సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు తమ చెత్త ప్రదర్శనను కొనసాగిస్తూనే ఉంది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన చోట టెస్టు బ్యాటింగ్ తో ఫ్యాన్స్ కు కోపం తెప్పించేలా చేస్తోంది. వరుసగా ఐదు విజయాలతో ప్లే ఆఫ్స్ పై ఆశలు కల్పించిన సన్ రైజర్స్ అంతలోనే పేలవ ఆట తీరుతో వరుసగా ఐదు మ్యాచ్ లో ఓడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 55 పరుగుల తేడాతో దారుణ పరాభవాన్ని మూట గట్టకుంది. అధికారికంగా ప్లే ఆఫ్స కు చేరే అవకాశాలు ఉన్నా.. హైదరాబాద్ ఆటతీరును చూస్తే అది కష్టంగానే కనిపిస్తోంది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసి ఓడింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన కేకేఆర్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. భారీ విజయం సాధించడంతో మెరుగైన నెట్ రన్ రేట్ సాధించి పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో 6వ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 10 పాయింట్లతో 8వ స్థానానికి పడిపోయింది.
ఇక, ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కేకేఆర్ ఇన్నింగ్స్ 12 ఓవర్‌లో టి నటరాజన్.. రింకూ సింగ్‌కు అద్భుతమైన యార్కర్ వేశాడు. రింకూ ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ ప్యాడ్‌కు తాకింది. అయితే వెంటనే బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేశారు. ఈ క్రమంలో అంపైర్ దాన్ని ఔట్ గా ప్రకటించాడు.అయితే నాన్ స్ట్రెక్‌లో ఉన్న బిల్లింగ్స్, రింకూ చర్చించుకున్న తర్వాత రివ్యూ తీసుకున్నారు.
అయితే రివ్యూను ఫీల్డ్ అంపైర్‌లు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే రివ్యూ సిగ్నల్‌ను రింకూ కాకుండా బిల్లింగ్స్ ఇవ్వడమే దీనికి కారణం. డీఆర్‌ఎస్ రూల్స్ ప్రకారం.. బ్యాటర్ స్వయంగా రివ్యూకు సిగ్నల్ ఇవ్వాలి. అయితే బిల్లింగ్స్ సిగ్నల్ ఇవ్వడంతో అంపైర్‌లు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఫీల్డ్‌లో కాసేపు గందరగోళం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— Varma Fan (@VarmaFan1) May 14, 2022
అయితే రూల్స్ ప్రకారం ఔటైన బ్యాటర్ సమీక్ష కోసం టీ బార్ సిగ్నల్ ఇవ్వాలి. కానీ బిల్లింగ్స్ ఇచ్చాడు కదా అని రింకూ అలసత్వం ప్రదర్శించడంతో అంపైర్లు మెడపట్టి గెంటేసే పరిస్థితి వచ్చింది. కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ సైతం ఫోర్త్ అంపైర్‌తో ఈ వ్యవహారంపై మాట్లాడాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఫీల్డ్ అంపైర్లదగ్గర నుంచి థర్డ్ అంపైర్ల వరకు తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదానికి కేంద్రంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో థర్డ్ అంపైర్ నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. అంపైర్లు చేస్తోన్న తప్పిదాలతో జట్ల ఫలితాలు తారుమారు అవుతున్నాయ్. ఫీల్డ్ అంపైర్స్ నుంచి థర్డ్ అంపైర్ వరకు చూసుకుంటే తమ తప్పుడు నిర్ణయాలతో ఆటగాళ్లను బలిచేశారు. ముఖ్యంగా కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఔట్ విషయంలో అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL 2022, Kolkata Knight Riders, Sunrisers Hyderabad, Viral Video