గబ్బా స్టేడియంలో యంగ్ ఇండియా దుమ్మురేపింది. 31 ఏళ్ల పాటు ఓటమి ఎరుగని ఆసీస్ జట్టును అదే స్టేడియంలో ఓడించి... చరిత్ర తిరగారాసింది. కుర్రాళ్లతో నిండిన భారత జట్టు సమిష్టిగా రాణించి.. చారిత్రాత్మక విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై త్రివర్ణ పతకాన్ని ఎగురవేసింది. డ్రాగా ముగిస్తే చాలు అనుకుంటున్న మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు రెచ్చిపోయారు. ఆసిస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించి.. 2-1తో నాలుగు టెస్టుల సిరీస్‌ను, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. చరిత్ర లిఖించిన ఈ విజయంతో భారత జట్టు మరోసారి టెస్ట్ చాంపియన్‌షిప్‌లో టాప్ ప్లేసులో నిలిచింది. ఆస్ట్రేలియాతో గబ్బాలో జరిగిన ఆఖరి టెస్టులో అద్బుత విజయాన్ని అందుకున్న టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత్ విజయంపై దేశవ్యాప్తంగా క్రీడా వర్గాలతో పాటు రాజకీయ నేతలు కూడా అభినందల వర్షం కురిపిస్తున్నారు. ఇదే కోవలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా టీమ్ ఇండియా విజయాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
గబ్బాలో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా సాధించిన విజయంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఓ అద్భుతమైన విజయం, ఈ గెలుపుతో మూడు దశాబ్దాల తర్వాత గబ్బా కోటను బద్దలు కొట్టినందుకు టీమ్ ఇండియాకు హార్ధిక శుభాకాంక్షలు అంటూ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. పట్టుదల, పరాక్రమంతో దేశాన్ని గర్వపడేలా చేశారంటూ జగన్ భారత జట్టుపై ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో జగన్ ట్వీట్ వైరల్ అవుతోంది.
రాజకీయాలతో పోలిస్తే మిగతా అంశాలపై అంతగా స్పందించేందుకు ఇష్టపడని వైఎస్ జగన్ క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల విషయంలోనూ గతంలోనూ స్పందించి సందర్భాలు తక్కువే. అలాంటిది భారత జట్టు ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం అందుకోవడంతో ఢిల్లీ పర్యటనకు వెళ్తూ కూడా ట్వీట్ ద్వారా టీమిండియాకు జగన్ అభినందనలు తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత జట్టు విజయంపై జగన్ ట్వీట్‌ను చూసిన వైసీపీలో క్రీడాభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:January 19, 2021, 17:46 IST