ఏషియాడ్: హాకీ ఫైనల్లో ఓడిన అమ్మాయిలు, రజతంతో సరి!

ఫైనల్లో 2-1 తేడాతో ఓడిన భారత హాకీ ఉమెన్స్ టీం... ఇరవై ఏళ్ల తర్వాత ఏషియాడ్‌లో సిల్వర్ సాధించిన అమ్మాయిలు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: August 31, 2018, 10:09 PM IST
ఏషియాడ్: హాకీ ఫైనల్లో ఓడిన అమ్మాయిలు, రజతంతో సరి!
భారత మహిళా హాకీ జట్టు
  • Share this:
ఏషియాడ్ 2018లో స్వర్ణం సాధించాలనుకున్న హాకీ అమ్మాయిల కోరిక తీరలేదు. అద్భుత విజయాలతో ఫైనల్ చేరిన భారత అమ్మాయిలు, ఫైనల్లో ఒత్తిడికి గురై, రజతంతో సరిపెట్టుకున్నారు. హోరాహోరీగా సాగిన హాకీ ఉమెన్స్ ఫైనల్లో 2-1 తేడాతో ఓడిపోయింది భారత మహిళా జట్టు. అయినప్పటికీ ఇరవై ఏళ్ల తర్వాత ఏషియాడ్‌లో రజత పతకం సాధించింది ఉమెన్స్ హాకీ టీం. గత ఏషియాడ్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న భారత హాకీ అమ్మాయిల జట్టుకు ఇది మెరుగైన ప్రదర్శనే. అయితే ఏషియాడ్ ఫైనల్లో బోల్తా పడడంతో ఒలింపిక్స్ ఈవెంట్‌కి నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం.

ఆట ప్రారంభమైన 11 వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఉపయోగించుకున్న జపాన్ క్రీడాకారిణి మియాని షిమ్జూ అద్భుత గోల్ సాధించింది. దాంతో మొదటి క్వార్టర్‌ను 1-0 లీడ్‌తో ముగిచింది జపాన్. అయితే 25వ నిమిషంలో గోల్ సాధించిన భారత క్రీడాకారిణి నేహా గోయల్, స్కోర్ సమం చేసింది. నవ్‌నీత్ అందించిన త్రోను అద్బుతంగా గోల్‌గా మలిచిన నేహా గోయల్, జపాన్ జట్టు ఆధిక్యానికి గండి కొట్టింది. ఆ తర్వాత మూడో క్వార్టర్ మరో నిమిషంలో ముగుస్తుందనగా లభించిన రెండో పెనాల్టీ కార్నర్‌ను కూడా గోల్ కొట్టి, లీడ్‌లోకి వెళ్లింది జపాన్. గోల్‌కి అడ్డంగా పడుకున్న భారత కీపర్ సవితా పక్కనుంచి అద్భుతంగా గోల్ కొట్టింది జపాన్ ప్లేయర్ కవామురా. ఆధిక్యం దక్కడంతో సమయం వృథా చేసేందుకే ప్రాధాన్యం ఇచ్చింది. గోల్ చేసేందుకు భారత అమ్మాయిలు చేసిన ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకున్నారు జపాన్ ప్లేయర్లు. ఆట మరో నిమిషంన్నరలో ముగుస్తుందనగా గోల్ చేసే అవకాశం లభించినా, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు హాకీ అమ్మాయిలు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా సిల్వర్ మెడల్ గెలిచిన హాకీ టీంను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘సిల్వర్ మెడల్ గెలిచిన భారత మహిళా హాకీ జట్టుకు అభినందనలు. చాలా బాగా ఆడారు. మీ ప్రదర్శన చూసి దేశం గర్విస్తోంది. మేమంతా గర్విస్తున్నాం...’ అంటూ పోస్ట్ చేశారు భారత రాష్ట్రపతి.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా భారత హాకీ జట్టును అభినందనల్లో ముంచెత్తారు. ‘ఉమెన్స్ హాకీ జట్టు విజయాన్ని చూస్తుంటే థిల్లింగ్‌గా ఉంది. వారి అత్యుత్తమ ప్రదర్శన 125 కోట్ల భారతీయుల్లో ఆనందాన్ని నింపింది. సిల్వర్ గెలిచిన భారత ఉమెన్స్ హాకీ జట్టుకు అభినందనలు...’ అంటూ ట్వీట్ చేశారు మోదీ.

గత ఏషియాడ్‌లో స్వర్ణం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు, ఈసారి సెమీ ఫైనల్లోనే ఓడిన సంగతి తెలిసిందే. కాంస్య పతకం కోసం దాయాది పాకిస్తాన్‌తో శనివారం తలపడనుంది మెన్స్ హాకీ టీం. రజతం సాధించిన భారత మహిళా హాకీ టీంను కేంద్ర మంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్ అభినందించారు.ఇవీ చదవండి...

VIDEO: హాకీ ఫైనల్ కోసం అమ్మాయిలు ఎలా ప్రాక్టీస్ చేశారో చూడండి

సెమీస్‌లో మెన్స్ స్క్వాష్ టీం ఓటమి, కాంస్యంతో సరి
Published by: Ramu Chinthakindhi
First published: August 31, 2018, 7:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading