘనంగా ప్రారంభించింది. బాగా అచొచ్చిన బ్రిస్బేన్, గబ్బా స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఫస్ట్ రోజు పై చేయి సాధించింది. ఫస్ట్ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో (77 బంతుల్లో 78 పరుగులు ; 13 ఫోర్లు, 1 సిక్సర్) తో అజేయంగా నిలిచాడు ట్రావిస్ హెడ్. ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు కన్నా ఏడు పరుగుల వెనుకంజలో మాత్రమే ఉంది ఆసీస్ జట్టు.
అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకి బ్యాటింగ్ అప్పగించింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 48.2 ఓవర్లలో 152 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ 3 పరుగులు చేసి అవుట్ కాగా సారెల్ ఇర్వ్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వాన్ దేర్ దుస్సేన్ 5 పరుగులు చేయగా జొండో డకౌట్ అయ్యాడు. తెంబ బవుమా 70 బంతుల్లో 3 ఫోర్లతో 38 పరుగులు చేసి కీలక పరుగులు చేయగా సౌతాఫ్రికా వికెట్ కీపర్ కేల్ వెరెన్నీ 96 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 64 పరుగులు చేశాడు.
గబ్బాలో హాఫ్ సెంచరీ చేసిన రెండో సౌతాఫ్రికా వికెట్ కీపర్‌గా నిలిచాడు వెరెన్నీ. ఇంతకుముందు 1963లో జాన్ వైట్ 66 పరుగులు చేసి అవుట్ కాగా వెరెన్సీ 64 పరుగులకి పెవిలియన్ చేరాడు. మార్కో జాన్సన్ 2, కేశవ్ మహారాజ్ 2, లుంగి ఇంగిడి 3 పరుగులు చేసి అవుట్ కాగా ఆన్రీచ్ నోకియా డకౌట్ అయ్యాడు. కగిసో రబాడా 18 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ మూడేసి వికెట్లు తీయగా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, బొలాండ్ రెండేసి వికెట్లు తీశారు.
అయితే ప్రత్యర్థి జట్టును స్వల్ప స్కోరుకే అవుట్ చేశామనే ఆనందం ఆస్ట్రేలియాకి ఎక్కువ సేపు నిలవలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికే డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. కగిసో రబాడా బౌలింగ్‌లో వార్నర్ బ్యాటుకి తగిలిన బౌన్సర్, వెళ్లి జొండో చేతుల్లో వాలింది 26 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా, ఆన్రీచ్ నోకియా బౌలింగ్‌లో అవుట్ కాగా 24 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా.
ఇది కూడా చదవండి : ఆఖరి పోరాటానికి రంగం సిద్ధం.. మెస్సి సాధిస్తాడా? లేక ఫ్రాన్స్ తీన్ మార్ ఆడుతుందా..
ఇక, కష్టాల్లో పడ్డ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 117 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, 36 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ ఆన్రిచ్ నోకీయా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే నైట్ వాచ్ మెన్ గా బరిలోకి దిగిన స్కాట్ బోలాండ్ కూడా కూడా రబాడా బౌలింగ్ లో వెనుదిరిగాడు. దీంతో 145 పరుగుల వద్ద తొలి రోజు ఆట ముగిసింది.
ట్రావిస్ హెడ్ తో పాటు గ్రీన్, అలెక్స్ క్యారీ కూడా రాణిస్తే ..ఆస్ట్రేలియాకి విలువైన ఆధిక్యం అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Cricket, David Warner, Pat cummins, South Africa, Steve smith