వరల్డ్ కప్ అనంతరం బెన్ స్టోక్స్ మరోసారి ఒంటిచేత్తో ఇంగ్లాండ్‌ను గెలిపించి తన సత్తా చాటాడు. యాషెస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ సంచలన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం అయ్యింది. 359 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఉత్కంఠభరిత పోరులో 9 వికెట్లు కోల్పోయి ఘన విజయాన్ని అందుకుంది. బెన్‌స్టోక్స్ మరోసారి తన మార్కు పోరాటంతో ఇంగ్లండ్‌కు విజయాన్నిఅందించాడు. రెండో ఇన్నింగ్స్ లో 135 పరుగులతో సెంచరీ చేసిన స్టోక్స్ మొత్తం 11 ఫోర్లు, 8 సిక్సర్లతో నాటౌట్ గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 286 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో చివరి బ్యాట్స్ మ్యాన్‌గా వచ్చిన జాక్ లీచ్ వికెట్ కోల్పోకుండా క్రీజ్ లో పాతుకుపోయాడు. లీచ్ 17 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసినప్పటికీ, స్టోక్స్ తో కలిసి భాగస్వామ్యం అందించడంలో సఫలమయ్యాడు.
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులు చేయగా, ఆ తర్వాత ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 67 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 246 పరుగులు చేసింది. చివరికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 362 పరుగులు సాధించి టెస్టు మ్యాచ్ లో విజయం సాధించింది.
Published by:Krishna Adithya
First published:August 25, 2019, 22:39 IST