PV Sindhu : భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) కు మరోసారి నిరాశే మిగిలింది. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ అకానె యామగుచి (జపాన్) చేతిలో పీవీ సింధు కంగుతింది. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో సింధు 21-13, 19-21, 16-21 తేడాతో యామగుచి చేతిలో ఓడిపోయింది. దాంతో ఆసియా చాంపియన్ షిప్ లో స్వర్ణం నెగ్గాలనే కల మరోసారి తీరకుండానే పోయింది. సెమీస్ లో ఓడటంతో సింధు కాంస్య పతకంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2014 ఆసియా చాంపియన్ షిప్ లోనూ సింధు సెమీఫైనల్లో ఓడిపోయింది. దాంతో అప్పుడు కూడా పీవీ సింధు కాంస్య పతకంతోనే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.
పసిడి పతకం ఖాయం అనుకున్న చోటున పీవీ సింధు చతికిల పడింది. ఒక గంటా 6 నిమిషాల పాటు సాగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో పీవీ సింధు పోరాడి ఓడింది. తొలి గేమ్ లో పీవీ సింధు అలవోకగా విజయం సాధించింది. ఇక రెండో గేమ్ లో యామగుచి పుంజుకోవడంతో మ్యాచ్ హోరా హోరీగా సాగింది. అయితే మ్యాచ్ రిఫరీలు సింధు విషయంలో ప్రవర్తించిన తీరు ఇక్కడ వివాదాస్పదంగా మారింది. రెండో గేమ్ లో స్కోర్లు 14-12తో సింధు లీడ్ లో ఉన్న సమయంలో అంపైర్లు సింధు కు ఒక పాయింట్ ను పెనాల్టీగా విధించారు. సింధు సర్వీస్ చేసే సమయంలో ఎక్కువగా టైమ్ తీసుకుంటుందనే కారణంతో అంపైర్లు సింధుకు ఒక పాయింట్ ను పెనాల్టీగా ప్రకటించారు. దీనిపై సింధు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాసేపే అంపైర్లతో వాగ్వివాదానికి కూడా దిగింది. అనంతరం సింధు ఆట గాడి తప్పగా.. అద్బుతంగా ఆడిన యామగుచి ఆ గేమ్ ను సొంతం చేసుకుని స్కోరును 1-1తో సమం చేసింది.
ఇది కూడా చదవండి : హిట్ మ్యాన్ రోహిత్ సెట్ చేసిన ఈ రికార్డులను టచ్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా?
ఇక మూడో గేమ్ లో యామగుచి మరింతగా రెచ్చిపోయింది. వరుస పెట్టి పాయింట్లు సాధించింది. ఫలితంగా సింధు పాయింట్ల వేటలో వెనకబడి పోయింది. చివరకు మూడో గేమ్ లోనూ ఓడిపోయిన సింధు మ్యాచ్ ను చేజార్చుకుంది. యామగుచి ఫైనల్లో ప్రవేశించగా.. సింధు ఇంటి దారి పట్టింది. అయితే అంపైర్ల వ్యవహరించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరేమో సింధు పై అంపైర్లు కఠినంగా వ్యవహరించారని కామెంట్స్ చేస్తే... మరికొందరేమో సింధు కావాలనే సర్వీస్ చేసేందుకు ఎక్కువ టైమ్ తీసుకుందని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Badminton, India, IPL, IPL 2022, Lucknow Super Giants, Mumbai Indians, Pv sindhu, Rohit sharma