హోమ్ /వార్తలు /క్రీడలు /

రియల్ ‘చెక్ దే ఇండియా’ స్టార్‌కు భర్త నుంచి నరకం... చెప్పుకోలేని చోట వాతలు...

రియల్ ‘చెక్ దే ఇండియా’ స్టార్‌కు భర్త నుంచి నరకం... చెప్పుకోలేని చోట వాతలు...

సూరజ్ లతాదేవి, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్

సూరజ్ లతాదేవి, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్

2002లో ఆమె కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల హాకీ జట్టు ప్రదర్శన చూసిన తర్వాతే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాలీవుడ్‌లో ‘చెక్ దే ఇండియా’ సినిమాను తీశారు.

  అర్జున అవార్డు గ్రహీత, భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్ మీద ఆమె భర్త దాష్టీకం వెలుగుచూసింది. ఆమెను గృహహింస చేయడమే కాకుండా కట్నం కోసం వేధిస్తున్నాడు. మణిపూర్‌కు చెందిన సూరజ్ లతాదేవిని ఆమె భర్త చిత్రహింసలకు గురి చేశాడు. చాలా సంవత్సరాల నుంచి తట్టుకుంటున్న ఆమె చివరకు పోలీసులను ఆశ్రయించింది. భర్త మీద గృహహింస, వరకట్నం కేసులు పెట్టింది. 2019 నవంబర్ 9వ తేదీన సూరజ్ లతాదేవిని ఆమె భర్త తీవ్రంగా హింసించాడు. ఆ బాధ, భయం, డిప్రెషన్ నుంచి ఇన్నాళ్లకు కోలుకుంది. పంజాబ్‌లోని కపుర్తలాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిన గదిలో ఉంటూ ఇన్నాళ్లకు బయటకు వచ్చింది. దీంతోపాటు జనవరి 10వ తేదీన కూడా మణిపూర్‌లోని హీగాంగ్ పోలీస్ స్టేషన్‌లో తన భర్త మీద ఫిర్యాదు చేసింది. గత ఏడాది నవంబర్‌లో కూడా తన భర్త మీద పంజాబ్‌లోని సుతాన్‌పూర్ లోథీ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు కూడా పెట్టింది.

  సూరజ్ లతాదేవి

  సూరజ్ లతాదేవి భర్త శాంత కుమార్ వెస్ట్రన్ రైల్వే - ముంబై లో మాజీ ఉద్యోగి. ఆమెకు మత్తు మందు ఇచ్చి ఓ కుర్చీకి కట్టేసి సుమారు మూడు గంటల పాటు ఆమెకు నరకం చూపించినట్టు బాధితురాలు ఆరోపించింది. తనకు అదనపు కట్నం తీసుకురావాలంటూ ఎప్పటి నుంచో వేధిస్తున్న భర్త నవంబర్ నెలలో కూడా రెండు సార్లు అదే డిమాండ్ చేశాడని, ఓ భూమిని తనకు కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అందుకు నిరాకరించినందుకు తనను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశాడని వాపోయింది. తన శరీరం మీద, చెప్పుకోలేని చోట వాతలు పెట్టాడని తెలిపింది. సూరజ్ లతాదేవి కూడా వెస్ట్రన్ రైల్వే - ముంబై లో ఉద్యోగిని. బంగారం లాంటి రైల్వే ఉద్యోగం ‘ఆఫీస్ సూపరింటెండెంట్’ జాబ్‌‌కు రాజీనామా చేయాలని, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని భర్త ఒత్తిడి తెస్తున్నాడని ఆమె తెలిపింది. ‘తప్పుడు దారి’లో అర్జున అవార్డు తెచ్చుకున్నానంటూ వేధిస్తున్నాడని ఆరోపించింది.

  భర్త చిత్రహింసలు పెట్టినట్టు ఆధారాలు చూపుతున్న లతాదేవి

  సూరజ్ లతాదేవి మణిపూర్‌లోని పశ్చిమ ఇంఫాల్ జిల్లా నుంచి వచ్చింది. ఆమె భర్త శాంత కుమార్ కూడా అదే జిల్లాకు చెందిన వ్యక్తి. 39 సంవత్సరాల లతాదేవి నేతృత్వంలో భారత మహిళల హాకీ జట్టు మూడుసార్లు వరుసగా గోల్డ్ మెడల్ సాధించింది. 2002లో ఆమె కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల హాకీ జట్టు ప్రదర్శన చూసిన తర్వాతే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాలీవుడ్‌లో ‘చెక్ దే ఇండియా’ సినిమాను తీశారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. 2002 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్, 2004లో హాకీ ఆసియా కప్‌లోనూ బంగారు పతకాన్ని సాధించింది.

  (అంతెం బిశ్వజిత్, న్యూస్‌18 మణిపూర్ కరస్పాండెంట్)

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Manipur

  ఉత్తమ కథలు