ప్రపంచంలో పలు క్రీడలకు (Sports) సంబంధించి ఎన్నో టోర్నీలు, చాంపియన్‌షిప్‌లు, ప్రపంచ కప్‌లు ఉన్నాయి. కానీ వీటన్నింటి కంటే ఒలంపిక్స్‌కు(Olympics) ఉండే ప్రాధాన్యతే వేరు. ప్రతీ క్రీడాకారుడు/క్రీడాకారిణి జీవితంలో ఒక్కసారైనా ఒలంపిక్ పోడియం ఎక్కి పతకాన్ని ధరించాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటారు. ఇందుకోసం ఎన్నో ఏళ్లుగా శ్రమపడుతుంటారు. ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన తర్వాత అక్కడ ఎవరెవరు ప్రత్యర్థులుగా ఉంటారో ఊహించి వారిపై ఎలా విజయం సాధించాలో ప్రణాళికలు రచిస్తుంటారు. అనుకోకుండా బలమైన ప్రత్యర్థులు అనుకున్న వాళ్లు పోటీలో లేకుంటా ఆ ఆనందమే వేరు. తాజాగా నార్త్ కొరియా (North Korea) ఒలంపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ దేశానికి చెందిన అథ్లెట్లు టోక్యో ఒలంపిక్స్‌లో(Tokyo Olympics) పాల్గొనబోరని నార్త్ కొరియా నేషనల్ ఒలంపిక్ కమిటీ స్పష్టం చేసింది. దీంతో భారత ఆటగాళ్ల శిబిరంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. 'నార్త్ కొరియా తప్పుకోవడం మాకు పెద్ద రిలీఫ్. ఇక మా దృష్టంతా చైనాపై పెడతాము' అని భారత వెయిట్ లిఫ్టింగ్ కోచ్ విజయ్ శర్మ అన్నారు.
నార్త్ కొరియా బరిలో లేకపోవడం వల్ల భారత్‌కు చెందిన మీరాబాయ్ చాను (Mirabai Chanu), వినేష్ ఫొగట్లకు(Vinesh Phogat) ఒలంపిక్ పతకం కొట్టడం కొంచెం ఈజీ అవుతుంది. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను భారత్ తరపున పాల్గొంటున్నది. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్‌లో 4వ స్థానంలో చాను ఉండగా.. ఆమెకు ముందు ఇద్దరు చైనీస్ లిఫ్టర్లు ఉన్నారు. ఇక మూడో స్థానంలో నార్త్ కొరియాకు చెందిన రిసోంగ్ గుమ్ ఉన్నది. ఈ ముగ్గురు లిఫ్టర్లకు 200 కేజీల పైగా బరువు ఎత్తిన రికార్డు ఉన్నది. ఇప్పుడు నార్త్ కొరియాకు చెందిన లిఫ్టర్ తప్పుకోవడంతో చాను చైనీస్ లిఫ్టర్లతో పోటీ పడితే సరిపోతుంది. ఒలంపిక్ రూల్ ప్రకారం ఒక విభాగంలో ఒక దేశం నుంచి ఒకరే పోటీ పడాలి. అంటే ఇద్దరు చైనీస్ బదులు చాను ఒకరితో పోటీ పడితే పతకాన్ని ఖాయం చేసుకోవచ్చు.
ఇక స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్‌కు కూడా మంచి అవకాశం కలసి వచ్చింది. 53 కేజీల విభాగంలో ఫొగట్‌కు నార్త్ కొరియాకు చెందిన పాక్ యంగ్ మీ నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నది. అయితే ఈ కేటగిరీలో పాక్ యంగ్ మీ పాల్గొనడం లేదు. దీంతో ఫొగట్ జపాన్‌కు చెందిన మాయు ముకైదాతో పోటీ పడాలి. గతంలో మాయుపై ఫొగట్ ఓడిపోయింది. దీంతో మరోసారి ఆమెతో తలపడిన ఆటలో లోపాలను గుర్తించి వాటిని సరి చేసుకుంటే ఫొగట్ కూడా ఒలంపిక్ పతకం సాధించే అవకాశం ఉన్నది.