Asia Cup 2022 - IND vs AFG : ఆసియా కప్ (Asia cup) 2022ని భారత్ (India) విజయంతో ముగించింది. సూపర్ 4లో ఎదురైన వరుస పరాజయాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్ (Afghanistan)తో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా (Team India) 101 పరుగుల తేడాతో ఓదార్పు విజయాన్ని నమోదు చేసింది. భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. దాంతో అఫ్గానిస్తాన్ 20 ఓవర్లో 8 వికెట్లకు 111 పరుగులు మాత్రమే చేసింది. ఇబ్రహీం జద్రాన్ (64 నాటౌట్) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. అర్ష్ దీప్ సింగ్, అశ్విన్, దీపక్ హుడా తలా ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ సూపర్ 4ను మూడో స్థానంతో ముగించింది.చెలరేగిన భువీ
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ ను భువనేశ్వర్ కుమార్ బెంబేలెత్తించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ ఓపెనర్లను జజాయ్ (0), గుర్బాజ్ (0), కరీం జనత్ (2), నజీబుల్ జద్రాన్ (0), ఒమర్జాయ్ (1)లను పెలియన్ కు చేర్చి.. తన టి20 కెరీర్ లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ఇబ్రహీం మినహా మిగిలిన ప్లేయర్లు విఫలం కావడంతో అఫ్గాన్ లక్ష్యానికి చాలా దూరంగా ఆగిపోయింది.
అంతకుముందు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1020 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ మళ్లీ సెంచరీ అందుకున్నాడు. కోహ్లీ (61 బంతుల్లో 122; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దాంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (62) అర్ధ సెంచరీతో రాణించాడు .కీలకమైన టాస్ ను భారత్ మరోసారి ఓడింది. అయితే రోహిత్, చహల్, హార్దిక్ లకు విశ్రాంతి ఇచ్చిన టీమిండియా వారి స్థానాల్లో దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ లకు చోటు ఇచ్చింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన కోహ్లీ.. కేఎల్ రాహుల్ తో కలిసి జట్టును ముందుకు నడిపాడు. వీరిద్దరూ అదిరిపోయే షాట్లతో రెచ్చిపోయారు. మధ్యలో కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను బౌండరీ దగ్గర అఫ్గానిస్తాన్ ప్లేయర్ మిస్ చేయడంతో ఊపిరి పీల్చకున్న కోహ్లీ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 119 పరుగులు జోడించారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ పెవిలియన్ కు చేరుకున్నాడు. తొలి బంతినే సిక్సర్ బాదిన సూర్యకుమార్ యాదవ్ (6) ఆ తర్వాతి బంతికే పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి కోహ్లీ మరింత వేగంగా ఆడాడు. దొరికిన బంతిని క్లీన్ హిట్స్ తో బౌండరీ దాటించాడు. చూస్తుండగానే 70, 80 మార్క్ ను దాటుతూ 90ల్లోకి చేరుకున్నాడు. 94 పరుగుల వద్ద ఉన్న కోహ్లీ... భారీ సిక్సర్ బాది సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరి సారిగా కోహ్లీ 2019 నవంబర్ 23న బంగ్లాదేశ్ పై బాదాడు. సరిగ్గా 1020 రోజుల తర్వాత మళ్లీ సెంచరీని కోహ్లీ అందుకోవడం విశేషం. టి20ల్లో కోహ్లీకి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Asia Cup 2022, Axar Patel, Dinesh Karthik, Hardik Pandya, KL Rahul, Rashid Khan, Ravichandran Ashwin, Rishabh Pant, Rohit sharma, Virat kohli