అందరూ ఊహించినట్టుగానే జరిగింది. టీమిండియా (Team India) టీ20 క్రికెట్ జట్టుకు పూర్తిస్థాయి నాయకత్వ మార్పిడి జరిగింది. టీమిండియా టి20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. టి20 ప్రపంచకప్ తర్వాత టీ-20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ (Virat Kohli) తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లి స్థానంలో మరో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మను ఈ ఫార్మాట్లో కెప్టెన్‌గా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ రోహిత్ శర్మకే టి20 పగ్గాలు అప్పగించింది. కేఎల్ రాహుల్ (KL Rahul) వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇక నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది.
కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకోవడంతో.. జట్టు పగ్గాలను స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు అందించింది. ఇకపై టీ20లకు రోహిత్ నాయకత్వం వహించనున్నాడు. మరోవైపు వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. ఇక ఇప్పుడు టెస్టు జట్టు కెప్టెన్సీపై చర్చలు మొదలయ్యాయి. భారత టీ20 జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికవడంతో టెస్టు సారథ్యంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒకవేళ రెగ్యులర్ సారథి విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్‌గా తప్పుకొంటే.. ఎవరికి పగ్గాలు అప్పజెప్పాలనే విషయంపై బీసీసీఐకి ఓ స్పష్టత లేదని తెలుస్తోంది.
టీ20 సిరీస్ తర్వాత న్యూజిలాండ్, భారత్ జట్లు రెండు టెస్టుల్లో తలపడనున్నాయి. ఈ పర్యటనలోని టీ20 సిరీస్‌కు కోహ్లీకి బీసీసీఐ సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. అయితే రెండు టెస్టులకు కూడా విరాట్ అందుబాటులో ఉండడని తెలుస్తోంది. దీంతో ఈ టెస్టులకు ఎవరు సారథ్యం వహిస్తారనే ప్రశ్న ఇప్పుడు అందరి మనస్సులో ఉంది. ఇందులో అజింక్య రహానే ముందు వరసలో ఉన్నా.. రోహిత్ కూడా రేసులో ఉన్నాడు.
ఇప్పటికే టెస్టు జట్టులో రెగ్యులర్‌గా ఆటగాడిగా కొనసాగుతున్న అజింక్య రహానే.. విరాట్ కోహ్లీకి డిప్యూటీగా సేవలందిస్తున్నాడు. కానీ ఇటీవలి కాలంలో బ్యాటింగ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో చెప్పుకోదగిన ఒక్క ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అంతకుముందు ఆసీస్ పర్యటనలో మాత్రం ఒక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మెల్బోర్న్ టెస్టులో సెంచరీ చేసిన జింక్స్.. మిగతా అన్ని మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు.
ఒకవేళ అతడు జట్టులో చోటు లేకపోతే.. జట్టు పరిస్థితి వేరేలా ఉంటుంది. మరోవైపు టీ20 జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ కొంతకాలంగా టెస్టుల్లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో బీసీసీఐ సెలెక్టర్లతో పాటు కొత్త కోచ్ ద్రావిడ్ కూడా రోహిత్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. అయితే కోహ్లీ ఉన్నాడు కాబట్టి ఇప్పుడే టెస్టు కెప్టెన్సీ విషయంలో మార్పులు ఉండకపోవచ్చు.
ఈ రెండు టెస్టులకు ఎవరు కెప్టెన్‌గా ఉంటారో చూడాలి. ఇక వన్డే ఫార్మాట్లోనూ కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మకే పగ్గాలు ఇవ్వాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అయితే భారత జట్టు వచ్చే జనవరిలో దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ ఆడనుండటంతో అప్పుడే ఈ మార్పు జరిగే అవకాశముంది. రాహుల్ ద్రావిడ్ కూడా ఇదే విషయాన్ని సూచనగా చెప్పాడు.
బ్యాటర్ గా సూపర్ సక్సెస్ అందుకున్న కోహ్లి కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ నుంచి మొదలుకొని.. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్.. తాజాగా టి20 ప్రపంచకప్ వరకు కోహ్లికి కెప్టెన్‌గా కలిసిరాలేదనే చెప్పాలి. ఓవరాల్‌గా కోహ్లి టి20ల్లో 49 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. టీమిండియా 31 మ్యాచ్‌లు గెలిచి 16 ఓడిపోయింది. 63.27 శాతంతో కెప్టెన్‌గా మెరుగైన రికార్డు కలిగి ఉన్న కోహ్లికి ఎందుకో ఐసీసీ ఫార్మాట్లో మాత్రం దురదృష్టమే ఎదురవుతూ వస్తోంది. ఇక వన్డే, టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించనున్న కోహ్లి 2023 వన్డే వరల్డ్‌కప్ అయినా సాధిస్తాడా అనేది ప్రశార్నర్థకమే.అందుకే.. వన్డే కెప్టెన్సీలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందని.. రోహిత్‌కు వన్డే, టి20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పి.. కోహ్లిని కేవలం టెస్టు కెప్టెన్‌గా పరిమితం చేయాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs newzealand, Rohit sharma, Team India, Virat kohli