AJAZ PATEL N KARUN NAIR AND ANDY SANDHAM DROPPED AFTER SCORING TRIPLE CENTURY OR 10 WICKET HAUL JNK
Ajaj Patel: చారిత్రాత్మక బౌలింగ్ తర్వాత కూడా జట్టులో స్థానం కోల్పోయిన అజాజ్ పటేల్.. ఇతనిలాంటి దురదృష్టవంతులు ఇంకా ఎవరున్నారంటే..
ఈ క్రికెటర్లు నిజంగా దురదృష్టవంతులే..
Ajaj Patel: ముంబై టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టిన తర్వాత కూడా న్యూజిలాండ్ ఆటగాడు అజాజ్ పటేల్ జట్టుకు దూరమయ్యాడు. అయితే చారిత్రాత్మక ప్రదర్శన చేసిన తర్వాత కూడా జట్టు నుండి తొలగించబడిన మొదటి క్రికెటర్ అజాజ్ పటేల్ మాత్రమే కాదు. ఈ జాబితాలో కరుణ్ నాయర్, ఆండీ సంధమ్, జాసన్ గిల్లెస్పీ కూడా ఉన్నారు. వీరిలో ఇద్దరు ఆటగాళ్లు ట్రిపుల్ సెంచరీ, ఒక ప్లేయర్ డబుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా తదుపరి మ్యాచ్ ఆడలేకపోయారు.
ఒక బౌలర్ ప్రత్యర్థి జట్టును ఒంటరిగా ఆల్ఔట్ (All Out) చేసి.. తదుపరి మ్యాచ్ నుండి తొలగించబడితే ఏమి చెప్పాలి. ఇటీవలే టీమ్ ఇండియాను (Team India) ఆలౌట్ చేసిన అజాజ్ పటేల్ (Ajaj Patel) విషయంలో ఇదే జరిగింది. ముంబై టెస్టు (Mumbai Test) తొలి ఇన్నింగ్స్‌లో అజాజ్ పటేల్ మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చారిత్రాత్మక ప్రదర్శన చేసిన తర్వాత కూడా జట్టుకు దూరమయ్యాడు. అయితే ఇలా అద్భుత ప్రదర్శన తర్వాత కూడా జట్టు నుంచి స్థానం కోల్పోయిన క్రికెటర్ అజాజ్ మాత్రమే కాదు. అంతకు ముందు టీమ్ ఇండియా ఓపెనర్ కరుణ్ నాయర్ (Karun Nair), ఆండీ సంధమ్ మరియు జాసన్ గిల్లెస్పీల (Jason Gillespie) పరిస్థితి కూడా అలాగే ఉంది. టెస్టు మ్యాచ్‌లో 325 మరియు 50 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడిన తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన ఆండీ సంధమ్ను ఎప్పుడూ జట్టులోకి తీసుకోలేదు.
న్యూజిలాండ్ టెస్ట్ జట్టు నుండి తొలగించబడిన అజాజ్ పటేల్ గురించి చెప్పాలంటే... బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం న్యూజిలాండ్ బుధవారం 13 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో ఎడమ చేతి వాటం స్పిన్నర్ అజాజ్ పటేల్‌కు చోటు దక్కలేదు. ఈ నెలలో ముంబైలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఎజాజ్ మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. అతను ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. ఇది ప్రపంచ రికార్డు. ప్రపంచంలో కేవలం ముగ్గురు బౌలర్లు మాత్రమే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయగలిగారు. అజాజ్ పటేల్ కంటే ముందు అనిల్ కుంబ్లే, జిమ్ లేకర్ ఈ ఘనత సాధించారు.
అజాజ్ పటేల్‌కు ఇలా జరిగినందుకు సోషల్ మీడియా వేదికగా సానుభూతి వ్యక్తం అవుతున్నది. అయితే అజాజ్ గురించి బాధపడాల్సిన అవసరం లేదని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ స్పష్టంగా చెప్పాడు. అతడికి మరో అవకాశం వస్తుందని కోచ్ చెప్పాడు. అయితే చారిత్రాత్మక ప్రదర్శన చేసి జట్టుకు దూరమవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇలాగే ఇంగ్లండ్‌కు చెందిన ఆండీ సంధమ్కి కూడా జరిగింది. 1930లో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ హాబ్స్ మరియు హెర్బర్ట్ సట్ఫ్లిక్ గాయం కారణంగా ఆడలేనప్పుడు.. ఆండీ సన్ధమ్కు అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆండీ సంధమ్ మ్యాచ్‌లో 375 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 325, రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగులు చేశాడు. ఇది అతడి దురదృష్టమో సెలెక్టర్ల అన్యాయమో కానీ.. వాస్తవం ఏమిటంటే ఇది సంధామ్ యొక్క చివరి టెస్ట్ మ్యాచ్ గా మిగిలిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత అతడిని జాతీయ జట్టులోకి ఎన్నడూ చేర్చలేదు.
ఆస్ట్రేలియా ఆటగాడు జాసన్ గిల్లెస్పీ అదృష్టం కూడా బాగాలేదని చెప్పక తప్పదు. గిల్లెస్పీ ఒక స్పెషలిస్ట్ బౌలర్. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కూడా బాగా చేసేవాడు. అతను ఏప్రిల్ 2006లో బంగ్లాదేశ్‌తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో గిల్లెస్పీ 201 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. విచిత్రమేమిటంటే ఈ ప్రదర్శన చేసిన తర్వాత అతను ఆస్ట్రేలియా జట్టు నుండి తొలగించబడ్డాడు. భారత్ ఆటగాడు కరుణ్ నాయర్‌కు కూడా గిల్లెస్పీ లాంటి అనుభవమే ఎదురైంది. డిసెంబర్ 2016లో చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 303 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కానీ బంగ్లాదేశ్‌తో తదుపరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు ను ప్రకటించినప్పుడు అందులో కరుణ్ నాయర్ పేరు లేదు. అయితే మూడు నెలల తర్వాత ఆస్ట్రేలియాపై కరుణ్ నాయర్‌కు రెండో అవకాశం లభించింది. కానీ ఈసారి అతడి ఫామ్ సరిగా లేదు. అతను 3 మ్యాచ్‌లలో 4 ఇన్నింగ్స్‌లలో 54 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.