IPL 2021: ఐపీఎల్ 2021 రెండో దశకు మరో అడ్డంకి.. ఆ దేశ ఆటగాళ్లు మెగా లీగ్‌కు డుమ్మా?

ఐపీఎల్ 2021 రెండో ఫేజ్‌కు కొనసాగుతున్న ఆటంగకాలు

ఐపీఎల్ 2021కు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు యూఏఈ వచ్చిన తర్వాత నేరుగా బయో బబుల్‌లో చేరడానికి ఆటంకాలు ఎదురయ్యాయి.

  • Share this:
    కరోనా కారణంగా 29 మ్యాచ్‌ల అనంతరం వాయిదా పడిన ఐపీఎల్ 2021ను (IPL 2021) యూఏఈ వేదికగా నిర్వహించడానికి ఇప్పటికే బీసీసీఐ (BCCI) నిర్ణయించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్‌ కోసం మైదానాలు సిద్దంగా ఉండవని ఐసీసీ (ICC) అభ్యంతర పెట్టినా.. అందు కోసం ఒమన్ క్రికెట్ అసోసియేషన్‌తో కూడా మాట్లాడి అన్ని రకాల అడ్డంకులు బీసీసీఐ సరి చేసింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ వల్ల ఐపీఎల్ తొలి వారానికి ఇబ్బంది కలుగుతుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో మాట్లాడి ఆ లీగ్ తేదీలను కూడా ముందుకు జరిపించింది. ఇలా ఒక్కొక్క ఆటంకాన్ని అధిగమిస్తూ వస్తున్న బీసీసీఐకి తాజాగా దక్షిణాఫ్రికా ఆటగాళ్ల ద్వారా మరో సమస్య ఎదురైంది. సఫారీ క్రికెటర్లు అయిన లుంగి ఎన్‌గిడి, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ తదితర క్రికెటర్లు ఐపీఎల్ రెండో దశ మొదటి వారం అందుబాటులో ఉండకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. సౌతాఫ్రికా జట్టు శ్రీలంకలో సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 14 వరకు పర్యటించనున్నది. ఐపీఎల్ రెండో దశ ప్రారంభానికి కేవలం 5 రోజుల ముందు శ్రీలంక పర్యటన ముగియనున్నది. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది.

    యూఏఈ ప్రభుత్వం శ్రీలంకను రెండ్ లిస్ట్‌లో పెట్టింది. ఆ దేశం నుంచి వచ్చే పౌరులను యూఏఈలోకి అనుమతించడానికి చాలా కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నది. శ్రీలంక పర్యటనలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు బయోబబుల్లోనే ఉంటారు. కానీ అక్కడి బయోబబుల్ నుంచి యూఏఈలోని ఐపీఎల్ బయో బబుల్‌లోనికి ఆటగాళ్లను అనుమతించడానికి యూఏఈ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. కనీసం 10 రోజుల క్వారంటైన్‌లో ఉంటేనే కానీ.. ఐపీఎల్ బబుల్ లోనికి ఎంటర్ అవడానికి వీలుండదని అధికారులు చెబుతున్నారు. దీంతో సెప్టెంబర్ 14న శ్రీలంక నుంచి వచ్చినా.. వారిని నేరుగా అనుమతించబోమని యూఏఈ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఆయా ఫ్రాంచైజీలు దక్షిణాఫ్రికా ఆటగాళ్ల కోసం వేచి చూడక తప్పట్లేదు.

    మరోవైపు వెస్టిండీస్ ఆటగాళ్లు కిరాన్ పొలార్డ్, క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ వంటి క్రికెటర్లు కరేబియన్ ప్రీమియర్ లీగ్ పూర్తి చేసుకొని నేరుగా ఇక్కడి బయోబబుల్‌లోనికి ఎంటర్ అవడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. సెయింట్ లూసియా నుంచి చార్టెడ్ ఫ్లయిట్‌లో ఆ క్రికెటర్లు యూఏఈ చేరుకొని ఆయా ఫ్రాంచైజీల్లో చేరిపోతారు. కరేబియన్ దీవులపై ఎలాంటి ఆక్షలు లేనందునే వారికి ఈ వెసులు బాటు ఉన్నది. ఇక బంగ్లాదేశ్ పర్యటన సందిగ్దంలో పడటంతో ఇంగ్లాండ్ క్రికెట్లు ఐపీఎల్‌కు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. ఇండియాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఆయా ఆటగాళ్లు యూఏఈ వస్తున్నట్లు సమాచారం.
    Published by:John Naveen Kora
    First published: