Home /News /sports /

ARGENTINA WON COPA AMERICA TITILE AFTER BEATING BRAZIL IN FINAL THIS IS MESSI FIRST INTERNATIONAL TITLE FOR ARGENTINA JNK

Copa America : కోపా అమెరికా చాంపియన్ అర్జెంటీనా.. మెస్సీ ఖాతాలో తొలి మేజర్ టైటిల్

కోపా అమెరికా టైటిల్ గెలిచిన అర్జెంటీనా (Twitter)

కోపా అమెరికా టైటిల్ గెలిచిన అర్జెంటీనా (Twitter)

దిగ్గజ ఫుట్‌బాలర్, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ తన దాహాన్ని తీర్చుకున్నాడు. క్లబ్ ఆటగాడనే ముద్రను తొలగించుకుంటూ తన దేశానికి 28 ఏళ్ల తర్వాత కోపా అమెరికా టైటిల్ గెలిపించాడు.

    కోపా అమెరికా (Copa America) ఫైనల్‌లో (Final) అర్జెంటీనా (Argentina) జట్టు 1-0 తేడాతో బ్రెజిల్‌ను (Brazil) ఓడించి చాంపియన్‌గా (Champion) నిలిచింది. ఈ మెగా ఈవెంట్‌లో బ్రెజిల్, అర్జెంటీనా మూడు సార్లు తలపడగా తొలి సారి అర్జెంటీనా గెలిచి కప్పు గెలిచింది. 1993 తర్వాత అర్జెంటీనా టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. శనివారం రాత్రి రియో డి జనైరోలోని మరకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0 తేడాతో గెలిచింది. కాగా, హోం గ్రౌండ్‌లో ఆడుతున్న బ్రెజిల్ కనీసం ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. మ్యాచ్ ప్రారంభమైన 22వ నిమిషంలో అర్జంటీనా ఆటగాడు ఆంజెల్ డి మారియా చేసిన ఏకైక గోల్ అర్జెంటీనాను గెలిపించింది. అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ కెరీర్‌లో ఇదే తొలి మేజర్ టైటిల్ కావడం విశేషం. అర్జెంటీనా సీనియర్ జట్టు తరపున మెస్సీ తొలి సారి కోపా అమెరికా టైటిల్ గెలుపోందాడు. ఫైనల్ విజిల్ ఊదగానే అర్జెంటీనా ఆటగాళ్లందరూ ఒక్కసారిగా మెస్సీ వైపు పరుగెత్తి సంబరాలు జరుపుకున్నారు. మెస్సీ అయితే కంటనీరు పెట్టుకున్నాడు. తన కెరీర్‌లో ఒక మేజర్ టైటిల్ గెలవడం తొలిసారి కావడంతో మెస్సీ నోటి వెంట మాటలు రాలేదు.

    దక్షిణ అమెరికా చాంపియన్లుగా అర్జెంటీనా 28 ఏళ్ల తర్వాత నిలవడంతో అర్జెంటీనా అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. 2014 ఫిఫా వరల్డ్ కప్ గెలవలేకపోయిన లోటును మెస్సీ ఈ కప్ గెలవడంతో తీర్చుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్ సొంత గ్రౌండ్‌లో ఫైనల్ ఓడిపోవడంతో అభిమానులు కంటనీరు పెట్టుకున్నారు. కాగా కోపా అమెరికా చరిత్రలో అత్యధికంగా అర్జెంటీనా 15 టైటిల్స్ గెలిచి ఉరుగ్వేతో సమానంగా నిలిచింది. అర్జెంటీనా తరపున 16 ఏళ్ల క్రితం అరంగేట్రం చేసిన లియోనల్ మెస్సీ ఎట్టకేలకు తన దేశం కోసం ఒక మేజర్ టైటిల్ గెలిచాడు. యూరోపియన్ లీగ్స్‌లో తిరుగే లేని ఆటగాడు, కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కిన మెస్సీ ఖాతాలో 34 ట్రోఫీలు ఉన్నాయి. 10 లాలిగా టైటిల్స్, 7 కోపా డెల్ రే టైటిల్స్, నాలుగు యూఈఎఫ్ఏ చాంపియన్ లీగ్స్ గెలిచాడు. కానీ ఏనాడూ అర్జెంటీనా కోసం మేజర్ టైటిల్ గెలవలేదు. దీంతో అతడిపై క్లబ్ ఆటగాడనే పేరు పడిపోయింది. కానీ తాజాగా కోపా అమెరికా టైటిల్ గెలిచి తనపై ఉన్న మచ్చను చెరిపేసుకొని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్ అని నిరూపించుకున్నాడు.













    ఈ టోర్నీలో అత్యధికంగా గోల్స్ చేసిన ఫుట్‌బాలర్‌గా మెస్సీ కొలంబియాకు చెందిన లూయిస్ డియాజ్ సరసన నిలిచాడు. చిలీ, బొలీవియాలతో జరిగిన మ్యాచ్‌లలో గోల్స్ చేసిన మెస్సీ ఆ తర్వాత ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్ కొట్టాడు. సెమీ ఫైనల్‌లో కొలంబియాపై మరో గోల్ చేశాడు. మెస్సీ కెప్టెన్సీపై వస్తున్న ఆరోపణలకు ఈ ఒక్క టైటిల్‌తో సమాధానం చెప్పాడు. ప్రస్తుతం బార్సిలోనా క్లబ్ ఒప్పందం కూడా ముగియడంతో మెస్సీ ఖాళీగా ఉంటున్నాడు. ఈ విజయంతో మరోసారి మెస్సీ తన టాలెంట్ ఏంటో ప్రపంచానికి చూపించాడు.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Football

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు