AUS vs ENG 3rd ODI : స్వదేశంలో ఇంగ్లండ్ (England)తో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను ఆస్ట్రేలియా (Australia) క్లీన్ స్వీప్ చేసింది. 10 రోజుల క్రితం టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో చాంపియన్ గా నిలిచిన ఇంగ్లండ్ కు ఇది అవమానకర ఓటమి అనే చెప్పాలి. తొలి రెండు వన్డేలు ఓడి ఇప్పటికే సిరీస్ ను కోల్పోయిన ఇంగ్లండ్.. మూడో వన్డేలో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని చూసింది. అయితే ఈ మ్యాచ్ లోనూ దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఏకంగా 221 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ 48 ఓవర్ల చొప్పున జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 48 ఓవర్లలో 5 355 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (102 బంతుల్లో 106; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ట్రావిస్ హెడ్ (130 బంతుల్లో 152; 16 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో రెచ్చిపోయారు. అయితే మ్యాచ్ మధ్యలో వర్షం రావడంతో ఇంగ్లండ్ టార్గెట్ ను సవరించారు. 48 ఓవర్లకు 364గా అంపైర్లు నిర్ణయించారు.
364 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 31.4 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లతో రెచ్చిపోయాడు. సీన్ అబాట్, పాట్ కమిన్స్ చెరో రెండు వికెట్లు సాధించారు. హేజల్ వుడ్, మిచెల్ మార్ష్ లకు చెరో వికెట్ లభించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జేసన్ రాయ్ (48 బంతుల్లో 33; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆడమ్ జంపా బౌలింగ్ ను ఎదుర్కొనలేక ఇంగ్లండ్ చేతులెత్తేసింది. జాస్ బట్లర్ (1), మొయిన్ అలీ (18), వోక్స్ (0), ఒలీ స్టోన్ (4) వికెట్లను తీసి ఇంగ్లండ్ ను చావు దెబ్బ తీశాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు వార్నర్, ట్రావిస్ హెడ్ లు అదిరిపోయే శుభారంభం చేశారు. వీరిద్దరూ ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడారు. తొలి వికెట్ కు 269 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వీరిద్దరు కూడా సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే ఒలీ స్టోన్ వీరిద్దరినీ అవుట్ చేశాడు. చివర్లో మిచెల్ మార్ష్ (16 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్సర్లు) టి20 తరహా బ్యాటింగ్ చేశాడు. దాంతో ఆస్ట్రేలియా భారీ స్కోరును అందుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఒలీ స్టోన్ మాత్రమే ఫర్వాలేదనిపించాడు. అతడు 4 వికెట్లు దక్కించుకున్నాడు. మరో వికెట్ ను లియామ్ డాసన్ సొంతం చేసుకున్నాడు. సిరీస్ ను ఆస్ట్రేలయా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, David Warner, England, England vs Australia, Pat cummins, Steve smith