AUS vs ENG 2nd ODI : మూడు వన్డేల సిరీస్ లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతోన్న రెండో వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా (Australia) భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ (England)తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 280 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (114 బంతుల్లో 94; 5 ఫోర్లు, 1 సిక్స్) అద్బుత ఆటతీరు కనబరిచాడు. మార్నస్ లబుషేన్ (55 బంతుల్లో 58; 4 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ మార్ష్ (59 బంతుల్లో 50; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలు సాధించారు. వీరు రాణించడంతో ఆస్ట్రేలియా మంచి స్కోరును సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మూడు వికెట్లు తీశాడు. డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్ లు చెరో రెండు వికెట్లు తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (16), ట్రావిస్ హెడ్ (19) శుభారంభం చేయలేకపోయారు. వీరిద్దరూ కేవలం 33 పరుగులు మాత్రమే జోడించారు. వీరిద్దరూ 10 పరుగుల తేడాతో పెవిలియన్ కు చేరారు. దాంతో ఆస్ట్రేలియా 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులో జతకలిసిన స్మిత్, లబుషేన్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరంభంలో ఆచితూచి ఆడుతూ కుదురుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డు వేగం పెంచారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 101 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ దశలో బౌలింగ్ కు వచ్చిన ఆదిల్ రషీద్ వరుస బంతుల్లో లుబషేన్, అలెక్స్ క్యారీ (0) వికెట్లను తీశాడు. దాంతో ఆస్ట్రేలియా మరోసారి కష్టాల్లో పడింది.
ఈ దశలో మరోసారి స్మిత్ జట్టును ఆదుకున్నాడు. మిచెల్ మార్ష్ తో కలిసి ఐదో వికెట్ కు 90 పరుగులు జోడించాడు. సెంచరీ ఖాయం అనుకున్న తరుణంలో భారీ షాట్ కు ప్రయత్నించిన స్మిత్ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్ చేతికి చిక్కి శతకం బాదే ఛాన్స్ ను చేజార్చకున్నాడు. చివర్లో మిచెల్ మార్ష్, స్టొయినిస్ (13), అగర్ (18) తలా ఓ చెయ్యి వేయడంతో ఆస్ట్రేలియా 280 పరుగులకు చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా ఒక మార్పు చేసింది. ప్యాట్ కమిన్స్ స్థానంలో హేజల్ వుడ్ ను తీసుకుంది. ఈ మ్యాచ్ కు తాత్కాలిక కెప్టెన్ గా హేజల్ వుడ్ వ్యవహరిస్తున్నాడు. అదే సమయంలో బట్లర్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో స్యామ్ బిల్లింగ్స్ జట్టులోకి వచ్చాడు. మొయిన్ అలీ ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ గా ఉన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, David Warner, England, England vs Australia, Pat cummins, Steve smith