ఐపీఎల్ 2వ ఫేజ్‌కు ఆర్సీబీ ఆల్‌రౌండర్ దూరం.. అతడి స్థానంలో ఎవరంటే.. (PC: RCB)
IPL 2021: ఇప్పటికే కోచ్ సైమన్ కటిచ్ సహా పలువురు విదేశీ ప్లేయర్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు దూరమయ్యారు. రెండో ఫేస్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుండగా కీలక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయం కారణంగా తప్పుకున్నాడు.
ఐపీఎల్ 2021 (IPL 2021) రెండో దశ యూఏఈ వేదికగా మరో మూడు వారాల్లో ప్రారంభం కానుండగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆర్సీబీ జట్టులో కీలక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) గాయం కారణంగా రెండో ఫేజ్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఇప్పటికే ఆర్సీబీ జట్టు కోచ్ సైమన్ కటిచ్‌తో సహా పలువురు విదేశీ క్రికెటర్లు (Foreign Players) రెండో దశకు అందుబాటులో ఉండమని చెప్పారు. అలాంటి సమయంలో ఆల్‌రౌండర్ సుందర్ దూరం కావడం జట్టుకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పుకోవచ్చు. భారత జట్టుతో (Team India) కలసి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన వాషింగ్టన్ సుందర్.. దుర్హమ్‌లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ అతడిని తిరిగి ఇండియా పంపించేసింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. మరోవైపు ఇప్పటికే యూఏఈకి పలు జట్లు చేరుకొని సాధన మొదలు పెట్టాయి. ఆర్సీబీ కూడా యూఏఈ బయలు దేరే ముందు తమ జట్టు సభ్యులకు కబురు పెట్టింది. అయితే తాను గాయం నుంచి ఇంకా కోలుకోలేదని సుందర్ సమాచారం ఇచ్చాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ జట్టు సుందర్ లేకుండానే యూఏఈ వెళ్లడానికి నిర్ణయించింది.
వాషింగ్టన్ సుందర్ స్థానంలో బెంగాల్‌కు చెందిన ఆకాశ్ దీప్‌ను ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆర్సీబీ నెట్ బౌలర్‌గా ఉన్న ఆకాశ్ దీప్ ఇక జట్టులో పూర్తి స్థాయి క్రికెటర్‌గా ఉండబోతున్నాడు. ఆర్సీబీ ఇప్పటికే శ్రీలంకకు చెందిన దుష్మంత చమీర, హసరంగలను సెకెండ్ ఫేజ్ కోసం తీసుకున్నది. శ్రీలంక క్రికెట్ వారిద్దరికీ నిరభ్యంతర పత్రాన్ని కూడా జారీ చేసింది. ఇక కొత్తగా ఆకాశ్ దీప్ జట్టులో ఉండబోతున్నాడు. కోచ్ సైమన్ కటిస్ స్థానంలో క్రికెట్ డైరెక్టర్ హెసెన్ ఆ బాద్యతలు స్వీకరించనున్నాడు.
వాషింగ్టన్ సుందర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అనతి కాలంలోనే తనదైన ముద్ర వేశాడు. మొదట్లో కేవలం టీ20లకే పరిమితం అయిన సుందర్ తక్కువ సమయంలోనే టెస్టుల్లో కూడా అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సుందర్ బంతితోనే కాకుండా బ్యాటుతో కూడా రాణించి మంచి ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. ఇక స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో కూడా రాణించాడు. దీంతో అతడిని ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేశారు. కాగా, టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు దుర్హామ్‌లో కౌంటీ సెలెక్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. అప్పుడు బౌలింగ్ వేసింది మహ్మద్ సిరాజ్ కావడం గమనార్హం. గాయంతో ఇండియాకు వెనుదిరిగి వచ్చిన సుందర్ ఇంకా కోలుకోకపోవడంతో ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.