ASHES SERIES 2021 22 AUSTRALIA SKIPPER PAT CUMMINS KIND GESTURE FOR USMAN KHAWAJA DURING CELEBRATIONS WINS HEARTS WATCH VIRAL VIDEO SRD
Viral Video : వారెవ్వా.. కమిన్స్.. నీ పనితో మా మనసులు గెలుచుకున్నావుగా సామీ..!
Ashes Series
Viral Video : ఈ వీడియోను చూసిన నెటిజన్లు కమిన్స్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న పనులే కమిన్స్‌ను గొప్పవాణ్ణి చేస్తాయంటూ మెచ్చుకుంటున్నారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ (Australia Vs England) క్రికెట్ జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ (Ashes Series) లో ఆసీస్ దుమ్మురేపింది. యువ బౌలర్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) నాయకత్వంలోని ఆసీస్ 146 పరుగుల తేడాతో ఐదో టెస్టులో విజయం సాధించింది. దీంతో ఐదు టెస్ట్ ల సిరీస్ 4-0 తేడాతో గెలుచుకుని శభాష్ అన్పించుకుంది. ఇక, ప్యాట్ కమిన్స్ తన తొలి టెస్ట్ సిరీస్ లో అద్భుతమైన నాయకత్వం వహించి.. మేటి క్రికెటర్ల చేత ప్రశంసలు దక్కించుకున్నాడు. సిరీస్ నెగ్గిన తర్వాత ఆస్ట్రేలియా టీమ్ సెలబ్రేషన్స్ ఆకాశన్నంటాయ్. అయితే, ఈ సెలబ్రేషన్స్ లో ప్యాట్ కమిన్స్ చేసిన పనికి ఇప్పుడు ప్రపంచమంతా ఫిదా అవుతోంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకీ ప్యాట్ కమిన్స్ ఏం చేశాడంటే.. వివరాల్లోకెళితే..
విక్టరీ సెలబ్రేషన్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లందరూ ఛాంపేన్ బాటిళ్లు పట్టుకొని సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయ్యారు. అలాంటి సమయంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. చాలారోజుల తర్వాత ఆసీస్ జట్టులోకి పునరాగమనం చేసిన ఉస్మాన్ ఖవాజా.. వచ్చీరావడంతోనే రెండు సెంచరీలతో తన సత్తా చాటాడు. అతను ముస్లిం కావడంతో మద్యానికి దూరంగా ఉంటాడు. సహచరులంతా ఛాంపేన్ బాటిళ్లు పట్టుకొని ఉండటంతో అతను ఛాంపియన్స్ ఫొటో తీసుకునేటప్పుడు కొంచెం దూరంగా నిలబడ్డాడు.
ఇది గమనించిన కమిన్స్.. సహచరులను ఛాంపేన్ బాటిళ్లు ఓపెన్ చేయొద్దని చెప్పాడు. ఖవాజాను పిలిచి ముందు ఫొటోకు జట్టు సభ్యులందరితో కలిసి ఫోజిచ్చాడు. ఆ తర్వాత ఖవాజా లేకుండా అందరూ ఛాంపేన్ బాటిళ్లతో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కమిన్స్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న పనులే కమిన్స్‌ను గొప్పవాణ్ణి చేస్తాయంటూ మెచ్చుకుంటున్నారు.
Pat Cummins realizing that Khawaja had to stand away because of the alcohol so he tells his team to put it away and calls Khawaja back immediately. A very small but a very beautiful gesture❤️pic.twitter.com/KlRWLprbWM
ఐదో టెస్టులో 271 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 124 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో కామెరాన్ గ్రీన్ 3, స్కాట్ బోలాండ్ 3, ప్యాట్ కమిన్స్ 3, మిచెల్ స్టార్క్ 1 వికెట్ తీశారు. లక్ష్యఛేదనలో ఓ దశలో ఇంగ్లండ్ 68/0తో పటిష్టంగా కనిపించింది. అయితే 56 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు కోల్పోయి మరో పరాజయం మూటగట్టుకుంది.
ఈ ఐదు టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియా వరుసగా మూడు టెస్టుల్లో నెగ్గి సిరీస్ ఎప్పుడో చేజిక్కించుకుంది. ఆ తర్వాత నాలుగో టెస్టు డ్రాగా ముగియగా, ఆఖరిదైన ఐదో టెస్టులో ఆసీస్ నెగ్గింది. తద్వారా సిరీస్ ను 4-0తో ముగించింది. పేస్ బౌలర్ గా పేరు ప్రఖ్యాతులు పొందిన కమిన్స్ కు కెప్టెన్ గా ఇదే తొలి సిరీస్. అయినప్పటికీ ఎంతో పరిణతితో వ్యవహరించి జట్టును విజయపథంలో నడిపించిన వైనం విమర్శకులను సైతం ఆకట్టుకుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.