ఏషియాడ్ : స్వర్ణంపై కన్నేసిన పీవీ సింధు!

వరల్డ్ నెం. 1 టైజూతో ఇప్పటికే 12 సార్లు తలబడిన పీవీ సింధు... 3 సార్లు మాత్రమే వరించిన విజయం... ఫైనల్ పోరు ఆసక్తికరంగా ఉంటుందన్న తెలుగు షెట్లర్!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: August 27, 2018, 4:19 PM IST
ఏషియాడ్ : స్వర్ణంపై కన్నేసిన పీవీ సింధు!
పీవీ సింధు
  • Share this:
ఏషియాడ్‌లో అంచనాలకు తగ్గట్టుగానే అద్భుతంగా రాణించిన భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు, ఫైనల్లోకి అడుగుపెట్టింది. సైనా నెహ్వాల్ సెమీస్‌లోనే ఓడినా, పీవీ సింధు ఫైనల్ చేరడంతో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు స్వర్ణం తేగల సత్తా పీవీ సింధుకు ఉందని ఆమె అభిమానుల్లో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె ట్రాక్ రికార్డు చూస్తే మాత్రం భయం కలగడం ఖాయం. ఎందుకంటే కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ దగ్గర్నుంచి ఇండియా ఓపెన్, థాయిలాండ్ ఓపెన్స్ ఫైనల్స్‌లో ఓడి, రజతంతో సరిపెట్టుకుంది మన తెలుగు తేజం.

వరల్డ్ నెం. 2 అకానే యమగూచీని ఓడించి, ఏషియాడ్ ఫైనల్లో అడుగుపెట్టింది పీవీ సింధు. అయితే ఫైనల్‌లో ఆమె ప్రత్యర్థి వరల్డ్ నెం.1 బ్యాడ్మింటన్ క్రీడాకారిణి టై జూ యింగ్. ఇప్పటిదాకా టైజూతో 12 సార్లు పోటీ పడిన పీవీ సింధు, కేవలం మూడు సార్లు మాత్రమే నెగ్గగలిగింది. తొమ్మిదిసార్లు ఆమె చేతిలో ఓడిపోయింది సింధు. గత ఏడాది హాంకాంగ్ ఓపెన్ ఫైనల్లో టై జూతో చేతిలోనే ఓడింది సింధు. చివరిసారిగా ఒలింపిక్ ఈవెంట్‌ 2016 ఫ్రీ కార్వర్ట్స్‌లో టై జూపై నెగ్గింది పీవీ సింధు. ఆ తర్వాత తలపడిన ఐదుసార్లు వరుసగా టై జూనే విజయం దక్కింది. దీంతో ఈ థాయిలాండ్ క్రీడాకారిణితో పోరులో విజయం సాధించడం సింధుకి అంత తేలికైన విషయం కాదు.

సెమీస్ పోరులో టై జూ చేతిలో ఓడిన సైనా నెహ్వాల్, విజయం కోసం బాగానే పోరాడింది. కానీ వరల్డ్ నెం. 1 జోరు ముందు నెగ్గలేక చతికిలపడింది. సైనా ఫాం దృష్ట్యా ఆమె ఓటమి ఎవరినీ ఆశ్చర్యపరచకపోయినా, టై జూ ఆటతీరు మాత్రం అద్భుతం. ప్రత్యర్థి బలహీనతలను గుర్తించి, వాటిపైన దాడి చేయడం టై జూ ఆటలోని ప్రత్యేకత. ఫైనల్లో ఒత్తిడికి గురవ్వడం సింధులో ఉన్న ముఖ్యమైన బలహీనత. అయితే ‘టైజూను ఎలా ఎదుర్కోవాలో అనే విషయంలో నాకో స్ట్రాటెజీ ఉంది. ఫైనల్ కచ్ఛితంగా మరింత ఆసక్తికరంగా ఉంటుంది...’ అని సెమీస్ విజయం తర్వాత చెప్పింది పీవీ సింధు. మరి ఫైనల్ ఫివర్‌ నుంచి బయటపడి సింధు స్వర్ణం సాధిస్తుందో, లేదో తెలియాలంటే 28వ తేది జరిగే మ్యాచ్ దాకా వేచి చూడాల్సిందే.First published: August 27, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading