2009లో పాకిస్థాన్ (Pakistan) పర్యటనకి వెళ్లిన శ్రీలంక జట్టు (Sri Lanka)పై ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత ఆ దేశంలో పర్యటించేందుకు ఏ అగ్రశ్రేణి క్రికెట్ జట్టు కూడా గత ఏడాది వరకూ సాహసించలేదు. గతేడాది 18 ఏళ్ల తర్వాత పాక్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ (New Zealand) కూడా భద్రతా కారణాలను చూపి ఆఖరి నిమిషంలో సిరీస్ ను రద్దు చేసుకుంది. రావల్పిండిలో తొలి వన్డే ప్రారంభానికి సరిగ్గా రెండు గంటల ముందు ఆ జట్టు.. బ్యాగులు సర్దుకుని న్యూజిలాండ్ విమానమెక్కింది. కివీస్ తర్వాత పాక్ పర్యటనకు రావల్సిన ఇంగ్లాండ్ కూడా న్యూజిలాండ్ బాటనే అనుసరించింది. ఈ పరిస్థితుల్లో తమకు ఆటగాళ్ల భద్రతే ముఖ్యమని, సిరీస్ ను వాయిదా వేస్తున్నామని పాక్ కు తెలిపింది. ఇప్పుడు దాదాపు 24 ఏళ్ల తర్వాత పాక్ పర్యటనకు ఆస్ట్రేలియా (AUS vs PAK) వచ్చింది. దీంతో.. ఈ సిరీస్ ను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసింది పీసీబీ. అయితే.. పీసీబీ ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది. ఈ సిరీస్ నిర్వహణపై దృష్టి పెట్టిన పీసీబీ ఫస్ట్ టెస్ట్ ఆడిన పిచ్ పై దృష్టిపెట్టలేకపోయింది.
వివరాల్లోకెళితే.. పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు (Aus vs Pak) పేలవ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల మ్యాచ్‌లో ఒక్కసారి కూడా బౌలింగ్‌కు అనుకూలించని పిచ్‌పైబ్యాటర్లు పండగ చేసుకున్నారు. పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు బాది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా బ్యాటర్స్ కూడా పాక్ బౌలర్లకు ధీటుగానే బదులిచ్చారు. ఒక రకంగా జీవం లేని పిచ్‌ను ఎలా తయారు చేయడం ఏంటని అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
లేటెస్ట్ గా రావల్పిండి పిచ్‌పై ఐసీసీ స్పందించింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే రావల్పిండి పిచ్ అత్యంత చెత్త పిచ్ అని.. కనీస ప్రమాణాల కంటే తక్కువ స్థాయిలో నాసిరకమైన పిచ్‌ను తయారు చేశారంటూ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే పేర్కొన్నారు. "ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య తొలి టెస్టుకు ఉపయోగించిన రావల్పిండి పిచ్‌లో తొలి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఎలాంటి మార్పు కనిపించలేదు. అటు స్పిన్నర్లకు.. ఇటు పేసర్లకు ఏ మాత్రం ప్రభావం చూపలేదు. బ్యాటర్స్ పండగ చేసుకున్న ఈ పిచ్ కనీస ప్రమాణాల కంటే తక్కువ స్థాయిలో తయారు చేశారు.
నిజం చెప్పాలంటే టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త పిచ్ అని చెప్పవచ్చు. అసలు బంతికి ఏ మాత్రం సహకారం అందలేదు. రెండు రోజులంటే పరవాలేదు.. ఐదు రోజులు ఒక పిచ్‌పై ఎలాంటి మార్పులు లేకపోవడమనేది ఆశ్చర్యం కలిగించింది. అందుకే రావల్పిండి పిచ్‌కు అత్యంత సాధారణ పిచ్‌గా రేటింగ్ ఇచ్చాం. " అంటూ చెప్పుకొచ్చారు.
అయితే, రిఫరీ రంజన్ మదుగలే వ్యాఖ్యలను సమర్థించిన ఐసీసీ నాసిరకం పిచ్ తయారు చేసినందుకు ఒక డీ మెరిట్ పాయింట్‌ను ఫెనాల్టీగా విధించింది. ఇక పాక్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు పేలవ డ్రాగా ముగిసింది. ఐదు రోజుల మ్యాచ్‌లో బ్యాటర్లు పండగ చేసుకున్నారు.
ఇరు జట్లు కలిపి 1187 పరుగులు చేయగా.. కేవలం 14 వికెట్లు మాత్రమే నేలకూలాయి. ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు కరాచీ వేదికగా మార్చి 12 నుంచి జరగనుంది. మొత్తానికి పీసీబీకి ఉన్న పరువు కాస్తా పోయిందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే.. ఇంజామామ్ ఉల్ హక్, డానిష్ కనేరియా లాంటి మాజీ క్రికెటర్లు ఈ పిచ్ పై తీవ్ర విమర్శలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.